మార్కాపురం జిల్లా: మార్కాపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ నాయకుడు అన్నా రాంబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం మార్కాపురం మెడికల్ కాలేజీ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘటనలో పలువురు సజీవ దహనం కావడం విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే వైయస్ఆర్‌సీపీ నేతలుసంఘటన స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. మృతుల వివరాలను అడిగి తెలుసుకుని, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించే చర్యలపై కూడా అధికారులతో మాట్లాడారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని, నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. అలాగే మృతుల కుటుంబాలకు తక్షణ సహాయం అందించి, వారికి ఆర్థికంగా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రోడ్డు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని అన్నా రాంబాబు సూచించారు.