బద్వేల్‌లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ  

సామాజిక న్యాయం సాధనలో అంబేద్కర్ మార్గం అనుసరించాలి

ఎంపీ అవినాష్ రెడ్డి పిలుపు

వైయ‌స్ఆర్ జిల్లా: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని బద్వేల్ పట్టణంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ శ్రీ వైయ‌స్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ డి.సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధాతో పాటు నియోజకవర్గంలోని వైయ‌స్ఆర్‌సీపీ అగ్ర నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, యువత, పార్టీ కార్యకర్తలు హాజరై విజయవంతం చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఎంపీ అవినాష్‌రెడ్డి  మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు సమాజానికి దిక్సూచిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. సామాజిక సమానత్వం, విద్య, హక్కుల సాధన కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ప్రేరణగా ఉండాలని తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు కేవలం రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, దేశంలోని పీడిత, బలహీన వర్గాలకు న్యాయం సాధించిన మహానేత. ఆయన చూపిన మార్గం వల్లే ఈరోజు మనం సమాన హక్కులతో జీవిస్తున్నాం. అంబేద్కర్ గారి ఆశయాలు ప్రతి ఇంటికి చేరాలి. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ ప్రామాణికమే. అందుకే విద్యను ఆయుధంగా మార్చుకుని ముందుకు సాగాలి. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం, సంక్షేమం కోసం కట్టుబడి పనిచేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేసింది. మనందరం అంబేద్కర్ గారి స్ఫూర్తితో సమానత్వ సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలి. యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలి. అదే ఆయనకు నిజమైన నివాళి” అని ఎంపీ అవినాష్‌రెడ్డి అన్నారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సింగమల వెంకటేశ్వర్లు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top