తాడేపల్లి: టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో యథేచ్ఛగా చట్టాలు, మానవ హక్కుల ఉల్లంఘన సాగుతోందని, కోర్టులు పదే పదే మొట్టికాయులు వేస్తున్నా పోలీసుల తీరు మారడం లేదని వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో వేలల్లో మార్ఫింగ్ ఫొటోలతో జగన్‌గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంటే ఒక్క కేసైనా నమోదు చేశారా? అని ప్రశ్నించారు. 1549 మందిని అరెస్ట్ చేశామని చెబుతున్న డీజీపీ, వారిలో ఒక్కరైనా టీడీపీ కార్యకర్త ఉంటే చూపాలని సవాల్ చేశారు. కొంతమంది పోలీసులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరి విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఎం.మనోహర్‌రెడ్డి ఆక్షేపించారు. విచారణకు సహకరిస్తానని చెప్పినా వినకుండా బలవంతంగా కుప్పం తరలించుకు పోయారని చెప్పారు. లోకేష్ ఎర్ర బుక్‌ను ‘ఎర్రి బుక్’ అని వ్యాఖ్యానించినందుకు తెలంగాణ జర్నలిస్ట్ కేవీ రెడ్డిపై మరోసారి కేసు నమోదు చేయడం ఏపీ పోలీసుల నియంతృత్వ విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు. మంత్రులు సహా టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టిన మార్ఫింగ్ పోస్టులపై, అసభ్య దూషణలపై వేలల్లో ఫిర్యాదులిచ్చారని తెలిపారు. అయినా ఏ ఒక్కదానిపై చర్య తీసుకున్న పాపాన పోలేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎం.మనోహర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రెస్‌మీట్‌లో ఎం.మనోహర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..: దాడులను కూడా పోలీసులు అడ్డుకోవడం లేదు: టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి యథేచ్చగా చట్టాలు, మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగుతోంది. కోర్టులు పదే పదే మొట్టికాయలు వేస్తున్నా పోలీసుల తీరు మారడం లేదు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లేదని, అమరావతి ముసుగులో అవినీతి జరుగుతోందని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా వారియర్స్, వైయస్ఆర్‌సీపీశ్రేణులపై దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి మీద గంటల తరబడి టీడీపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే దాడి జరుగుతున్నా పోలీసులు చూస్తూ కూర్చున్నారు. మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేస్తుంటే అక్కడే ఉన్న పోలీసులు నిలువరించే ప్రయత్నం కూడా చేయలేదు. ఎప్పుడో ఐదేళ్ల కిందట పెట్టిన సోషల్ మీడియా పోస్టింగులను తీసుకొచ్చి కేసులు పెట్టడం, అసలు పోస్టులే పెట్టకపోయినా పోలీసులే మార్ఫింగ్‌లు చేసి కేసులతో హింసించిన సందర్భాలు రాష్ట్రంలో అనేకం. పొరుగు రాష్ట్రంలో ఉన్నా వదిలిపెట్టడం లేదు: మంత్రి నారా లోకేష్ పదే పదే ప్రస్తావిస్తున్న రెడ్‌బుక్ (ఎర్రబుక్)ను ‘ఎర్రి బుక్’ అన్నందుకు తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ కేవీ రెడ్డిపై ఏపీ పోలీసులు దాడులు శ్రుతి మించిపోతున్నాయి. గతంలో ఒకసారి కర్నూలు పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి దారుణంగా కొట్టి తీవ్రంగా వేధించారు. హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాతనే ఆయన్ను విడిచిపెట్టారు. శివుడి కన్నా చంద్రబాబు గొప్పవాడంటూ ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఓ జర్నలిస్ట్ పొగడడంతో.. దానికి కౌంటర్‌గా బాలాజీ కన్నా బాబూజీ గొప్పవాడా అంటూ వీడియో చేసినందుకు ఆయన్ను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారు. ఆ కేసులో పోలీసులకు కోర్టు మొట్టికాయలు వేసింది. సీఐ విక్రమసింహ ఇప్పటికీ ఆయన్ను సతాయిస్తున్నాడు. కేవీ రెడ్డి హైదరాబాద్ నుంచి తన యూట్యూబ్ ఛానల్‌లో మరో వీడియో చేస్తే దానికి ఆయనపై విజయనగరంలో మరో కేసు పెట్టారు. కక్షపూరితంగా ఒక దళిత వ్యక్తితో కేసు పెట్టించారు. ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్టు కోసం బీహార్ వెళ్లిన ఏపీ పోలీసులు అభాసుపాలైన సంఘటనను ఉద్దేశిస్తూ లోకేష్ ఎర్ర బుక్కును ఎర్రి బుక్కు అంటూ ఉదహరించాడు. కానీ పోలీసులు మాత్రం రాజ్యాంగాన్ని ఎర్రి––– అంటూ అవమానించాడని కేవీ రెడ్డిపై కేసు పెట్టారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విమర్శించినా కేసు పెట్టడం ఏంటి? రాజ్యాంగానికి సమాంతరంగా రెడ్ బుక్ అనడమే లోకేష్ చేసిన తప్పు. నిజానికి రాజ్యాంగం పరువు తీస్తున్నందుకు లోకేష్‌పైనే కేసు పెట్టాలి. సోషల్ మీడియా వారియర్స్‌పై అక్రమ కేసులు: సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించినందుకు గతంలో ఒక వ్యక్తి కారులో పోలీసులే గంజాయి పెట్టి అతడిపై కేసు పెట్టారు. ఇదంతా అక్రమమని గుర్తించిన హైకోర్టు దీనిపై స్టే విధించింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. హెబియస్ కార్పస్ పిటిషన్లు వేసిన తర్వాతనే అక్రమంగా అరెస్టు చేసిన వారిని మెజిస్ట్రేట్ ముందుకు తీసుకొస్తున్నారని కోర్టు చాలాసార్లు పోలీసులను హెచ్చరించింది. నాలుగు రోజుల క్రితం సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరిని ఇలాగే అరెస్ట్ చేశారు. తాను జగన్‌గారు సీఎంగా ఉన్నప్పుడు సీపీఆర్వోగా పని చేశారు. ఆయనపై గతంలో ఎలాంటి కేసులు కూడా లేవు. గిరీశ్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తి స్టేట్‌మెంట్ ఆధారంగా అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. కానీ గిరీశ్‌రెడ్డి చెప్పిన పోస్టింగ్ వేరు. వైయస్ఆర్‌సీపీ అధికారిక ట్విట్టర్ హ్యండిల్ శ్రీహరి పెట్టించాడని చెబుతున్న పోస్టింగ్ వేరు. కేవలం జగన్‌గారికి సన్నిహితంగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారనే కారణంతోనే ఆయనపై అక్రమ కేసు పెట్టారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా పని చేస్తున్నారు. టీడీపీ అధికారిక ఖాతాల్లో వేలల్లో మార్ఫింగ్ పోస్టులు: టీడీపీ అధికార ఎక్స్ హ్యాండిల్లో జగన్ –గొడ్డలి అంటూ ఆయన చేతిలో గొడ్డలి పెట్టి మార్పింట్ ఫొటోలతో ఎన్నో పోస్టులు పెట్టారు. మంత్రులు రామానాయుడు, ఇతర టీడీపీ నాయకులు కూడా వాటిని పోస్ట్ చేశారు. గొడ్డలి పార్టీ అధినేత అంటూ వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. చనిపోయిన వివేకానందరెడ్డి ఫొటోలు పక్కన వైయస్ జగన్ గొడ్డలి పట్టుకుని ఉన్న మార్ఫింగ్ ఫొటోలతో టీడీపీ పదే పదే దుష్ప్రచారం చేస్తూనే ఉంది. వాటిపై ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదు. వారి పోస్టులకు వైయస్ఆర్‌సీపీ కౌంటర్ చేస్తే వెంటనే వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా ఏ చర్య లేదు: కొత్తపలుకు పేరుతో ఏబీఎన్ రాధాకృష్ణ వైయస్ఆర్‌సీపీ నాయకుల ఇళ్లలో మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేస్తే, దానిపై రాష్ట్ర వ్యాప్తంగా 62 కేసులు పెట్టాం. పోలీసులు దేన్నీ నమోదు చేయలేదు. వైయస్ఆర్‌సీపీ నాయకులు శాంతియుతంగా ఏబీఎన్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపితే దాన్ని కూడా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ రాజకీయం చేశారు. టీడీపీ నాయకులు సాక్షి కార్యాలయాలపై దాడులు చేసి ధ్వంసం చేసినా ఎక్కడా ఒక్క కేసు నమోదు కాలేదు. మంత్రులే దిగజారి నీచంగా మాట్లాడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. హోంమంత్రి అనిత స్వయంగా మాజీ సీఎం వైయస్ జగన్ ని ఉద్దేశించి నంగనాచి అని మాట్లాడటం వారి ఆలోచనా విధానాలకు నిదర్శనం. డైవర్షన్ చేయడమే లక్ష్యంగా సభ్యత, సంస్కారం మరిచి నీచంగా మాట్లాడుతూ వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. మావిగన్ సూచనకు సమాధానం చెప్పుకోలేక తల్లి, చెల్లి, వివేకానందరెడ్డి మర్డర్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులంతా రెచ్చిపోయారు. 1549 మందిని అరెస్ట్ చేశామని డీజీపీ చెబుతున్నాడు. అందులో ఒక్కడైనా తెలుగుదేశం కార్యకర్త ఉంటే చూపించాలి. ఇకనైనా ఈ తరహా నియంతృత్వ విధానాలు మార్చుకోవాలని, లేని పక్షంలో భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని ఎం.మనోహర్‌రెడ్డి హెచ్చరించారు.