తాడేపల్లి: విజయవాడ ఈస్ట్ బైపాస్ నిర్మాణం కోసం ప్రాంత ప్రజల డిమాండ్ రోజు రోజుకు బలపడుతోంది. ఈస్ట్ బైపాస్ సాధనాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న వారికి స్వాగతం పలుకుతూ నాయకులు ఈ ప్రాజెక్ట్ అవసరాన్ని వివరించారు. చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి (NH-16)పై విజయవాడలోని రామవరప్పాడు, బెంజ్ సర్కిల్ ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చిన్న అవుటుపల్లి నుంచి కాజా వరకు సుమారు 50 కిలోమీటర్ల తూర్పు బైపాస్ నిర్మాణం అత్యవసరమని పేర్కొన్నారు. ఈ బైపాస్ మంగళగిరి నియోజకవర్గంలో సుమారు 15 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తూ దుగ్గిరాల మండలంలోని పలు గ్రామాలకు సమీపంగా వెళ్లనుండటంతో స్థానిక ప్రజలకు గణనీయమైన ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. కాజా టోల్ గేట్‌తో అనుసంధానం వల్ల గుంటూరు, మచిలీపట్నం ప్రయాణం సులభమవుతుందని, ముఖ్యంగా దుగ్గిరాల మార్కెటింగ్ యార్డ్‌కు కనెక్టివిటీ పెరిగి రైతులకు మేలు జరుగుతుందని వివరించారు. అలాగే ఈ మార్గం వెంట కోల్డ్ స్టోరేజీలు, గోదాములు ఏర్పడి వ్యవసాయ రంగానికి మరింత ఊతం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకోవడం తెనాలి, పొన్నూరు, బాపట్ల ప్రాంత ప్రజలకు మరింత సులభతరం అవుతుందని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు కారిడార్‌లో ఈ ఈస్ట్ బైపాస్ కీలక భాగమని పేర్కొన్నారు. ఈ ప్రణాళిక ద్వారా సహజసిద్ధమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, భారీ అప్పుల భారం లేకుండా ప్రాంత అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. మచిలీపట్నం పోర్ట్ అనుసంధానం వల్ల ఎగుమతులు, దిగుమతులు పెరిగి ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని తెలిపారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేస్తోందని, గతంలో అవసరమైన అనుమతులు వచ్చినప్పటికీ అమలు చేయడంలో ఆసక్తి చూపడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో పార్టీ భేదాలు పక్కనపెట్టి ప్రజలందరూ ఒక్కటై ఈస్ట్ బైపాస్ సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. అవసరమైతే మళ్లీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసి ఈ ప్రాజెక్ట్ సాధనకు హామీ తీసుకుంటామని నాయకులు స్పష్టం చేశారు.