కాకినాడ జిల్లా: కిర్లంపూడిలో ప్రముఖ కాపు నేత, వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం ను మాజీ మంత్రి అంబటి రాంబాబు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. అనంతరం మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు, రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముద్రగడ కుటుంబాన్ని కావాలనే లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని అంబటి ఆరోపించారు. రాజకీయ ప్రతీకారంతోనే తమపై కుట్రపూరితంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆయన అన్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లపై అంబటి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. “మాపై ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు. చట్టపరంగా పోరాడతాం. ప్రజల కోసం నిలబడతాం” అని స్పష్టం చేశారు. తమను భయపెట్టే ప్రయత్నాలు ఫలించవని, రాజకీయంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.