నిడదవోలులో చంద్ర‌బాబు చేసింది నిర‌స‌న ర్యాలీనా?

మహిళలను మోసం చేసిన నేతల్లో చంద్ర‌బాబు ముందువరుసలో ఉంటారు

మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ ఎద్దేవా2024 ఎన్నిక‌ల్లో మహిళలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదు

నిరుద్యోగ భృతి, ఆడ‌బిడ్డ నిధి, గ్యాస్ సిలిండర్ల హామీలు నెరవేర్చలేదు

ఇవేవి అమ‌లు చేయ‌కుండానే సూప‌ర్ సిక్స్‌..సూప‌ర్‌హిట్ అంటూ చంద్ర‌బాబు అబ‌ద్ధాలు

 గత వైయస్సార్‌సీపీ పాలనలో సంక్షేమం నిరాటంకంగా కొనసాగింది

డీబీటీ ద్వారా రూ.2.73 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ చేశారు

కూట‌మి పాల‌న‌లో శాంతిభద్రతలు క్షీణించాయి, అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఇబ్బందుల్లో ఉన్నారు

ప్రతిపక్షంపై నిందలు వేయ‌డ‌మే ఈ ప్రభుత్వం అజెండా 

తీవ్రంగా ఆక్షేపించిన మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌

 

 రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనపై మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమ‌లు చేయ‌కుండా మ‌హిళ‌ల‌తో క‌లిసి ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న వ్య‌క్తి ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారంటే..అది నిర‌స‌న ర్యాలీ అనుకోవాలా అని ప్ర‌శ్నించారు.  లోక్‌స‌భ‌లో మ‌హిళాబిల్లు వీగిపోయిన సంద‌ర్భంలో చంద్ర‌బాబు ఇలా ర్యాలీ చేశారంటే దాని అర్థం ఏంటో ఆయ‌నే చెప్పాల‌న్నారు. నిడదవోలులో జరిగిన సభ, ర్యాలీ ప్రజల కోసం కాదని, రాజకీయ లాభాల కోసం నిర్వహించిన కార్యక్రమమని రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలోని పార్టీ కార్యాల‌యంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌ వ్యాఖ్యానించారు. నిడ‌ద‌వోలు స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్‌, గ‌త ప్ర‌భుత్వంపై చంద్ర‌బాబు చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న తిప్పికొట్టారు.
ప్రెస్‌మీట్‌లో చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ ఏమ‌న్నారంటే.. 

మ‌హిళ‌ల‌ను మోసం చేసిన నాయ‌కుల్లో బాబే నంబ‌ర్ వ‌న్ 
రాష్ట్రంలో మహిళలను మోసం చేసిన నాయకుల్లో చంద్రబాబు ముందువరుసలో ఉన్నారు. 2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చి, ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. అదే విధంగా 2024 ఎన్నికల సందర్భంగా ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి, రెండు సంవత్సరాలు గడిచినా ఆ హామీ అమలు కాలేదు. సూపర్ సిక్స్ పథకాలను “సూపర్ హిట్”గా ప్రచారం చేస్తున్న ప్రభుత్వం, వాస్తవానికి వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది.

సూప‌ర్‌సిక్స్‌..సూప‌ర్ హిట్ అంటూ అబ‌ద్ధాలు
నిరుద్యోగులకు నెలకు రూ.3000 భృతి ఇస్తామని చెప్పి, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ఇది యువతను మోసం చేసినట్టే క‌దా?. మహిళలకు సంవత్సరానికి రూ.18,000 చొప్పున ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు ఎవరికి ఆడ‌బిడ్డ నిధి అంద‌లేదు. అలాగే మూడు గ్యాస్ సిలిండర్ల హామీ కూడా పూర్తిగా అమలు కాలేదు. ఇవ‌న్నీ సూప‌ర్‌సిక్స్ ప‌థ‌కాలే క‌దా..ఈ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌కుండానే సూప‌ర్‌సిక్స్‌..సూప‌ర్ హిట్ అంటూ చంద్ర‌బాబు అబ‌ద్ధాలు ఆడుతున్నాడు.

