కూటమి ప్రభుత్వంలో కుదేలవుతున్న రైతులు

పంటలు కొనుగోలు చేయలేమని చెప్పడం హేయం

రైతుల పాలిట శాపంలా మారిన కూటమి ప్రభుత్వం

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర‌ ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం, రైతు సంక్షేమం) ధ్వజం

తాడేపల్లి: నిధులు లేనందున ఏ పంట కొనలేమని వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు చెప్పడం చాలా బాధాకరం. బాధ్యతా రాహిత్యం కూడా. ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉన్న మొక్క జొన్న రైతులకు కనీస మద్దతు ధర ఇస్తూ, పంట కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది.
పొరుగు రాష్ట్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నా, ఇక్కడ మాత్రం ప్రభుత్వం చేతులెత్తేసింది. 
    రాష్ట్రంలో ఈ రబీలో 5.02 లక్షల హెకార్లలో మొక్కజొన్న సాగు చేశారు. వరి తర్వాత మొక్కజొన్ననే ఎక్కువగా సాగు చేశారు. ఈ రబీలో రాష్ట్రంలో 1.96 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగవుతుందని, 16.31 లక్షల టన్నుల పంట ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ ముందస్తు అంచనా వేయగా, వాస్తవానికి 255 శాతం ఎక్కువగా 5.02 లక్షల హెక్టార్లలో సాగు చేయగా, దిగుబడి ఏకంగా 35 లక్షల టన్నులకు పైగా వచ్చిన పరిస్థితి. దీంతో కనీస గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నారు. క్వింటా మొక్కజొన్న కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) రూ.2,400 కాగా, రైతులు రూ.1500 నుంచి రూ.1800 మధ్య తెగనమ్ముకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే రూ.1400 నుంచి రూ.1600 వరకే కొంటున్నారు. క్వింటా మొక్కజొన్న ఉత్పత్తి వ్యయం రూ.2 వేల నుంచి రూ.2,200 వరకు ఉండగా, అంతకు చాలా తక్కువగా రైతులకు దక్కుతోంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక పోవడంతో మార్కెట్‌లో పోటీ లేక రైతులు దళారీలను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో వారు తీవ్రంగా నష్ట పోతున్నారు. 
    అదే వైయస్సార్‌సీపీ హయాంలో ప్రభుత్వం స్వయంగా కొనుగోళ్లు జరిపింది. 2019–20లో 4,17,268 టన్నులు, 2020–21లో 3,06,713 టన్నులు, 2022–23లో 73,302 టన్నులు మొక్క జొన్న మార్కుఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయడం జరిగినది.
    ఈ రబీలో కూడా పొరుగున ఉన్న తెలంగాణతో పాటు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లో ఎమ్మెస్పీకే మొక్కజొన్న కొనుగోళ్లు జరుగుతున్నాయి. కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. మొక్కుబడిగా కేంద్రానికి లేఖ రాసి కూర్చుంది. ఇప్పుడు రాష్ట్రంలో మొక్కజొన్నకు పలుకుతున్న ధర వల్ల ఆ రైతులు రూ.2,500 కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల వరకు నష్టపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ప్రభుత్వం ఇకనైనా మొద్దునిద్ర వీడి మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి.

Back to Top