అప్పన్న భూములను గూగుల్‌కు ఇవ్వడం అన్యాయం

వైయ‌స్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్య‌క్షుడు కేకే రాజు ఆక్షేప‌ణ‌

విశాఖ‌ప‌ట్నంలోని పార్టీ జిల్లా కార్యాల‌యంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీతో క‌లిసి మీడియాతో 
మాట్లాడిన కేకే రాజు

ప‌రిశ్ర‌మ‌ల‌కు వైయ‌స్ఆర్‌సీపీ వ్య‌తిరేకం కాదు

సింహాచ‌లం వ‌ర‌హా ల‌క్ష్మి న‌ర‌సింహ‌స్వామి భూములు గూగుల్ సంస్థ‌కు కేటాయించ‌డం అభ్యంతరక‌రం

గూగుల్‌కు వేరే చోట భూములు ఇవ్వొచ్చు, దేవస్థానం భూములే ఎందుకు? 

కూట‌మి ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌తో భక్తుల మనోభావాలు దెబ్బ‌తింటాయి

దేవాలయ భూములు ధార్మిక అవసరాలకే వినియోగించాలి

పంచాగ్రామాల ప్రజల పోరాటాన్ని ఈ ప్ర‌భుత్వం విస్మరించడం తగదు

రెగ్యులరైజేషన్ కోరుతున్న కుటుంబాలకు అన్యాయం

గూగుల్‌కు సింహ‌గిరి భూములు కేటాయిస్తే ముడసర్ల వాగు రిజర్వాయర్‌కు ప్రమాదం, తాగునీటిపై ప్రభావం 

స‌నాతన ధర్మం గురించే మాట్లాడే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ విష‌యంలో స్పందించాలి

భూముల కేటాయింపుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి

కేకే రాజు డిమాండ్‌

2023లోనే రెన్యూ పవర్ ప్రాజెక్ట్‌కు ఎంవోయూ చేసుకున్న వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం

ఇకనైనా చంద్ర‌బాబు క్రెడిట్ చోరీ ఆపాలి

కూట‌మి ప్ర‌భుత్వానికి చుర‌క‌లంటించిన కేకే రాజు

విశాఖ: సింహాచలం శ్రీ వరహా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చెందిన భూములను గూగుల్ సంస్థకు లీజుకు ఇవ్వడం తీవ్ర అన్యాయమని వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆక్షేపించారు. దేవాలయ భూములను కేవలం ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని, పరిశ్రమల కోసం ఇవ్వడం చట్టవిరుద్ధం.. అలాంటి భూములను గూగుల్‌ వంటి సంస్థలకు కేటాయించడం భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని విశాఖ‌ప‌ట్నంలోని పార్టీ జిల్లా కార్యాల‌యంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో పేర్కొన్నారు. రాంబిల్లీలో చంద్ర‌బాబు ఇవాళ శంకుస్థాప‌న చేసిన రెన్యూ ప‌వ‌ర్ ప్రాజెక్ట్‌కు వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం 2023 ఏప్రిల్ 4వ తేదీనే ఎంవోయూ చేసుకుంద‌ని గుర్తు చేశారు. చంద్ర‌బాబు ఇక‌నైనా క్రెడిట్ చోరీని ఆపాల‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు.
ప్రెస్‌మీట్‌లో కేకే రాజు ఏమ‌న్నారంటే..

పవిత్ర భూములు పరిశ్రమలకా?
సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించిన 160 ఎకరాలను 11 ఏళ్లకు లీజుకు ఇవ్వడం ద్వారా ఏటా రూ.26.45 కోట్ల చొప్పున, 11 ఏళ్లలో దాదాపు రూ.300 కోట్ల సొమ్ము ఆలయానికి జమ కానుంద‌ని ఇవాళ ఓ ప్ర‌ధాన ప‌త్రిక‌లో క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది. గూగుల్‌ డేటాసెంటర్‌ కోసం ప్రభుత్వం వివిధ భూములు పరిశీలించినప్పుడు ఈ ఆలయానికి మధురవాడ వద్ద ఉన్న 106.47 ఎకరాలు లీజుకు ఇచ్చేలా జిల్లా క‌లెక్ట‌ర్ నోట్ సిద్ధం చేసి ప్ర‌భుత్వం త‌ర‌ఫున దేవాదాయ శాఖ‌కు ఇచ్చారు. ప్రస్తుతం ఆ భూముల్లో పూలు, కూరగాయలు పండించి స్వామివారికి నైవేద్యం అందిస్తున్నారు. అలాంటి పవిత్ర భూములను పరిశ్రమలకు ఇవ్వడం సరైంది కాదు.

