రాజమండ్రి: మహిళా బిల్లు సాక్షిగా తెలుగుదేశం పార్టీ కపట బుద్ధి, కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు నడుపుతున్న రహస్య లాలూచీ రాజకీయాలు దేశ ప్రజల ముందు బట్టబయలయ్యాయని మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. సోమవారం రాజమండ్రిలోని వైయస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒకవైపు కాంగ్రెస్‌ను విమర్శిస్తూనే, మరోవైపు ఆ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీడీపీ నేతలు చెట్టాపట్టాలేసుకుని తిరగడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని మనండిపడ్డారు. టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరిపై నిప్పులు చెరుగుతూ.. 80 ఏళ్ల వయసులో కేవలం మంత్రి పదవి దక్కించుకోవాలనే ఆశతో వైయస్. జగన్ పై పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. పరిటాల రవి, వివేకానందరెడ్డి హత్య కేసులపై బుచ్చయ్య చేస్తున్న వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి, రాజకీయ దిగజారుడుతనానికి అద్దం పడుతున్నాయని ఎద్దేవా చేశారు. రాజమండ్రి అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరిన భరత్.. ఇసుక, లిక్కర్ మాఫియాలకు అడ్డాగా మారిన రాజమండ్రిలో కూటమి నేతల దోపిడీని అడ్డుకోలేని వారు, జగన్ గారిపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని ధ్వజమెత్తారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే... టీడీపీ - కాంగ్రెస్ రహస్య బంధం మహిళా బిల్లు విషయంలో తెలుగుదేశం పార్టీ కపట బుద్ధి దేశవ్యాప్తంగా బయటపడింది. పార్లమెంటులో కాంగ్రెస్ మహిళా బిల్లును వ్యతిరేకిస్తే, అదే రోజు టీడీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డితో ఫోటోలు దిగడం వారి లాలూచీకి నిదర్శనం. ఒకవైపు కాంగ్రెస్‌ను విమర్శిస్తూనే, మరోవైపు ఆ పార్టీతో 'హాట్ లైన్' సంబంధాలు నడుపుతూ ప్రజల చెవిలో పూవ్వులు పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. బుచ్చయ్య చౌదరి అసత్యాల పర్వం.. దఫాలుగా ఎమ్మెల్యేగా ఉన్న బుచ్చయ్య చౌదరి, 80 ఏళ్ల వయసులో కేవలం మంత్రి పదవి కోసం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. పరిటాల రవి హత్యలో వైయస్. జగన్ కి సంబంధం ఉందనడం అత్యంత దుర్మార్గం. నాడు పరిటాల రవి హత్య వెనుక జేసీ సోదరులు ఉన్నారని చెప్పిన చంద్రబాబు, వారికే టిక్కెట్లు ఇచ్చి ఎందుకు గెలిపించారో బుచ్చయ్య చౌదరి సమాధానం చెప్పాలి. వేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చినా ఇంకా అబద్ధాలు ప్రచారం చేయడం సిగ్గుచేటు. వైయస్ కుటుంబం సంస్కారం.. వైయస్ రాజారెడ్డి గారి మరణానికి కారణమైన వారిని కూడా వైయస్సార్ క్షమించి ప్రజాసేవకే అంకితమయ్యారు. వైయస్. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రామోజీరావు, ఏబీయన్ రాధాకృష్ణ వంటి వారిని వ్యక్తిగతంగా ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు, వైయస్ కుటుంబానికి కక్షసాధింపు రాజకీయాలు తెలియవు. మరోవైపు వైయస్. జగన్ ని హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు విష ప్రచారం చేశారు. లడ్డూలో జంతుకొవ్వు లేదని సిట్ విచారణలో తేలిన తర్వాత కూడా టీడీపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. రాజమండ్రి అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? రాజమండ్రి అభివృద్ధిపై బుచ్చయ్య చౌదరి పచ్చి అబద్దాలు చెబుతున్నారు. కంబాలచెరువు ఫౌంటెన్ పని చేయలేదనడం అబద్ధం, దాని ద్వారా రూ.50 లక్షల ఆదాయం వచ్చిన మాట వాస్తవం కాదా? మోరంపూడి ఫ్లై ఓవర్ మినహా మిగిలిన చోట్ల ఎందుకు ఫ్లైఓవర్లు నిర్మాణం చేపట్టడం లేదు. కనీసం సర్వీస్ రోడ్లు కూడా వేయలేని దౌర్భాగ్య స్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. రాజమండ్రిలో ఇసుక కోసం హద్దులు గీసుకుని మరీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు. లిక్కర్ మాఫియాకు టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ నాయకత్వం వహిస్తున్నారు. బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నేతలు వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం దిగజారి మాట్లాడటం రాజమండ్రి ప్రజలను విస్మయానికి గురిచేస్తోందని మార్గాని భరత్ ఆక్షేపించారు. 80 ఏళ్ల వయసులో అబద్ధాలను అస్త్రంగా చేసుకుని మంత్రి పదవి కోసం పాకులాడటం కంటే, రాజమండ్రిలో జరుగుతున్న ఇసుక, లిక్కర్ మాఫియాలను అరికట్టడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. మా ప్రభుత్వ హయాంలో చేపట్టిన మ్యూజికల్ ఫౌంటెన్, ఫ్లై ఓవర్లు వంటి అభివృద్ధి పనులను అనుభవించిన రాజమండ్రి ప్రజలకు వాస్తవాలేంటో తెలుసని స్పష్టం చేశారు. ఇప్పటికైనా వైయస్ జగన్ గారిపై బురదజల్లడం మానుకోవాలని, లేనిపక్షంలో కూటమి నేతల లాలూచీ రాజకీయాన్ని, అభివృద్ధి నిరోధక చర్యలను ప్రజల ముందు ఎండగట్టడం ఖాయమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మార్గాని భరత్ హెచ్చరించారు.