ఏప్రిల్ 4న రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు

విజయవాడ:   టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఈ నెల 4వ తేదీన రాష్ట్రంలోని ప‌లు ఆల‌యాల్లో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు మాజీ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు, మాజీ ఎమ్మ‌ల్యే మ‌ల్లాది విష్ణు తెలిపారు. బుధ‌వారం వారు మీడియాతో మాట్లాడుతూ..బీఆర్ నాయుడుకు సంబంధించిన అశ్లీల వీడియోలు బయటకు వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఆయనతో రాజీనామా చేయించకపోవడం బాధాక‌ర‌మ‌న్నారు. కోట్లాది మంది భక్తులు దర్శించే ఆలయానికి ఛైర్మన్‌గా ఉన్న వ్యక్తి అత్యంత నిష్టగా ఉండాలని పేర్కొన్నారు. చంద్రబాబు చెప్పినా రాజీనామా చేయడం లేదా అనే సందేహాలు వ్యక్తం చేశారు. బీఆర్ నాయుడు రాజీనామా చేసే వరకు ఒత్తిడి కొనసాగిస్తామని హెచ్చరించారు. బీఆర్ నాయుడు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తిరుమల అపఖ్యాతి పాలవుతోందని ఆరోపించారు. తిరుమల పవిత్రతను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పక్క రాష్ట్రాల భక్తులు కూడా తిరుపతికి రావడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారని, ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.

ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి పై అసత్య ప్రచారం జరిగిందని ఆరోపించారు. లడ్డూలో కల్తీ నెయ్యి ఉందని చేసిన ఆరోపణలను ఖండించారు. అదే రోజునుంచి ప్రభుత్వం పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు.  బీఆర్ నాయుడు పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మండిపడ్డారు. ఆయనను వెంటనే టిటిడి ఛైర్మన్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, పవన్‌లకు మంచి బుద్ధి కలగాలని ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 
 

Back to Top