మేం ప‌రిశ్ర‌మ‌ల‌కు వ్య‌తిరేకం కాదు
వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్రంలో పెట్టుబడులకు, ప‌రిశ్ర‌మ‌ల‌కు వ్యతిరేకం కాదు. గూగుల్ వంటి సంస్థలకు విశాఖలో వేరే ప్రాంతాల్లో భూములు ఇవ్వొచ్చు. కానీ దేవస్థానం భూములను ఎందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు?.  పంచాగ్రామాల ప్రజలు దశాబ్దాలుగా భూముల కోసం పోరాటం చేస్తున్నారు. దేవస్థానం భూముల్లో నివసిస్తున్న కుటుంబాలు రెగ్యులరైజేషన్ కోరుతున్నాయి. అలాంటి పరిస్థితిలో ఈ భూములను గూగుల్‌కు కేటాయించడం అన్యాయం. దీనిపై ప్రజల తరఫున పోరాటం చేస్తాం.

గ‌తంలోనూ చంద్ర‌బాబు ఇలాగే వ్య‌వ‌హ‌రించారు

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింహాచలం బస్సు డిపో ఏర్పాటుకు దేవస్థానం భూమిని తీసుకుని ప్ర‌త్యామ్న‌య భూమి ఇస్తామ‌ని మాట త‌ప్పారు. అలాగే విశాఖ సెంట్రల్ జైల్ కోసం కూడా ఇదే విధంగా భూమి తీసుకుని ప్రత్యామ్నాయ భూమి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈ రోజు వరకు సింహాచలం డిపో, సెంట్రల్ జైల్‌కు ఇచ్చిన భూములకు బదులుగా అల్టర్నేట్ ల్యాండ్ ఇవ్వలేదు. 

న‌రసింహాస్వామికి శ‌ఠ‌గోపం
చంద్ర‌బాబు సింహాచలం శ్రీ వరహా లక్ష్మి నరసింహాస్వామికి శఠగోపం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విధంగా గతంలో కూడా పెట్టుబడుల పేరుతో రెండుమూడు సార్లు శఠగోపురం పెట్టారు. ఇప్పటికైనా ప్రజా సంఘాలు ముందుకు వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏటా గిరి ప్రదక్షిణ రోజు దేశవ్యాప్తంగా లక్షలాది భక్తులు వచ్చి ప్రదక్షిణ చేస్తుంటారు. అలాంటి పవిత్ర ప్రాంతంలోని భూములను పరిశ్రమలకు కేటాయించడం ఆమోదయోగ్యం కాదు.

ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తూల్యం దెబ్బ‌తింటుంది
సింహ‌గిరికి సంబంధించిన 106.40 ఎకరాల భూమి బీఆర్‌టీఎస్ రోడ్డుకు ఆనుకుని ఉంది. రోడ్డుకు 60 మీటర్ల దూరంలోనే ముడసర్ల వాగు రిజర్వాయర్ ఉంది. ఇది రోజు రోజుకు క్యాచ్‌మెంట్ కోల్పోయి అన్యాక్రాంతం అవుతోంది. దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే విశాఖ నగరానికి తాగునీరు అందించే ప్రధాన వనరుల్లో ఇదొకటి. ఇలాంటి ప్రాంతంలో పరిశ్రమలు తీసుకువస్తే పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఈ భూములు గూగుల్ సంస్థ‌కు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎలా ఆలోచించిందో అర్థం కావడం లేదు. కూటమిలో భాగస్వామి అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటారు. విశాఖ నడిబొడ్డున అప్పన్న స్వామికి జరుగుతున్న ఈ అన్యాయంపై చంద్రబాబును ఆయన ప్రశ్నించాలి.  

చంద్రబాబు క్రెడిట్‌ చోరీని ఆపాలి 
ఇవాళ చంద్ర‌బాబు రాంబిల్లిలో రెన్యూ పవర్ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. కానీ ఇదే ప్రాజెక్ట్‌ను శ్రీ‌ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు మార్చి 4, 2023న శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో నేను నెడ్‌క్యాప్ చైర్మన్‌గా ఉన్నాను. మా డిపార్ట్‌మెంట్ పరిధిలో 4,700 మెగావాట్ల రెన్యూ పవర్, పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగింది. మొత్తం 7 ప్రాజెక్టులకు వైయస్ జగన్ ఎంవోయూలు చేశారు. దాని కొనసాగింపుగానే ఇవాళ చంద్రబాబు శంకుస్థాపన చేస్తున్నారు. గత ప్రభుత్వంలో తీసుకువచ్చిన ప్రాజెక్ట్ అని చెప్పకపోయినా ఫ‌ర్వాలేదు, కానీ ప్రతి విషయానికీ గ‌త ప్ర‌భుత్వంపై బురద జల్లడం సరికాదు. చంద్ర‌బాబు గత చరిత్రను మర్చిపోయి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు.

ఉత్తరాంధ్రలో భోగపురం ఎయిర్‌పోర్టు, మూలపాడు పోర్టు, పూడిమడక వద్ద ఎన్టీపీసీకి చెందిన గ్రీన్ హైడ్రో ప్రాజెక్ట్.. ఇవన్నీ ప్రారంభించింది, మొదటి అడుగు వేసింది వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం, ఆ నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారే. ఇకనైనా చంద్రబాబు క్రెడిట్ చోరీని ఆపాలి అని కేకే రాజు చుర‌క‌లంటించారు.

Back to Top