చేసింది చెప్పుకోలేక‌..వైయ‌స్ జ‌గ‌న్‌పై నింద‌లా? 
కూట‌మి ప్ర‌భుత్వం ఈ రెండేళ్ల‌లో చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతో, వైయస్ జగన్‌పై, గ‌త ప్ర‌భుత్వంపై నిందలు వేయడమే ముఖ్యమంత్రి చంద్ర‌బాబు పనిగా పెట్టుకున్నారు. గత వైయస్సార్‌సీపీ పాలనలో సంక్షేమ పథకాలు నిరాటంకంగా కొనసాగాయి. కరోనా వంటి సంక్షోభ సమయంలో కూడా ప్రజలకు సేవలు అందించాం. డీబీటీ ద్వారా సుమారు రూ.2.73 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో నేరుగా వైయ‌స్ జ‌గ‌న్ జమ చేశారు.

 అమరావతి ఒక్కటే చంద్ర‌బాబు ఎజెండా 
తూర్పు గోదావ‌రి జిల్లాలో భూముల రేట్లు ఎక్కువ ఉండ‌టంతో ప‌రిశ్ర‌మ‌లు రావడం లేద‌ని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ఈ జిల్లాలో పరిశ్రమలకు అనువైన భూములు అనేకం ఉన్నాయి. మూడు పంటలు పండే భూములు రాజధాని కోసం తీసుకున్నప్పుడు, అక్కడే రాజధాని కట్టాలనుకున్నప్పుడు ఆ భూమి విలువైనది అన్న విషయం చంద్రబాబుకు తెలియదా? మీకు ఎక్కడ లాభం వస్తే అక్కడ పరిశ్రమలు పెడతారు..కిక్‌ బ్యాగ్స్‌ ఇచ్చే ప్రాంతాల్లోనే మీరు పరిశ్రమలు పెడతారా?. అమ‌రావ‌తి ఒక్క‌టే ఎజెండాగా చంద్ర‌బాబు పాల‌న సాగిస్తున్నారు.

ధ‌ర్మ దీక్ష‌లు, ర్యాలీల‌తో సాధించింది ఏంటి బాబూ?
2014–2019లో బీజేపీతో విభేదించిన తరువాత చంద్రబాబు ధర్మ దీక్షలు చేశారు. దాంతో రాష్ట్రానికి ఏం సాధించారు? ఇవాళ కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఎంతసేపు రాజకీయాలు చేయడం తప్ప అభివృద్ధి, ప్రజల అవసరాలపై ఆలోచన చేయకుండా వ్యవస్థలన్నింటినీ కుప్పకూల్చారు. పెరిగిన ధరలతో పేదవాడు అల్లాడిపోతున్నాడు. సామాన్యుడికి భద్రత..—తాను చేసిన అవినీతి, ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ప్రశ్నిస్తున్న ఏకైక ప్రతిపక్ష పార్టీ వైయస్సార్‌సీపీ, వైయస్ జగన్‌పై నిందలు వేస్తే ప్రజలు నమ్ముతారనే భావన. వైయస్సార్‌సీపీ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని ప్రజలు ఇవాళ చర్చించుకుంటున్నారు. 

మీరు విధ్వంసం చేస్తూ, వైయస్ జగన్ పాలనను విధ్వంసం అని ప్రచారం చేయడం హాస్యాస్పదం. చంద్రబాబు ఇప్పటికైనా మారాలి. రెండేళ్లు గడిచిపోయాయి. మిగిలిన మూడేళ్లలో అయినా మీరు చేసిన పనులను చెప్పాలి. హాస్యాస్పదమైన మాటలు కట్టిపెట్టాలి అని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హితవు పలికారు. 

Back to Top