సంక్షోభ కేంద్రాలుగా మారిన సంక్షేమ హాస్టళ్లు

హాస్టల్‌ పిల్లలను ఎలుకలు కరుస్తున్నాయి!

అయినా మంత్రి లోకేష్‌కు కనిపించడం లేదా?

ఎ.రవిచంద్ర ఫైర్‌ 

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రవిచంద్ర.

తాడేపల్లి: రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు రోజురోజుకీ మరింత దుర్భరమవుతున్నా, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ కనీసం దృష్టి పెట్టడం లేదని, మంత్రి నిర్లక్ష్యం హాస్టల్‌ విద్యార్థుల పాలిట శాపంలా మారుతోందని వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రవిచంద్ర తెలిపారు. చివరకు హాస్టళ్లలో విద్యార్థులను ఎలుకలు కొరకడం, అక్కడి దారుణ పరిస్థితికి అద్దం పడుతోందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల దుర్బర పరిస్థితులపై హైకోర్టు స్వయంగా గత ఏడాది డిసెంబరు 31న మొట్టికాయలు వేసినా, ప్రభుత్వంలో కనీస మార్పు రాలేదని ఆక్షేపించారు. హాస్టళ్లలో జరుగుతున్న పరిణామాలపై హైకోర్టు నివేదిక కోరే నాటికే 45 మంది విద్యార్థులు మరణించారని, ఇప్పటికి మూడు నెలలు గడిచినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో తెలియడం లేదని చెప్పారు.
    విశాఖ జిల్లా సింహాచలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్‌లో  పిల్లలను ఎలుకలు కొరకడం ఇదే తొలిసారి కాదని రవిచంద్ర వెల్లడించారు. అదే హాస్టల్‌లో మార్చి 26న ముగ్గురిని, 27న ఇద్దరిని.. తాజాగా నిన్న (ఏప్రిల్‌ 1న) ఐదుగురు పిల్లలను ఎలుకలు కరిచాయని తెలిపారు. మొదటిసారి ఘటన జరిగినప్పుడే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ఉంటే, ఈ పరిస్థితి పునరావృతం అయ్యేది కాదని అన్నారు. అటు ఎన్టీఆర్‌ జిల్లా ఏ.కొండూరు కేజీబీ పాఠశాలలో 11 మంది విద్యార్థినులను ఎలుకలు కరవడం ఆందోళనకర విషయమన్న రవిచంద్ర ఇకనైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి, హాస్టళ్లలో పిల్లల క్షేమం, శ్రేయస్సుపై దృష్టి పెట్టాలని హితవు చెప్పారు.

Back to Top