ఏఎన్‌యూ పరీక్షల్లో అక్రమ దందా 

విద్యార్థుల నుంచి భారీగా వసూలు

ఏకంగా రూ.5 కోట్ల విద్యా వ్యాపారం

ఎ.రవిచంద్ర ధ్వజం

వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రవిచంద్ర.

తాడేపల్లి: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బీఈడీ ప్రాక్టికల్స్‌ పరీక్షల పేరిట దాదాపు రూ.5 కోట్ల విద్యా వ్యాపారం జరిగిందని, దీనిపై విచారణ జరిపి అందుకు కారకులైన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రవిచంద్ర డిమాండ్‌ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏఎన్‌యూ పరిధిలోని 60కి పైగా కళాశాలల్లో ఒక్కో విద్యార్థి నుంచి కనీసం రూ.12 వేల చొప్పున, ఒక్కో కాలేజీ దాదాపు రూ.15 లక్షల వరకు వసూలు చేసిందని చెప్పారు. ఈ అక్రమ వ్యవహారానికి సంబంధించి యూనివర్సిటీ బీఈడీ పరీక్షల కోఆర్డినేటర్‌ సుబ్బారావుపై ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలిపారు.
ప్రెస్‌మీట్‌లో రవిచంద్ర ఇంకా ఏమన్నారంటే..:

విద్యను వ్యాపారంగా మార్చారు:
    కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యను వ్యాపారంగా మార్చేసి జేబులు నింపుకోవడమే ధ్యేయంగా యూనివర్సిటీ అధికారులు బరితెగిస్తుంటే మంత్రి నారా లోకేష్‌ నిద్రపోతున్నారా? గత ఏడాది కూడా ఇదే యూనివర్సిటీలో ఇలాగే బీఈడీ పరీక్షల్లో విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి పాస్‌ చేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ అవినీతి వల్ల మెరిట్‌ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిపై వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆనాడే ఇన్‌ఛార్జ్‌ వీసీ గంగాధర్‌ రావుకి కూడా ఫిర్యాదు చేయగా, త్రీమెన్‌ కమిటీ వేసి, వారిచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పి వదిలేశారు. కానీ, వారిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. అందువల్లే ఇప్పుడు మళ్లీ అదే దందా కొనసాగింది.
    బీఈడీ ప్రాక్టికల్స్‌ పరీక్షలకు దాదాపు 7వేల మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన 5వేల మంది విద్యార్థులు గైర్హాజరైనా వారి నుంచి డబ్బులు వసూలు చేసి పాస్‌ చేశారని తెలుస్తోంది. అందుకే ఆ మొత్తం పరీక్షల వ్యవహారంపై లోతైన విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఎ.రవిచంద్ర డిమాండ్‌ చేశారు.

Back to Top