నెల్లూరు: జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందని, మత్సకారుల బోట్ల దొంగతనం కూడా ఇందులో భాగమని మాజీ మంత్రి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. బోట్ల దొంగతనం విషయంలో మత్సకారుల్లో కొందరు చేసిన తప్పుకు వాళ్ల పెద్దలు జరిమానాలు విధించారని, కానీ దీన్ని ప్రోత్సహించిన టీడీపీ నేతలు బీద మస్తాన్ రావు, బీద రవిచంద్రలపై మాత్రం చంద్రబాబు చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని కాకాణి ఆక్షేపించారు. మత్సకారుల సంక్షేమానికి ఎవరేం చేశారో తేల్చేందుకు తాము చర్చకు సిద్ధంగా ఉన్నట్లు కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రెస్ మీట్ లో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంకేమన్నారంటే..: జువ్వలదిన్నె హార్బర్ పై సర్కార్ కుట్రలు: జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ, మత్సకారుల మనోభావాల్ని దెబ్బతీస్తున్న సోనా బోట్ల మాయంపై ఇప్పటికే వైఎస్సార్సీపీ పోరాటాలు చేస్తోంది. జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మత్సకారులు ఆయన్ను కలిశారు. ప్రైవేటీకరణను తాము వ్యతిరేకిస్తున్నామని, అలాగే హార్బర్ లో బోట్లను దొంగతనంగా ఇక్కడి నుంచి తరలించుకుని వెళ్లిపోయారని ఫిర్యాదు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలిసినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం దుష్ప్రచారాలకు దిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో మత్సకారులు బండారం మొత్తం బయటపెడితే ఇబ్బందులు తప్పవని భావించి ప్రభుత్వం కుట్రలకు తెరదీసింది. ఎవరెన్ని ప్రచారాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారి రాకతో నిర్మానుష్య ప్రాంతం కాస్తా జన సంద్రంగా మారింది. చేసిన తప్పుకు మత్సకారులకు జరిమానాలు: ఏప్రిల్ 6న సింగరాయకొండ మండలం పాకాల దగ్గర మత్సకారులు ఓ సమావేశం పెట్టుకున్నారు. అందులో వారు బీద మస్తాన్ రావుతో పాటు కావలి సీఐల ప్రోద్బలంతోనే తాము ఆ బోట్ల విడుదలకు సహకరించినట్లు అంగీకరించారు. సంప్రదాయం ప్రకారం ఈ ఘటన మీద ఐదు కోట్ల జరిమానా వేస్తే, పేద మత్సకారులు అంత కట్టలేమని చెప్తే దాన్ని వాయిదా వేశారు. నిన్న మరోసారి జరిగిన సమావేశంలో మత్సకారులు తప్పు చేశామని ఒప్పుకోవడంతో ఫైనల్ గా 2 కోట్ల 25 లక్షల జరిమానా విధించారు. మత్సకారులు నీతి, నిజాయితీగా వ్యవహరించి తప్పు చేసిన తోటి మత్సకారుల మీద జరిమానా విధించడం ఎంతో మెచ్చుకోదగిన విషయం. వాళ్ల నీతి, నిజాయితీ, వ్యవహరించిన తీరుని ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాలి. కానీ మత్సకారులకు ద్రోహం చేసింది మావాళ్లేగా, ఏమవుతుందని ప్రభుత్వం అనుకుంటోంది. బోట్ల దొంగతనం వెనుక ఉన్న టీడీపీ నేతల్ని తప్పిస్తున్నారు లోకేష్ ఏ రోజు అయితే సాగర్ డిఫెన్స్ కు సంబంధించి జువ్వలదిన్నెకు వచ్చారో ఆ రోజే బోట్ల దొంగతనానికి బీజం పడింది. అందులో భాగంగా పోలీసులు జోక్యం చేసుకున్నారు. వీళ్లందరూ కలిసి మభ్య పెట్టారు. తోటయ్య అనే కాపు కాసే వ్యక్తి పాకాలలో జరిగిన మత్సకారుల సమావేశంలో ఎవరు ఫోన్ చేశారో చెప్పారు, పది లక్షలు డబ్బులు ఇచ్చారని, మినీ బైపాస్ రోడ్డు దగ్గర మిమ్మల్ని చేర్చారని అంగీకరించారు. వారిపై జరిమానా కూడా పడింది. ఆ తప్పు చేసిన టీడీపీ నేతలు బీద మస్తాన్ రావు, బీద