పాలన అంటే ప్రశ్నించే గొంతుకలకు సంకెళ్లు వేయడమా? 

ఆ గొంతుకలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడమా?

మీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే అది దేశద్రోహమా?

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్ సూటి ప్ర‌శ్న‌

తాడేప‌ల్లి:  రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రశ్నించడం సహజమని, అయితే ప్రస్తుత పాలనలో ప్రశ్నించే గొంతుకలకు సంకెళ్లు వేస్తూ, వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడం జరుగుతోందా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే.. 
చంద్రబాబు గారూ.. మీ ఉద్దేశంలో ప‌రిపాల‌న అంటే ప్ర‌శ్నించే గొంతుకల‌కు సంకెళ్లు వేయ‌డ‌మా?  ఆ గొంతుకల‌పై అక్ర‌మ కేసులు పెట్టి అరెస్టు చేయించ‌డ‌మా? మీ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే అదేమైనా దేశ ద్రోహమా? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులపై మీకెందుకు అంత కక్ష? వాళ్లు ఏమైనా మీరు చేయ‌నిది చెప్పారా?  మీరు చెప్ప‌నిది చూపించారా?  వాస్త‌వాలు మాట్లాడితే అంత ఉలుకెందుకు? బీసీ వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టుగా పనిచేసిన పూడి శ్రీహ‌రి చేసిన త‌ప్పేంటి?  అత‌నిపై అక్ర‌మ కేసు పెట్ట‌డం ఏంటి? అత‌ని ఇంట్లో సోదాలు చేయ‌డం ఏంటి? అత‌నేమైనా ఉగ్ర‌వాదా?  టెర్ర‌రిస్టా? మ‌రి మీరు పెడుతున్న పోస్టుల‌కు రోజూ ఎంత మందిని అరెస్ట్ చేయాలి?

తెలంగాణ సీనియ‌ర్‌ జ‌ర్న‌లిస్టు కేవీఆర్‌పై కూడా త‌ప్పుడు కేసులు పెట్టి వేధింపుల‌కు గురిచేయ‌డం జంగిల్ రాజ్ కాదా? ఇంట్లో తాను లేని స‌మ‌యంలో త‌న కుటుంబ స‌భ్యుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తూ ఇంట్లో తిష్ట‌వేయ‌డం ఏంటి? ఇది రెడ్‌బుక్ పాల‌న‌కు నిద‌ర్శ‌నం కాదా? పొలిటికల్‌ గవర్నెన్స్‌ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా? 

గ‌డిచిన రెండేళ్ల‌లో బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హ‌త్య‌లు జ‌రుగుతుంటే నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకోని మీరు ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే మాత్రం వారిపై అక్ర‌మ కేసులు పెట్ట‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్‌?  మీ పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, హ‌త్య‌లు చేసిన ఘ‌ట‌న‌లు ఎన్నో ఉన్నా వాళ్ల‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేదు?  వ్య‌వ‌స్థ‌ల‌ను మీ స్వార్థ రాజ‌కీయాల‌కు వాడుకోవ‌డం సుప‌రిపాల‌నా?  పౌరులకు రక్షణ కల్పించడం, వారు స్వేచ్ఛగా తమ జీవితాలను గడిపేలా చూడ్డం మీ బాధ్యత కాదా? అలాంటి బాధ్యతలను నిర్వర్తించడంలో మీరు విఫలం చెందడం, పైగా మీరే మీ కక్ష సాధింపుల కోసం శాంతిభద్రతలను దెబ్బతీసి అక్ర‌మ కేసులు, అరెస్టుల‌కు వెన్నుదన్నుగా నిలవడం దుర్మార్గమైన విషయం కాదా? మీరు ముఖ్యమంత్రిగా ఉండి చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఇలాంటి ఘటనలకు మీరు మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు. దేవుడు, ప్ర‌జ‌లు మీకు బుద్ధి చెప్పే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంది!

Back to Top