గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయంపై జరిగిన దాడి ఘటనపై ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తీవ్రంగా స్పందించారు. దాడికి పాల్పడిన వారిని ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం విచారకరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం ముందు అందరూ సమానమే కావాలని, కానీ ఈ ఘటనలో మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని విమర్శించారు. అంబటి దీక్షకు సంఘీభావం ప్రకటించిన అనంతరం అప్పిరెడ్డి మాట్లాడుతూ, గతంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను పోలీసులు శారీరకంగా హింసించిన చరిత్ర లేదని గుర్తుచేశారు. అయితే సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న అంబటి రాంబాబును లక్ష్యంగా చేసుకుని హింసించడం దుర్మార్గమని అన్నారు. అంబటి రాంబాబు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకుడని, అలాంటి నాయకుడిపై దాడి జరగడం ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చే ఘటనగా అభివర్ణించారు. ఇలాంటి పరిస్థితుల్లోనే అంబటి రాంబాబు నిరాహార దీక్షకు దిగుతున్నారని, ఇది వ్యక్తిగత పోరాటం కాదని స్పష్టం చేశారు. “ఇది వైయస్ఆర్‌సీపీ పోరాటం… ఈ పోరాటం ఇక్కడితో ఆగదు, ఇది ఆరంభమే” అని పేర్కొన్నారు. చట్టాలు ఏ ఒక్క పార్టీకి చెందవని, టీడీపీ నాయకుల చుట్టాలు కావని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో న్యాయం జరగాలంటే బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అప్పిరెడ్డి డిమాండ్ చేశారు.