ఏపీని ‘అత్యాచారాంధ్రప్రదేశ్‌‘గా మార్చిన కూటమి ప్రభుత్వం

మాజీ హోం మంత్రి తానేటి వనిత ధ్వజం

తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం, నల్లజర్లలో మీడియాతో మాట్లాడిన మాజీ హోం మంత్రి తానేటి వనిత.

రాష్ట్రంలో ఆడబిడ్డలకు కొరవడిన భద్రత

బయటే కాదు ఇంట్లోనూ రక్షణ లేని దుస్థితి

ఇంట్లో ఉన్నా కత్తితో బెదిరించి అఘాయిత్యాలా?

మాచర్లలో మహిళపై అఘాయిత్యం అమానుషం

ఇది ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం

మాజీ హోం మంత్రి తానేటి వనిత ఆగ్రహం 

గత జగన్‌గారి ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌

జాతీయ స్ధాయిలో పోలీస్‌ శాఖకు 100 అవార్డులు

కూటమి పాలనలో పూర్తిగా దిగజారిన శాంతి భద్రతలు

దేశంలో అట్టడుగున 36వ స్ధానంలో ఏపీ పోలీసు

గుర్తు చేసిన మాజీ మంత్రి తానేటి వనిత

మహిళలకు అండగా ఉంటానన్న పవన్‌కళ్యాణ్‌ ఎక్కడ?

మహిళల పట్ల తప్పు చేస్తే తాట తీస్తానని పెద్ద మాటలు

ఇప్పటి వరకు ఎవరెవరి తాట తీశారు? ఇప్పుడేం చేస్తున్నారు?

ప్రెస్‌మీట్‌లో మాజీ హోం మంత్రి వనిత సూటి ప్రశ్న

నల్లజర్ల:    రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మహిళలకు, చిన్నారులకు శాపంలా మారిందని, వారికి ఇంటా, బయటా ఎక్కడా రక్షణ లేకుండా పోయిందని మాజీ హోం మంత్రి తానేటి వనిత వెల్లడించారు. చివరకు ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగిని తన సొంత ఇంట్లో ఉన్నా కూడా కత్తితో బెదిరించి అత్యాచారం చేసే హీనస్థాయికి రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయని ఆమె మండిపడ్డారు. మహిళలపై దాడి చేస్తే.. అదే ’ఆఖరి రోజు’ అంటూ  సీఎం చంద్రబాబు పలుసార్లు చేసిన ప్రకటనలు అంత వరకే పరిమితమయ్యాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జగన్‌గారు సీఎంగా ఉన్నప్పుడు మహిళలు మహారాణుల్లా గౌరవింపబడితే.. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వంలో గంజాయి, మద్యం బ్యాచ్‌లకు భయపడి ఇంట్లో నుంచి బయటకు రాలేని దుస్థితి నెలకొందని చెప్పారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసిన ప్రభుత్వం, వారిని కేవలం వైయస్సార్సీపీ కార్యకర్తలపై కక్ష సాధింపునకు వాడుకుంటోందని తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం, నల్లజర్లలో మీడియాతో మాట్లాడిన మాజీ హోం మంత్రి తానేటి వనిత ధ్వజమెత్తారు.
ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి తానేటి వనిత ఇంకా ఏమన్నారంటే..:

సమాజం తలదించుకునేలా మాచర్ల ఘటన:
    పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగిని అయిన ఓ ఒంటరి మహిళపై కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడటం అత్యంత దురదృష్టకరం. మద్యం మత్తులోనే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో విచ్చలవిడిగా ఏరులై పారుతున్న మద్యమే ఇందుకు కారణం. గుడి, బడి అన్న తేడా లేకుండా టీడీపీ నేతలే బెల్టు షాపులు నిర్వహిస్తూ బరి తెగిస్తున్నారు. 

ప్రకటనలకే పరిమితమైన చంద్రబాబు:
    ‘మహిళలపై అఘాయిత్యం చేస్తే అదే వారికి ఆఖరి రోజు‘ అన్న సీఎం చంద్రబాబు మాటలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. మహిళలపై దాడులు చేస్తే తాట తీస్తానన్న డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, వరుస ఘటనలు జరుగుతున్నా, ఎవరెవరి తాట తీశారో సమాధానం చెప్పాలి. పైగా నేరగాళ్లకు మద్దతుగా నిలుస్తూ, బాధితుల ఫిర్యాదులు కూడా తీసుకోలేని దుస్థితికి పోలీస్‌ వ్యవస్థను దిగజార్చారు. 

పవన్‌కళ్యాణ్‌ ఇప్పటి వరకు ఎవరెవరి తాట తీశారు?:
    ప్రశ్నించే గొంతుక ఏమైంది పవన్‌ కళ్యాణ్‌?. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పిన పవన్‌కళ్యాణ్, ఇప్పుడు  రాష్ట్రంలో అఘాయిత్యాలకు, అకృత్యాలకు గురైన బాధితులను పరామర్శించడానికి కూడా సమయం లేనంతగా అధికారం చూసి మురిసిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవకపోతే  రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

నిర్వీర్యమైన పోలీస్‌ వ్యవస్థ. 36వ ర్యాంకుకు పతనం:
    జగన్‌గారి ప్రభుత్వంలో దేశంలోనే అత్యున్నత ప్రతిభ కనబర్చి 100కు పైగా అవార్డులు పొందిన ఏపీ పోలీస్‌ శాఖ, నేడు కూటమి పాలనలో 36వ స్థానానికి పడిపోవడం సిగ్గుచేటు. శాంతిభద్రతల పరిరక్షణ వదిలేసి, పోలీసులు కేవలం వైయ‌స్ఆర్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలను, నేతలను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఆడబిడ్డలపై అకృత్యాల పరంపర:
– శ్రీశైలంలో జనవరి 4న ఉద్యోగమిప్పిస్తానని నమ్మించి మండలాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మహిళపై అసభ్య ప్రవర్తించారు.
– శ్రీకాకుళంలో ఇంటర్‌ చదువుతున్న దళిత బాలికపై లైంగిక దాడి
– వైయస్సార్‌ కడప జిల్లాలో ఏకంగా రెవెన్యూ ఉద్యోగినిపైనే వేధింపులు. టీడీపీ నేతల ఒత్తిడితో బాధితురాలికి కేవలం రూ.1 లక్ష విలువ కట్టి చేతులు దులుపుకున్నారు.
– మరోవైపు నెల్లూరు జిల్లాలో మైనర్‌ బాలికకు మత్తుమందు ఇచ్చి గంజాయి బ్యాచ్‌ గ్యాంగ్‌ రేప్‌ కి పాల్పడ్డారు.
– ఇంకా ఏడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసి నీళ్ల డ్రమ్ములో ముంచేసిన అమానుష ఘటన చోటు చేసుకుంది. 
    తాజాగా రాష్ట్రంలో ఇని ఘటనలు జరుగుతున్నా, ప్రభుత్వంలో కనీస చలనం లేదు. ఇక హోం మంత్రి, తన శాఖ తప్ప, అన్ని శాఖల గురించి మాట్లాడుతున్నారు. ఇంకా నిద్ర లేచింది మొదలు, జగన్‌గారిని నిందించడమే తన పని అన్నట్లుగా హోం మంత్రి అని వ్యవహరిస్తున్నారని మాజీ హోం మంత్రి తానేటి వనిత ఆక్షేపించారు.

Back to Top