వైయ‌స్ఆర్‌సీపీ హయాంలోనే రెన్యూ ఎనర్జీ పెట్టుబ‌డులు 

ఆనాడే అనంత‌పురం, స‌త్య‌సాయి జిల్లాల్లో భూ కేటాయింపులు 

వైయ‌స్ జ‌గ‌న్ స‌హ‌కారానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన సంస్థ సీఈవో సుమంత్ సిన్హా

జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇచ్చిన 15, 16 జీవోలు ర‌ద్దు చేసి కూట‌మి ప్ర‌భుత్వం కొత్త‌గా అనుమ‌తులు 

క్రెడిట్ చోరీకి కొత్త దారులు వెతికిన చంద్ర‌బాబు 

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి పుత్తా శివ‌శంక‌ర్ ధ్వ‌జం 

తాడేప‌ల్లి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీరాష్ట్ర అధికార ప్ర‌తినిధి పుత్తా 
శివ‌శంక‌ర్.

తాడేప‌ల్లి: మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ గారి కృషితో వైయ‌స్ఆర్‌సీపీహయాంలో వ‌చ్చిన రెన్యూ ఎనర్జీని తామే తెచ్చిన‌ట్టు చంద్ర‌బాబు చెప్పుకొంటూ క్రెడిట్ చోరీకి పాల్ప‌డ‌టం సిగ్గుచేట‌ని, నాటి వైయ‌స్ఆర్‌సీపీప్ర‌భుత్వం ఇచ్చిన 15, 16 జీవోలు ర‌ద్దు చేసి కొత్త జీవో ఇచ్చినంత మాత్రాన సంస్థ ఏర్పాటుకు చంద్ర‌బాబు కృషిచేసిన‌ట్టు అవుతుందా అని  వైయ‌స్ఆర్‌సీపీరాష్ట్ర అధికార ప్ర‌తినిధి పుత్తా శివ‌శంక‌ర్ ప్ర‌శ్నించారు. తాడేప‌ల్లి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ సంస్థ ఏర్పాటుకు అనంత‌పురం, స‌త్య‌సాయి జిల్లాల్లో భూములు కేటాయిస్తూ ఇచ్చిన జీవోలు.., విశాఖలో జ‌రిగిన గ్లోబ‌ల్ ఇన్వెస్ట్‌మెంట్ స‌మ్మిట్‌లో జ‌రిగిన ఒప్పందాలు, వైయ‌స్ జ‌గ‌న్ గారి స‌హ‌కారానికి కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ సంస్థ సీఈవో సుమంత్ సిన్హా ఎక్స్ లో చేసిన ట్వీట్ అబ‌ద్ధాలు చెప్ప‌వ‌ని గుర్తు చేశారు.  

ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...

