వైయ‌స్ఆర్ జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై పోలీసుల ఒత్తిడి 

వైయ‌స్ఆర్ జిల్లా:  రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు దేవాలయాల వద్ద బీ ఆర్ నాయుడు రాజీనామా కోరుతూ నిర్వహించనున్న ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని నేతలు విమర్శిస్తున్నారు. ఆందోళనకు హాజరు కాకూడదని ముందస్తుగా హెచ్చరిస్తూ పలువురు నేతలకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు, నాయకులపై పోలీసులు ఒత్తిడి పెంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డికి ఇంటివద్దే నోటీసులు అందజేసి, అక్కడే పోలీసులను మోహరించారు. అలాగే బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధకు కూడా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజంపేటలో ముఖ్య నేతలు, కమలాపురంలో వైయ‌స్ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు సాంబటూరి ప్రసాద్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ చర్యలతో వైయ‌స్ఆర్‌సీపీ కార్యక్రమాలను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ, ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.
 

Back to Top