ప్రజలకు నేనున్నాననే భరోసా ఇచ్చిన క్షణాలవి 

వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారి పాద‌యాత్ర‌ను గుర్తు చేసుకుంటూ వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌

తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి, దివంగత మహానేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రను గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర గతిని మార్చేసిన ఆ ఘట్టానికి నేటితో 23 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా.. ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవడానికి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఆ పాదయాత్ర.. చరిత్రనే తిరగరాసిందని వైయ‌స్ జగన్‌ పేర్కొన్నారు.

2003 ఏప్రిల్‌ 9వ తేదీన ఎర్రటి ఎండలో వైయ‌స్ఆర్‌ మొదలుపెట్టిన పాదయాత్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపిందని.. “నేనున్నాననే భరోసా ఇచ్చింది” అని వైయ‌స్ జగన్‌ అన్నారు. రాష్ట్ర ప్రజలు ఆ పాదయాత్రకు మద్దతుగా నిలిచి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసిన సందర్భాన్ని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉచిత విద్యుత్‌ ఫైల్‌పై తొలి సంతకం చేసిన వైయ‌స్ఆర్ .. రైతులను రాజులుగా నిలిపారని, పేదలకు, బలహీన వర్గాలకు భరోసా ఇచ్చారని వైయ‌స్ జగన్‌ గుర్తు చేశారు.

అలాగే, వైయ‌స్‌ చేపట్టిన సంస్కరణలు, పథకాలు రాష్ట్ర రూపురేఖలను మార్చేశాయని, పేద పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లు అయ్యేలా విద్యా అవకాశాలు కల్పించారన్నారు. సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు పోలవరం పనులను వేగవంతం చేసిన వైయ‌స్ఆర్ ముద్రను ఎవరూ చెరిపేయలేరని వైయ‌స్ జగన్‌ అన్నారు. తండ్రి పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. తన ప్రయాణం కొనసాగుతుందని వైయ‌స్ జగన్ త‌న ఎక్స్ ఖాతాలో  ట్వీట్ చేశారు.

Back to Top