క్రెడిట్ చోరీ తప్ప కూటమి చేసింది ఏమీ లేదు

మాజీ ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి ఫైర్‌

వైయ‌స్ఆర్ జిల్లా: క్రెడిట్ చోరీ తప్ప కూటమి ప్ర‌భుత్వం చేసింది ఏమీ లేద‌ని మాజీ ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ వైయ‌స్ఆర్ క‌డ‌ప‌ జిల్లా అధ్య‌క్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి మండిప‌డ్డారు. వైయ‌స్ఆర్‌ జిల్లా కమలాపురంలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈయ‌న తీవ్రంగా ఖండించారు. ఇవాళ కమలాపురంలో కనిపిస్తున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం తమ ప్రభుత్వం హయాంలోనే జరిగిందని స్పష్టం చేశారు. నిన్న మంత్రి భూమిపూజ చేసిన రైల్వే బ్రిడ్జి కూడా వైయ‌స్ జగన్ నేతృత్వంలో, ఎంపీ అవినాష్ రెడ్డి కృషితో తీసుకువచ్చిన ప్రాజెక్టేనని పేర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం క్రెడిట్ చోరీ చేయడమే తప్ప ప్రజల కోసం ఎలాంటి పనులు చేయలేదని విమర్శించారు. 

మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భార్య ఇందిరానే “వసూల్ రాణి”గా వ్యవహరిస్తున్నారని రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు.  మంత్రి మాటలు “దయ్యాలు వేదాలు వల్లించినట్లు” ఉన్నాయని విమర్శించారు. హార్టికల్చర్, అగ్రికల్చర్ రంగాల రైతులు సరైన ధరలు లేక తీవ్ర నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సీఎం జిల్లా పర్యటనకు వస్తే అభివృద్ధి, ప్రజా సమస్యలపై అధికారులతో సమీక్ష చేయాల్సి ఉంటుందని, కేవలం వచ్చి వెళ్లిపోవడం వల్ల ప్రజలకు ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించారు. కమలాపురంలో రైల్వే వంతెనకు భూమిపూజ చేసిన మంత్రి, అది తన కృషిగా చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు.

నేడు కమలాపురంలో కనిపిస్తున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం తమ ప్రభుత్వం హయాంలోనే జరిగిందని, అమ్మవారిశాల వీధిలో రోడ్డు విస్తరణ, వరద ముప్పు నివారణ చర్యలు, పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ వైద్యశాలల నిర్మాణం, తాగునీటి మరియు డ్రైనేజీ వ్యవస్థల మెరుగుదల వంటి పనులు తామే చేపట్టినవని వివరించారు.
రైల్వే బ్రిడ్జి కూడా వైయ‌స్ జగన్ నేతృత్వంలో ఎంపీ అవినాష్ రెడ్డి కృషితో వచ్చిన ప్రాజెక్టేనని పేర్కొంటూ, దేశవ్యాప్తంగా 67 వంతెనలకు అనుమతులు వచ్చినా, ఏపీలో కమలాపురం వంతెనకు మాత్రమే నిధులు రావడం విశేషమన్నారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేయడమే తప్ప కొత్తగా ఏమీ చేయలేదని విమర్శించారు. పైనుంచి కింది స్థాయి వరకు ఎక్కడా పైసా ఖర్చు పెట్టలేదని ఆరోపిస్తూ, గత రెండేళ్లలో వారు చేసిన పనులపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే, వారి తండ్రి, మంత్రి జనార్దన్ రెడ్డి ప్రజల ముందుకు వచ్చి చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.

ఇసుక, మట్టి, మద్యం రంగాల్లో భారీగా దోపిడీ జరుగుతోందని ఆరోపిస్తూ, యంత్రాలతో రోజుకు రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు సహజ వనరులను దోచుకుంటున్నారని అన్నారు. కడప నుంచి ఇసుకను తరలించి అక్రమంగా సంపాదిస్తున్నారని, క్రషర్లు ఏర్పాటు చేసి మైనింగ్ దోపిడీ ముమ్మరం చేశారని విమర్శించారు. ఏ పని చేయాలన్నా రేట్లు కట్టి వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు.

“గురివింద గింజలా ఇతరులపై బురద జల్లడం తప్ప వీళ్లు చేసిందేమీ లేదు” అంటూ విమర్శించిన రవీంద్రనాథ్ రెడ్డి, వైయ‌స్ జగన్ చేసిన పనులకు మేనమామగా తాను గర్వపడుతున్నానని తెలిపారు. “కింది స్థాయి నుంచి లోకేశ్ వరకు ప్రజలను దోచుకోవడం తప్ప మీరు చేసిందేమిటి?” అంటూ ప్రశ్నిస్తూ, త్వరలోనే ప్రజలు వీరికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
 

Back to Top