గుంటూరు: తన ఇల్లు, కార్యాలయంపై అత్యంత దారుణంగా దాడి జరిగిందని, దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పెమ్మసాని వంటి నేతల ఆదేశాల మేరకే ఈ దాడి జరిగిందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. తనపై దాడి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోనని స్పష్టం చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకొని బాధ్యులను కఠినంగా శిక్షించే వరకు పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. రాజకీయ విభేదాలు ఉన్నా వ్యక్తిగత దాడులకు దిగడం తగదని, ఇది రాష్ట్రంలో క్షీణిస్తున్న చట్టవ్యవస్థకు నిదర్శనమని అన్నారు. కస్టడీలో తనను హింసించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. శనివారం గుంటూరు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరాహార దీక్ష చేపట్టారు. సాయంత్రం 6 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. అంబటి దీక్షకు వైయస్ఆర్‌సీపీ నేతలు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, డైమండ్ బాబు, వేమారెడ్డి, తదితరులు సంఘీభావం తెలిపారు. దీక్ష సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. తన ఇంటిపై దాడి చేసి నన్నే 18 రోజులు రాజమండ్రి జైల్‌లో పెట్టారని.. పోలీసుల సమక్షంలోనే తన ఇంటిపై దాడి జరిగింది. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలన్నారు. ఎవరిని వదలిపెట్టను ‘‘నా ఇంటిపై దాడి చేసిన వారిని వదలిపెట్టను. చంద్రబాబు, లోకేష్, పెమ్మసాని ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి జరిగింది. గుంటూరులో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదు. గుంటూరులో ఇళ్లపై దాడి చేసే సంస్కృతిని పెమ్మసాని తీసుకొచ్చారు. పెమ్మసాని ఓడిపోతే అమెరికాకు స్పెషల్ విమానంలో వెళ్లిపోతారు. చంద్రబాబు, లోకేష్, పెమ్మసానిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. టీడీపీ నేతలు నన్ను భయపెట్టలేరు. టీడీపీ నేతల బెదిరింపులకు వైయస్ఆర్‌సీపీ నేతలు భయపడరు’’ అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. నా ఇల్లు, ఆఫీసుపై అత్యంత దారుణంగా దాడి చేశారు. కార్లు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఇష్టం వచ్చినట్లు తిట్టారు. ఇదంతా పోలీసుల సమక్షంలో జరిగింది. నేను చంద్రబాబును దూషించానని అరెస్టు చేసి 18 రోజులు జైల్లో ఉంచారు. నా ఇంటిపై దాడి చేసిన వారిని 18నిమిషాలైనా జైలుకు పంపించారా?. ఇప్పటికైనా నా ఇల్లు, ఆఫీసుపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. నన్ను అరెస్టు చేసిన తర్వాత నల్లపాడు పోలీస్ స్టేషన్ లో నన్ను హింసించాలని ప్రయత్నించారు. కస్టోడియల్ టార్చర్‌పై చర్యలు లేవు. దాడి వెనుక లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. దాడికి పాల్పడిన వారినఎవరినీ వదిలిపెట్టను. దాడికి పాల్పడినవారిని జైలుకు పంపించే వరకూ పోరాటం ఆగదు. ఇళ్లపై దాడులు చేసే సంస్కృతి గుంటూరులో తీసుకొచ్చింది పెమ్మసాని చంద్రశేఖర్. ఇప్పటికైనా ఇద్దరు సీఐలను సస్పెండ్ చేయండి. అంబటిని భయపెట్టాలనుకుంటే మీది పొరపాటే. ఇప్పటికైనా చట్టబద్ధంగా వ్యవహరించండి. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి చట్టబద్దంగా తేలుస్తా. దాడిపై న్యాయ పోరాటం... ప్రజా పోరాటం చేస్తా. నేను చేస్తుంది ధర్మపోరాటం. పవన్ కళ్యాణ్ దుర్మార్గమైన పాలనకు మద్దతిస్తున్నారు’’ అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.