విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి విశాఖ నగరం భూకబ్జాలకు, దందాలకు అడ్డాగా మారిందని వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం జోడుగుళ్లపాలెంలో రూ.150 కోట్ల విలువైన 84 సెంట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేసే ప్రయత్నాన్ని అడ్డుకుంటూ స్థానిక మత్స్యకారులు చేపట్టిన ఆందోళనకు ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. భవిష్యత్తులో తమకు అధికారం రాదన్న భయంతో టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ ఆస్తులను బినామీలకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. వందల కోట్ల విలువైన భూములు ఆక్రమణకు గురవుతుంటే జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు మొద్దునిద్ర పోవడం దారుణమని, కమిషన్లకు కక్కుర్తి పడి కబ్జాదారులకు సహకరిస్తే అధికారులపై కూడా న్యాయపోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇంకా ఏమన్నారంటే... - అధికారుల అండతోనే అక్రమాలు.. ప్రభుత్వ భూములకు కస్టోడియన్లుగా ఉండాల్సిన కలెక్టర్, రెవెన్యూ అధికారులు మొద్దునిద్ర పోవడం దారుం. ఆర్డీఓ, ఎమ్మార్వో వంటి ఉన్నతాధికారులు కమిషన్లకు కక్కుర్తి పడి ప్రైవేటు వ్యక్తులతో బేరసారాలు కుదుర్చుకుంటున్నారు. ఎటువంటి కోర్టు ఆదేశాలు లేకుండానే 84 సెంట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు అధికారులు సహకరించడం శోచనీయం. - పాషాపై ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టాలి.. తప్పుడు పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న పాషా అనే వ్యక్తిపై తక్షణమే ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదు చేయాలి. నిందితులపై చర్యలు తీసుకోకపోతే, అక్రమాలకు సహకరిస్తున్న రెవెన్యూ అధికారులపై న్యాయస్థానాల్లో పోరాటం తథ్యం. - కుహనా మేధావుల మౌనంపై ప్రశ్నలు అమరావతిలో చిన్న సమస్య వచ్చినా గగ్గోలు పెట్టే టీడీపీ నేతలు, కుహనా మేధావులకు విశాఖలో జరుగుతున్న ఈ భూదందాలు ఎందుకు కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో వందలాది కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అధికార పార్టీ నేతలు కబ్జా చేస్తున్నారు. ప్రజా స్వామ్యంపై నమ్మకం ఉంటే టీడీపీ గుండాలు చేస్తున్న ఈ దోపిడీపై వామపక్షాలు, కుహనా మేధావులు ఎందుకు నోరు విప్పడం లేదు. - పోరాటానికి సిద్ధం.. వైయస్సార్సీపీ బాధ్యతగల ప్రతిపక్షంగా విశాఖలో ఎక్కడ భూఆక్రమణలు జరిగినా సహించబోదని, బాధితుల పక్షాన నిలబడి పోరాడుతుందని కేకే రాజు స్పష్టం చేశారు. జోడుగుళ్లపాలెంలో కబ్జా ప్రయత్నాలను విరమించుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ భూదందాలపై విశాఖ పోలీస్ కమిషనర్ తక్షణమే స్పందించి విచారణ జరిపించాలని కే కే రాజు డిమాండ్ చేశారు.