రవిచంద్రపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా చెప్పాలి. మత్సకారులకు ద్రోహం జరిగినా పర్వాలేదు, వాళ్ల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నా ఫర్వాలేదని, మా పార్టీ వాళ్లను రక్షించుకుంటామనే విధంగా ప్రభుత్వ వ్యవహారశైలి ఉంది. శ్రీరామనవమి రోజు బీదమస్తాన్ రావు ప్రెస్ మీట్ పెట్టి దోషులతో తనకు సంబంధం లేదని చెప్పారు. కానీ ఆయన కాల్ డేటాను మేం బయటపెట్టాం. బీద రవిచంద్ర మాత్రం మేం మాట్లాడితే తప్పా, శుభాకాంక్షలు చెప్పామని అంటున్నాడు. వీళ్లిద్దరి మాళ్లల్ని బట్టి అసలు విషయం బయటపడింది. మీరు పెద్ద మనుషులని భావించి సహకరించిన మత్సకారుల కుటుంబాల్ని క్షోభ పెడుతున్నారు. మత్సకారుల మధ్య చిచ్చుపెట్టి వాళ్లను బలిపశువుల్ని చేస్తున్నారు. మత్సకారులకు బోట్లు తరలించే శక్తి, సామరŠాధ్యలు ఉన్నాయా, వాళ్లు అలాంటి పనులు చేస్తారా ? మేం మత్సకారులకు అండగా నిలిస్తే, మీరు మాత్రం దాన్ని రాజకీయం చేస్తున్నారు. మత్సకారుల సంక్షేమ ప్రదాత జగన్, దీనిపై చర్చకు సిద్ధం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మత్సకారులకు ఏం చేసిందో అందరికీ తెలుసు. చంద్రబాబు ఉన్నప్పుడు వేట నిషేధ సమయంలో మత్సకారులకు కేవలం రూ.4 వేలు ఇవ్వగా, జగన్‌గారు తన హయాంలో 5 ఏళ్ల పాటు రూ.10 వేల చొప్పున ఇచ్చారు. ఇప్పుడు రూ.20 వేలు ఇస్తామని చెప్పి ఎగ్గొట్టలేదా? మత్సకారులకు బకాయిలు ఇవ్వకుండా వాళ్ల కుటుంబాలను పస్తులుంచిన చరిత్ర మీది. ఆ బకాయిలు ఇప్పటికీ ఇస్తారా లేదా అంటే సమాధానం లేదు. మత్సకారులకు ఇచ్చే రూ.20 వేల విషయంలోనూ వైఎస్సార్సీపీ సానుభూతి పరులంటూ పక్కన బెడుతున్నారు. మత్సశాఖ జేడీ టీడీపీ ఫిర్యాదు ఇస్తే చాలు మత్సకారుల్ని పక్కనబెట్టడం పక్షపాత వైఖరి కాదా? డీజిల్ సబ్సిడీ టీడీపీ లీటరు ఆరు రూపాయలు ఇస్తే మా హయాంలో రూ.9కి పెంచాం. మీరు రూ.6 సబ్సిడీని కూడా రీయింబర్స్ మెంట్ ఆరు నెలలకు కూడా చేయలేకపోయారు. మా హయాంలో గుర్తింపు కార్డులిచ్చి, వాటిని పెట్రోల్ బంకుల్లో చూపిస్తే డీజిల్ తీసుకునే అవకాశం కల్పించాం. మత్సకారులకు ఎవరు అండగా నిలిచారన్న దానిమీద మేం చర్చకు సిద్దంగా ఉన్నాం. మత్సకారులకున్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదా?: టీడీపీ నేతల ప్రోత్సాహంతో మత్సకారుల్లో కొందరు తప్పుచేస్తే వాళ్ల పెద్దలు నిజాయితీగా వ్యవహరించి జరిమానా విధించారు. కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేకపోవడంతో ఇప్పటికీ ఆ బోట్ల తరలింపుకు కారణమైన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవడం లేదు. వాళ్లను ఇంకా రక్షించాలనే దుర్మార్గపు ఆలోచనలోనే ఉన్నారు. బీదమస్తాన్ రావుపై చర్యలు తీసుకుంటే కొల్లు రవీంద్ర, లోకేష్ పేర్లు బయటికి వస్తాయి కాబట్టే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఈ విషయంపై మత్సకారులు మిమ్మల్ని అడగలేక కుమిలిపోతున్నారు. మీరు చేసిన తప్పును మత్సకారుల కుటుంబాలు అస్సలు క్షమించవు. ప్రభుత్వం ఈ విషయంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పటికైనా ప్రభుత్వం మత్సకారుల బోట్ల మిస్సింగ్ కు కారకుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. అలాగే మత్సకారుల కోరిక మేరకు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణను కూడా ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.