కూట‌మి పాల‌న‌లో ప్ర‌భుత్వ‌ ఉద్యోగుల‌కు చీక‌టి రోజులు

 హ‌క్కుల కోసం పోరాడినా ఈ ప్ర‌భుత్వం ఓర్వ‌లేక‌పోతోంది

వైయ‌స్సార్సీపీ ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఫైర్‌

నెల్లూరులోని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి 

కాకర్ల వెంక‌ట్రామిరెడ్డి డిస్మిస్ ప్ర‌భుత్వ నిరంకుశ వైఖ‌రికి ప‌రాకాష్ట‌

ఉద్యోగులంతా ఈ చ‌ర్య‌ను ఖండించ‌క‌పోతే భ‌విష్యత్తులో వారికే న‌ష్టం

ఉద్యోగుల‌ను రాజ‌కీయ అవ‌స‌రాలకు వాడుకున్న చరిత్ర చంద్ర‌బాబుదే

హామీలు అమ‌లు చేయ‌కుండా రెండేళ్లుగా చుక్క‌లు చూపిస్తున్నాడు

ఉన్న‌త స్థాయి పోలీస్ ఉద్యోగుల‌ను సైతం వ‌ద‌ల‌కుండా వేధిస్తున్నాడు 

కొత్త ఉద్యోగం ఇవ్వ‌క‌పోగా 22 నెల‌ల్లోనే 1.72 లక్షల ఉద్యోగాలు పీకేశాడు 

స్ప‌ష్టం చేసిన ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి 

నెల్లూరు: చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి పాల‌న‌ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు చీక‌టి రోజులుగా మిగిలిపోయింద‌ని, హామీలు అమ‌లు చేయ‌కుండా రెండేళ్లుగా చుక్క‌లు చూపించ‌డ‌మే కాకుండా వాటి గురించి ప్ర‌శ్నిస్తున్న వారిని కేసుల‌తో చంద్ర‌బాబు వేధిస్తున్నాడ‌ని వైయ‌స్ఆర్‌సీపీ  ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నెల్లూరులోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నిక‌ల్లో ఉద్యోగుల‌కు ఇచ్చిన హామీలు అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేసిన కాకర్ల వెంక‌ట్రామిరెడ్డిని డిస్మిస్ చేయ‌డం ప్ర‌భుత్వ నిరంకుశ వైఖ‌రికి ప‌రాకాష్ట అని చెప్పారు. ఉద్యోగులంతా ఆయ‌న‌కు అండ‌గా నిల‌బ‌డి ఈ నిర్ణ‌యాన్ని వెన‌క్కు తీసుకునేలా ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకురావాల‌ని సూచించారు. లేదంటే రాబోయే వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వంలో ఇవే విధానాలు కొన‌సాగితే చాలామంది న‌ష్ట‌పోతార‌ని హెచ్చ‌రించారు. ఉద్యోగుల‌ను రాజ‌కీయ అవ‌స‌రాలకు వాడుకున్న చరిత్ర చంద్ర‌బాబుదేన‌ని, బీజేపీకి అనుకూలంగా చేసిన న‌వ నిర్మాణ దీక్ష‌ల‌కు, వ్య‌తిరేకంగా చేసిన ధ‌ర్మ పోరాట దీక్ష‌ల‌కు ఉద్యోగుల‌ను ప‌క్క‌నే పెట్టుకున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఉన్న‌త స్థాయి పోలీస్ ఉద్యోగులు స‌హా వేల‌మందిని చంద్ర‌బాబు వేధిస్తున్నాడని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు సీఎం అయ్యాక క‌నీసం ఒక్క‌ కొత్త ఉద్యోగం ఇవ్వ‌క‌పోగా 22 నెల‌ల్లోనే 1.72 లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొల‌గించాడ‌ని ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి వివ‌రించారు. 
ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...  

ప్రభుత్వ నిరంకుశ వైఖరికి పరాకాష్ట
కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న ఎమ‌ర్జెన్సీని త‌ల‌పిస్తోంది. హిట్ల‌ర్‌ను మించిపోయి చంద్ర‌బాబు నియంత‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. రాష్ట్రంలో రెండేళ్లుగా ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌శ్నించే వారిని అక్ర‌మంగా అరెస్ట్ చేసి త‌ప్పుడు కేసులతో నిర్బంధించే సంస్కృతిని చంద్ర‌బాబు కొనసాగిస్తున్నాడు. ఈ ప్ర‌భుత్వంలో హ‌క్కుల కోసం పోరాడ‌టం కూడా నేర‌మైపోయింది. పోలీసులు కూట‌మి నాయ‌కుల టార్గెట్‌ల కోసం ప‌నిచేస్తున్నారు. ఆఖ‌రుకి ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను కూడా వ‌ద‌ల‌కుండా ఈ ప్ర‌భుత్వం భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తోంది. ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తున్నందుకు ఏపీ సెక్రటేరియట్‌ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (జీఈఎఫ్‌) అధ్యక్షుడైన కాకర్ల వెంకట్రామిరెడ్డిని ఏకంగా సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేయడం, ప్రభుత్వ నిరంకుశ వైఖరికి పరాకాష్ట. 

ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై పోరాడినందుకే...

ఉద్యోగుల‌కు రావాల్సిన ఐఆర్‌, అరియ‌ర్స్‌, నాలుగు పెండింగ్ డీఏలు, పీఆర్సీ విష‌యంలో రాష్ట్ర స్థాయి టీచ‌ర్స్ స‌మావేశంలో ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించ‌డంతో త‌ట్టుకోలేక‌పోయింది. కాకర్ల వెంకట్రామిరెడ్డిని ఏకంగా సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేయడంతో పాటు, కనీసం రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కూడా ఇవ్వబోమని ప్రకటించడం చూస్తుంటే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల వేధింపు మరొకటి ఉండదు. ఆయ‌న వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్తారు. కానీ దాన్ని అణ‌చివేయాల‌ని అనుకోకుండా వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆలోచించ‌డం జ‌రిగింది. ప్ర‌భుత్వ రుణం తీర్చుకోవాల‌ని ఆర్టీసీ ఉద్యోగుల స‌మావేశంలో కాక‌ర్ల వెంక‌ట్రామిరెడ్డి పిలుపునిచ్చార‌ని, రాజ‌కీయ పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించాడంటూ ఆయ‌న మీద ఉన్న అభియోగం. దానిపై వివ‌ర‌ణ కోరుతూ గ‌తంలో ఆయ‌న‌కు ప్ర‌భుత్వం నోటీసులు కూడా జారీ చేసింది. దానికి ఆయ‌న వివ‌ర‌ణ కూడా ఇచ్చారు. ప్ర‌భుత్వం చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి ఎలాంటి ఆడియో, వీడియో ఆధారాలు కూడా లేవ‌ని కాకర్ల వెంక‌ట్రామిరెడ్డి సైతం చెబుతున్నారు. డిపో మేనేజ‌ర్ సైతం ఇలాంటి వ్యాఖ్య‌లేవీ చేయ‌లేద‌ని చెప్పారు. అయినా ప్ర‌భుత్వం ఆయ‌న్ను డిస్మిస్ చేసింది. 

డిస్మిస్‌ను ఉద్యోగులు ముక్త‌కంఠంతో ఖండించాలి 
ప్ర‌భుత్వ నిరంకుశ విధానాల‌ను, హామీలు విస్మ‌రిస్తున్న వైనాన్ని, హ‌క్కుల ప్ర‌శ్నిస్తుంటే ఈ ప్ర‌భుత్వం త‌ట్టుకోలేక‌పోతోంది. హామీలు అమ‌లు చేయ‌డం చేత‌కాక ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌ను స‌ర్వీస్ నుంచి తొల‌గించ‌డం దుర్మార్గం. రాబోయే రోజుల్లో వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం  ఏర్ప‌డిన త‌ర్వాత ఉద్యోగుల విష‌యంలో ఇలాగే గ‌నుక వ్య‌వ‌హ‌రిస్తే ఎంతమంది ప్ర‌భుత్వ ఉద్యోగులు, పోలీసులు స‌ర్వీసుల్లో ఉంటారో ఆలోచించుకోవాలి. యూనియ‌న్ల‌కు అతీతంగా ఉద్యోగులంతా ఈ చ‌ర్య‌ను ఖండించ‌క‌పోతే భ‌విష్యత్తులో వారే తీవ్రంగా న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నా. నేడు అధికార పార్టీల‌కి కొమ్ముకాస్తూ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఉద్యోగుల ప‌రిస్థితి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాలి. 2019 ఎన్నిక‌ల‌కు ముందు కొంత‌మంది ఉద్యోగులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్ర‌చారం చేశారు. అయినా అధికారంలోకి వ‌చ్చాక వారిని జ‌గ‌న్ గారు స‌స్పెండ్ చేయ‌లేదని గుర్తుంచుకోవాలి. 

పర్చూరి అశోక్ బాబుని వాడుకుని...
ఉద్యోగుల‌ను రాజ‌కీయ కార్య‌క్ర‌మాల‌కు వాడుకునే విధానాల‌కు ఆద్యుడు చంద్ర‌బాబే. ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టించినప్పుడు బీజేపీకి అనుకూలంగా న‌వ నిర్మాణ దీక్ష‌ల పేరుతో ఉద్యోగుల‌ను ప‌క్క‌నే కూర్చుండ‌బెట్టుకుని దీక్ష‌లు చేశాడు. బీజేపీతో తెగ‌దెంపులు చేసుకున్న త‌ర్వాత ధ‌ర్మ పోరాట దీక్ష‌ల‌కు కూడా ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను వాడుకున్నాడు. త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఉద్యోగుల‌ను దీక్ష‌ల్లో వాడుకున్నాడు. ఆఖ‌రుకి నాటి ఏపీ ఎన్‌జీవో సంఘం నాయ‌కుడు ప‌ర్చూరి అశోక్ బాబును క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి పంపించి బీజేపీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయించాడు. అదే అశోక్‌బాబుకి చంద్ర‌బాబు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చాడు. 

