అనంతపురం: అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసులో సూత్రదారులైన కొంత మంది పోలీసులపై చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు పాత్రదారులను వదిలేశారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆక్షేపించారు. రాజకీయ నాయకుల ప్రమేయంతోనే ఈ వ్యవహారం నడిచిందని అనంతపురంలోని వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. జిల్లా ప్రతిష్టను దెబ్బతీసేలా సాగుతున్న ఈ చీకటి దందాపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రెస్‌మీట్‌లో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే.. - అనంతపురం జిల్లాకు మాయని మచ్చ ఇవాళ రాష్ట్రమంతా అనంతపురం జిల్లా వైపు చూస్తోంది. జిల్లా ప్రజలంతా సిగ్గుపడే విషయాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సత్య సాయిబాబా, విన్సెట్ ఫెర్రర్, తరిమెళ్ల నాగిరెడ్డి లాంటి గొప్ప కారణజన్ములు పుట్టిన నేల ఇది. రైతులు పండించే పండ్ల రుచితో ‘ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీ’గా పేరుగాంచిన ఈ ప్రాంతం, గతంలో ఫ్యాక్షన్ మచ్చలు మోసుకున్నా ఇప్పుడు అలాంటి దశను దాటింది. అయితే మళ్లీ కొన్ని ఘటనలు జిల్లాకు మచ్చ తెస్తున్నాయి. తేనే పూసిన మాటలు, తేనే పూసిన కత్తులు కూడా ఈ నేల చూసింది. కానీ ఇప్పుడు వెలుగులోకి వచ్చిన హనీట్రాప్ వ్యవహారం అత్యంత ఆందోళనకరం. డబ్బు, స్థాయి ఉన్న వారిని టార్గెట్ చేస్తూ, వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పెట్టి, ఆకర్షణీయమైన ప్రొఫైల్‌లతో వారిని వలలో వేసి, వ్యక్తిగత ప్రదేశాలకు తీసుకెళ్లి వీడియోలు తీసి, తర్వాత బెదిరింపులతో ఆస్తులు రాయించుకోవడం, డబ్బులు వసూలు చేయడం వంటి మాఫియా ఇక్కడ నడుస్తోంది. - పాత్రదారుల వరకు మాత్రమే పరిమితం అవుతారా? పోలీసులకు నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా.. డీఐజీ గారు, మీరు పాత్రదారుల వరకు మాత్రమే పరిమితం అవుతారా? కొంత మంది పోలీసులను డిస్మిస్ చేసి, బదిలీ చేస్తే సరిపోతుందా? సూత్రధారులను వదిలేస్తారా? అసలు సూత్రధారులను అరెస్టు చేయలేరా? ఏ నియోజకవర్గంలోనైనా స్థానిక ఎమ్మెల్యేల సిఫార్స్‌తోనే ఎస్‌ఐలు, సీఐలు నియమితులవుతారు. అలా పోస్టింగులు పొందిన తర్వాత కోట్ల రూపాయల దందాలు చేస్తూ, స్థానిక ఎమ్మెల్యేలకు కమీషన్లు ఇవ్వడం లేదా? టీడీపీ ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్న వారి కుటుంబ సభ్యులకు మామూళ్లు అందడం లేదా? - రంగమ్మ పరిటాల సునీత అనుచరురాలే సెవెన్‌హిల్స్ హోటల్ నిర్వాహకురాలు రంగమ్మ, అంపాపురం ఎంపీటీసీ రవికి సన్నిహితురాలిగా, భార్యగా పిలువబడుతోంది. ఈమె ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరురాలే. ఈమె గత చరిత్ర కూడా వివాదాస్పదంగా ఉంది. రాప్తాడు ప్రాంతంలో జరిగిన చిత్ర మురళి హత్య కేసులో కూడా ఆమె పాత్ర ఉందనే ఆరోపణలు వినిపించాయి. అలాగే ఆమె మరదిపై కాల్పులు జరిగిన ఘటన, షేక్షన్‌పల్లెకు చెందిన ఒక వ్యక్తి హత్య కేసులో ఆమె భర్త జైలుకు వెళ్లిన విషయాలు కూడా ప్రస్తావనలోకి వస్తున్నాయి. ఆ కేసుల్లో ముద్దాయిలుగా పేర్కొనబడిన మనోహర్ నాయుడు, జయకృష్ణ వంటి వ్యక్తులు కూడా పరిటాల సునీత అనుచరులేనని చెబుతున్నారు. - పరిటాల సునీతకు సంబంధం లేదని చెప్పడం హాస్యాస్పదం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తమ్ముడు మురళితో సీఐ శ్రీహర్ష నిత్యం టచ్‌లో ఉండేవాడు. మురళి కనుసన్నల్లోనే ఈ వసూళ్ల వ్యవహారం సాగింది. హనీట్రాప్ వ్యవహారంలో సీఐలు, పోలీసులపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం, రాప్తాడు ఎమ్మెల్యే సునీతకు ఈ కేసులో సంబంధం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మురళి ప్రమేయం లేకుండా ఇంత పెద్ద హనీట్రాప్ దందా ఎలా సాగుతుంది?. ఈ జిల్లాకు చెందిన కొందరు బీజేపీ నాయకులు, మురళి తదితరులు కలిసి నాలుగు ముఠాలుగా ఏర్పడి ఆర్థికంగా బలమైన వ్యక్తులను టార్గెట్ చేస్తూ, వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని వలపు వలలో వేసి, దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. - రాజకీయ మద్దతుతో చీకటి పనులు సిగ్గుచేటు నాయకుల ఆదాయాల కోసం రంగమ్మ, అనంతకుమారి లాంటి వ్యక్తులను అడ్డంగా పెట్టుకుని నడిపిస్తున్న ఈ చీకటి దందా సజావుగా సాగడం దురదృష్టకరం. పేద కుటుంబాల ఆడపిల్లలను వాడుకుని, వారిని ఈ దందాలోకి నెట్టడం, రాజకీయ మద్దతుతో ఇలాంటి పనులు చేయడం సిగ్గుచేటు కాదా? హనీట్రాప్ పేరుతో డబ్బులు, ఆస్తులు సంపాదించడం న్యాయమా? అమ్మాయిల మానప్రాణాలతో ఆడుకోవడం ఎంతవరకు సమంజసం? మీ రాజకీయాల కోసం వారి జీవితాలను పణంగా పెడతారా? - నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలి హనీట్రాప్‌లో భాగస్వాములైన రాజకీయ నాయకులను వదిలేసి, కేవలం చిన్నస్థాయి అధికారులను సస్పెండ్ చేస్తూ విచారణ జరిపితే సహించం. హనీట్రాప్ కేసుపై సీబీఐ లేదా సీఐడీతో నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలి. గతంలో కాల్‌మనీ సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు హనీట్రాప్ రూపంలో కొత్తగా ప్రజలను మోసం చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది? దీనికి రాజకీయ రంగు పులమకుండా, నిజాలను వెలికితీసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.