అనంతపురం: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం వల్ల పేదల కడుపులు మాడిపోతున్నాయని వైయస్ఆర్‌సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. గతేడాది డిసెంబర్ నుంచి పనులు చేసిన కూలీలు ఇప్పటికీ తమ కూలి డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు. మండుటెండల్లో 45 డిగ్రీల ఎండను లెక్కచేయకుండా కష్టపడుతున్న కార్మికులకు కనీస వేతనం కూడా అందకపోవడం అత్యంత దుర్భర పరిస్థితి అని అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద నిబంధనల ప్రకారం 15 రోజుల్లో వేతనాలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో లక్షలాది కూలీలు వేతనాల కోసం ఎదురుచూస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు పుట్టిన రోజు సంబరాలలో మునిగితేలుతున్నారని ఆక్షేపించారు. ప్రెస్‌మీట్‌లో వెన్నపూస రవీంద్రారెడ్డి ఏమన్నారంటే.. - సంక్షేమ పథకాలు కరువై.. 2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఈ రెండేళ్లలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదు. పేదలకు సర్కార్ నుంచి ఎలాంటి సాయం లేదు. మండుటెండలో కష్టపడి పని చేసిన ఉపాధి హామీ పథకం కూలీలకు నెలల తరబడి ప్రభుత్వం కూలి డబ్బులు చెల్లించకుండా పస్తులు పెడుతోంది. గత ఏడాది డిసెంబర్ మొదటి వారం తర్వాత నుంచి పనులు చేసిన కూలీలంతా ఇప్పటికీ వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.812 కోట్లు, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి చేసిన పనులకు మరో రూ.195 కోట్లు కలిపి మొత్తం రూ.1,007 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. నిబంధనల ప్రకారం గరిష్టంగా 15 రోజుల్లో వేతనాలు ఇవ్వాల్సి ఉన్నా, ఆచరణలో అమలు కావడం లేదు. - ‘ఉపాధి’లో కూటమి ప్రభుత్వం విఫలం చేసిన పనికి వంద శాతం కూలి డబ్బులు కేంద్రమే చెల్లించే ఎంజీఎన్ఆర్ఈజీఏ అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. గతంలో శ్రీ వైయస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2023–24 ఆర్థిక సంవత్సరంలో 25.55 కోట్ల పని దినాలు కల్పించగా, 2025–26లో అది కేవలం 18.59 కోట్లకు పడిపోయింది. అంటే దాదాపు 7 కోట్ల పని దినాలు తగ్గిపోయాయి. 2023–24లో పేదలు రూ.6,277 కోట్ల ప్రయోజనం పొందగా, 2025–26లో అది రూ.4,952 కోట్లకు పరిమితమైంది. దీంతో సుమారు రూ.1,325 కోట్ల మేర ఆదాయం కోల్పోయారు. 2023–24లో 75.43 లక్షల మందికి పనులు లభించగా, 2025–26లో కేవలం 67.62 లక్షల మందికి మాత్రమే అవకాశాలు దక్కాయి. అంటే దాదాపు 8 లక్షల మంది ఉపాధి కోల్పోయినట్టే. ఒక్కో కుటుంబానికి లభించే పని దినాలు కూడా 55 రోజుల నుంచి 43 రోజులకు తగ్గిపోయాయి. - పవన్ కళ్యాణ్‌కు కూలీల ఆకలి కేకలు వినిపించడం లేదా? ఉపాధి హామీ పథకం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని పంచాయతీరాజ్ శాఖలో భాగంగా ఉండగా, ఆయనకు ఉపాధి కూలీల ఆకలి కేకలు వినిపించడం లేదా? కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్..గ్రామీణాభివృద్ధి శాఖ పట్టదా? ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుపై దృష్టి సారించి పేదలకు అన్నం పెట్టే ఉపాధి హామీ పథకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రశ్నించిన వారిని అక్రమ కేసులతో అరెస్టు చేస్తున్న ఈ ప్రభుత్వం..ఇవాళ కూలి డబ్బులు అందక గొంతెత్తున్న వారిని కూడా అరెస్టు చేయిస్తారా?. 2024–25తో పోలిస్తే 2025–26లో రాష్ట్రంలో పేదలు సుమారు రూ.1,232 కోట్ల మేర నష్టపోయారు. ఇందులో దాదాపు 40 శాతం అంటే రూ.484 కోట్ల మేర ఎస్సీ, ఎస్టీ కుటుంబాలే నష్టపోయాయి. 2024–25లో 24.22 కోట్ల పని దినాలు కల్పించగా, 2025–26లో అవి 18.59 కోట్లకు పడిపోయి 23.2 శాతం తగ్గుదల నమోదు అయ్యింది. - నాడు కరోనా సమయంలోనూ `ఉపాధి` గతంలో వైయస్ జగన్ ప్రభుత్వంలో పేదలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించారు, కరోనా సమయంలో కూడా కోట్లాది మంది కూలీలకు పనులు కల్పించారు. 2023–24లో 25.55 కోట్ల పని దినాలు కల్పించగా, 2025–26లో కేవలం 18.59 కోట్లకే పరిమితమైంది. దీంతో పేదలు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయారు. కూటమి ప్రభుత్వం చేసిన అక్రమాలు, అన్యాయాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. కూలీలకు రావాల్సిన ప్రతి రూపాయి చెల్లించాల్సిందే. వచ్చేది జగన్ ప్రభుత్వమే. 2029లో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధిక మెజారిటీతో ఏర్పడి, దోచుకున్న ప్రతి పైసాను తిరిగి వసూలు చేస్తుంది అని వెన్నపూస రవీంద్రారెడ్డి స్పష్టం చేశారు.