ఖాళీలు బారెడు.. నోటిఫికేషన్లు చారెడు? 

నిరుద్యోగులను మోసం చేస్తున్న జాబ్ క్యాలెండర్

వైయ‌స్ఆర్ స్టూడెంట్ యూనియన్ నేత‌లు ఫైర్ 

శ్రీసత్యసాయి జిల్లా: రాష్ట్రంలో లక్షల్లో ఖాళీలు ఉన్నప్పటికీ కేవలం వేలల్లో మాత్రమే పోస్టులు ప్రకటిస్తూ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని వైయ‌స్ఆర్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లం రాజేంద్ర యాదవ్ మండిపడ్డారు. కదిరి పట్టణంలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రభుత్వం చేసినది పచ్చి మోసం. భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని రెండేళ్లుగా ఊదరగొట్టారు. చివరకు కేవలం 10,060 పోస్టులతో బూటకపు క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులను నట్టేట ముంచారు” అని విమర్శించారు.

రాష్ట్రంలోని వివిధ శాఖల్లో వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. విద్యాశాఖలో సుమారు 30 వేల పోస్టులు, పోలీస్ శాఖలో 19,999 ఉద్యోగాలు, ఇంజనీరింగ్ విభాగంలో 20 వేల పోస్టులు, పంచాయితీ రాజ్‌లో 26 వేల నియామకాలు, మున్సిపల్ శాఖలో 27 వేల ఖాళీలు, రెవిన్యూలో 13 వేల పోస్టులు, వైద్యశాఖలో 26 వేల, వ్యవసాయ శాఖలో 3 వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ వాటిపై ప్రభుత్వం మౌనం వహిస్తోందని ప్రశ్నించారు.

“రాష్ట్రంలో మొత్తం 153 విభాగాల్లో దాదాపు 1.80 లక్షల ఖాళీలు ఉన్నాయి. ప్రతి ఏడాది కనీసం 20 శాతం పోస్టులు భర్తీ చేసినా రెండు సంవత్సరాల్లో కనీసం 50 వేల ఉద్యోగాలు ఇవ్వాల్సింది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మాట తప్పింది” అని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య 50 లక్షలకు చేరుకుందని, అందులో 30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారని తెలిపారు. కోచింగ్ సెంటర్లలో లక్షలు ఖర్చు చేసి, నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న యువతను ప్రభుత్వం నిరాశపరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే ప్రతినెల రూ.3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీని కూడా ప్రభుత్వం అమలు చేయలేదని, దీంతో నిరుద్యోగులకు చేరాల్సిన వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టినట్లయిందని ఆరోపించారు. వాలంటీర్లకు రూ.10,000 గౌరవ వేతనం ఇస్తామని చెప్పి ఆ వ్యవస్థనే రద్దు చేయడం కూడా యువతను మోసం చేయడమేనన్నారు. ప్రభుత్వం వెంటనే పారదర్శకంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, భారీ స్థాయిలో ఖాళీలను భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని, అభ్యర్థుల వయోపరిమితి పెంపుపై ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో విద్యార్థి విభాగం నాయకులు షాహిద్ ఖాన్, అనిల్ కుమార్, సోమేష్ కుమార్, రోషన్, మయానా బాబ్జాన్, బాబా తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top