ప్ర‌జ‌ల‌కు ఎన్నో మోస‌పు వాగ్ధానాలు చేసి అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు, వాటిని నెర‌వేర్చ‌కుండా పూర్తిగా ప‌క్క‌న‌పెట్టి అస‌త్య ఆరోప‌ణ‌ల‌తో వైయ‌స్ జ‌గ‌న్ గారి మీద బుర‌ద‌జ‌ల్లి వ్య‌క్తిత్వ హ‌న‌నం చేయ‌డం, ముఖ్య‌మంత్రిగా ఆయ‌న చేసిన మంచి ప‌నుల‌ను తానే చేసిన‌ట్టు క్రెడిట్ చోరీకి పాల్ప‌డ‌టం మాత్ర‌మే చేస్తున్నాడు. రెన్యూ (ReNew) ఎనర్జీ పేరుతో చంద్ర‌బాబు క్రెడిట్ చోరీకి పాల్ప‌డుతూ మ‌రోసారి అడ్డంగా దొరికిపోయాడు. విశాఖ‌లో 2023లో జ‌రిగిన గ్లోబ‌ల్ ఇన్వెస్ట్‌మెంట్ స‌మ్మిట్ (జీఐఎస్‌) దాదాపు రూ.97 వేల కోట్లు పైగా పెట్టుబడుల‌కు నాటి వైయ‌స్ఆర్‌సీపీప్ర‌భుత్వం అవ‌గాహ‌న ఒప్పందాలు (ఎంఓయూ) చేసుకుంది. ఆ మేరకు 300 మెగా వాట్ల ప‌వ‌న విద్యుత్ ఉత్ప‌త్తికి 2023 జూన్ 20న రెన్యూ ప్రాజెక్ట్ కి అనుమతులిస్తూ ప్ర‌భుత్వం జీవో 15 జారీ చేసింది. 600 మెగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తికి 2024 ఫిబ్రవరి 5న రెన్యూ ఎన‌ర్జీ రెండో ప్రాజెక్ట్ కి అనుమ‌తులు మంజూరు చేస్తూ జీవో 16 జారీ చేసింది. వైయస్ జగన్ గారి హయాంలోనే అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఈ ప్రాజెక్టుకి భూములు కేటాయించ‌డం జ‌రిగింది. ఆంధ్రప్ర‌దేశ్‌లో రెన్యూ ప్రాజెక్టులు విస్తరణ, వైయ‌స్ జ‌గ‌న్ గారి స‌హ‌కారం గురించి గురించి ఆనాడే  సంస్థ వ్య‌వ‌స్థాకుడు, చైర్మ‌న్‌ సుమంత్ సిన్హా ప్ర‌శంసించారు. నాటి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గారికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ వారిద్ద‌రి ఫొటోతో కూడిన సందేశాన్ని త‌న ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. అయితే వైయ‌స్ జ‌గ‌న్‌గారికి మంచి పేరొస్తుంద‌నే భ‌యంతో కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక 2025 జూలై 28న ఒక జీవో ఇచ్చి వైయ‌స్ఆర్‌సీపీప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పందాల‌ను  ర‌ద్దు చేశారు. పాత ఒప్పందాల‌నే రివైజ్ చేస్తూ ఎలాంటి చెల్లింపులు అవ‌స‌రం లేకుండా అవే నిబంధ‌న‌ల‌తో కొత్తగా ఒప్పందం చేసుకున్నారు. రెన్యూ ఎన‌ర్జీని తామే కొత్త‌గా తీసుకొచ్చిన‌ట్టు ప్ర‌చారం చేసుకోవ‌డంలో భాగంగానే ఒప్పందాలు ర‌ద్దు చేశారు. చంద్ర‌బాబు క్రెడిట్ చోరీకి ఇంత‌కన్నా నిద‌ర్శ‌నం ఇంకోటి అవ‌స‌రం లేదు. విస్తరణలో భాగంగా ఇప్పుడు అనకాపల్లిలో మూడో రెన్యూ ఎనర్జీ ప్లాంట్ ను శంకుస్థాపన చేస్తూ చంద్ర‌బాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. అదంతా తన ఘ‌న‌త‌గానే చెప్పుకుంటున్నాడు. రెన్యూ సంస్థ‌ను రాష్ట్రం నుంచి పంపేశారంటూ నాటి వైయ‌స్ఆర్‌సీపీప్ర‌భుత్వం గురించి పచ్చి అబద్ధాలు మాట్లాడిన చంద్రబాబు, లోకేష్.. ఇప్పుడు నిస్సిగ్గుగా రెన్యూ ఎన‌ర్జీని తామే తెచ్చామ‌ని ప్ర‌చారం చేసుకోవ‌డం వారి దిగ‌జారుడుత‌నానికి నిద‌ర్శ‌నం. గ‌తంలో ఇలాగే అదానీ డేటా సెంట‌ర్‌కి గూగుల్ సెంట‌ర్‌గా పేరు మార్చి ప్ర‌చారం చేసిన చంద్ర‌బాబు, త‌ర్వాత కాలంలో అది అదానీ డేటా సెంటరే అని ఒప్పుకోక త‌ప్ప‌లేదని పుత్తా శివ‌శంక‌ర్ స్పష్టం చేశారు.

Back to Top