22నెల‌ల్లో 1.72 ల‌క్ష‌ల ఉద్యోగాల కోత 
చంద్ర‌బాబు వందేళ్లు ముఖ్య‌మంత్రిగా ఉన్నా చేయ‌లేని ప‌నులు.. వైయ‌స్ జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లోనే ఉద్యోగులకు చేసి పెట్టాడు. అధికారంలోకి వ‌స్తే బ‌కాయిలు తీర్చేస్తాన‌ని చెప్పిన చంద్ర‌బాబు, ఉద్యోగులను తీవ్రంగా వంచించాడు. బ‌కాయిలు ఏకంగా రూ. 35 వేల కోట్ల‌కు పెంచేశాడు. ఐఆర్, పీఆర్సీ ఊసే లేదు. నాలుగు డీఏలు పెండింగ్ పెట్టాడు. అధికారంలోకి వ‌చ్చాక వ‌లంటీర్ల జీతాలు రూ.5 వేల నుంచి రూ. 10 వేల‌కు పెంచుతాన‌ని చెప్పి, ఏకంగా ఉద్యోగాల నుంచి తొల‌గించి 2.60 ల‌క్ష‌ల కుటుంబాల‌కు ద్రోహం చేశాడు. సచివాల‌య ఉద్యోగుల‌ను ఈ ప్ర‌భుత్వం తీవ్రంగా వేధిస్తోంది. టీచ‌ర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల‌ను వేధిస్తున్నారు. రెండేళ్లుగా ఉద్యోగుల‌కు ప్ర‌త్య‌క్ష న‌ర‌కం చూపిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు 96,675 మంది ఉండగా, గత ఏడాది డిసెంబరు నాటికి వారి సంఖ్య 87,681. ఏకంగా 9 వేల మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తొల‌గించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో ఏకంగా 1.72 లక్షల ఉద్యోగాలు పోయాయి. గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో 2024 మార్చి నాటికి ఉద్యోగుల సంఖ్య 11.79 లక్షలు. చంద్రబాబు పాలనలో 2025 డిసెంబర్‌ నాటికి ఉద్యోగుల సంఖ్య 10.07 లక్షలే. 

వేల మంది పోలీసుల‌కు వేధింపులు 

చివ‌ర‌కు చంద్ర‌బాబు పాల‌న‌లో పోలీసు అధికారుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. డీజీ స్థాయి అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు మీద‌ తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారు. దళిత వర్గానికి చెందిన డీజీ స్థాయి అధికారి సునీల్‌కుమార్, మరో అడిషినల్‌ డీజీ సంజయ్, డీఐజీ విశాల్‌ గున్నీ, బీసీ వర్గానికి చెందిన ఐజీ కాంతి రాణా టాటా తదితరులను తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్‌ చేయించారు. ఇంకా మరెందరో ఎస్పీల మీద తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తున్నారు. వీరే కాకుండా నలుగురు నాన్‌క్యాడర్‌ ఎస్పీలు, ఒక కమాండెంట్‌ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్‌ ఎస్పీలు, 55 మంది డీఎస్పీలకు పోస్టింగ్‌లు లేవు. మరో ఆరుగురు డీఎస్పీలు, ముగ్గురు అడిషినల్‌ కమాండెంట్‌లు, ఇద్దరు అసిస్టెంట్‌ కమాండెంట్లను కూడా హెడ్‌ క్వార్టర్స్‌లో రిపోర్ట్‌ చేయమంటున్నారు. 8 మంది డీఎస్పీలను సస్పెండ్‌ చేశారు. వీరు కాకుండా మరో 80 నుంచి 100 మంది ఇన్‌స్పెక్టర్లు, వందలాది కానిస్టేబుళ్లు వీఆర్‌లో ఉన్నారు. చంద్రబాబు కోసం చ‌ట్టాలు ఉల్లంఘించి వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల మీద అక్ర‌మ కేసులు పెట్ట‌డానికి స‌హ‌క‌రించ‌డం లేద‌న్న కార‌ణంతో పోలీసుల‌ను వేధిస్తున్నాడు.  రాష్ట్రంలో ఎంతటి దుర్మార్గపు పాలన నడుస్తోందని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. కేవలం తన మోచేతి నీళ్లు తాగే అధికారులను మాత్రమే పెట్టుకుని వారిని అవినీతిలో భాగస్వాములను చేసుకుంటున్నారు. రెడ్‌బుక్‌ను ఉద్యోగులపైనా ప్రయోగించడం అత్యంత హేయం. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి. కాక‌ర్ల వెంక‌ట్రామిరెడ్డిని త‌క్ష‌ణం విధుల్లోకి తీసుకోవాలని ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.

Back to Top