తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు, రాబోయే తరాల ప్రయోజనాల కోసం వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్.జగన్ మోహన్ రెడ్డి సూచించిన 'మావిగన్' (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) ప్రతిపాదన అత్యంత హర్షణీయమని, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగాలని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీకేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు ప్రజలపై మోపనున్న రూ.2 లక్షల కోట్ల అప్పు భారం, అందులో జరుగుతున్న అవినీతిని వాస్తవాలతో సహా ఎండగట్టారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే.. భావితరాల కోసం 'మావిగన్' విశ్వనగరం ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పుడు రాజధాని నడిబొడ్డున ఉండాలనే డిమాండ్ నడుమ, చంద్రబాబు తన బినామీలతో ముందే భూములు కొనుగోలు చేయించి, అడ్డగోలుగా అమరావతిని తెరపైకి తెచ్చారు.దీనికి భిన్నంగా, వైయస్.జగన్ భావితరాల కోసం హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాల తరహాలో, చెన్నై వంటి తీరప్రాంత పోర్టు సదుపాయంతో కూడిన అభివృద్ధిని కాంక్షించారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలుపుతూ గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేయాలన్నదే జగన్ విజన్ అని ఆయన వివరించారు. విజయవాడ-గుంటూరు మధ్య సెక్రటేరియట్, హైకోర్టు నిర్మిస్తే, కేవలం రెండు మూడు ఏళ్లలోనే ఇది హైదరాబాద్ తరహా భారీ నగరంగా రూపుదిద్దుకుంటుంది.దీనికి మచిలీపట్నం పోర్టును అనుసంధానిస్తూ ఇండస్ట్రియల్ కారిడార్, అమరావతిలో ఎడ్యుకేషన్, హెల్త్ హబ్ లను కలిపితే ఈ ప్రాంతం ప్రపంచ పటంలో విశ్వనగరంగా నిలుస్తుంది. రూ.2 లక్షల కోట్ల అప్పు.. ఎవరి కోసం? చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో కేవలం రోడ్లు, నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కోసమే రూ.2 లక్షల కోట్ల అప్పు తెచ్చి ప్రజలపై భారం వేయాలని చూస్తోంది."తాను అధికారంలో ఉన్న ఏడేళ్లలో కేవలం రూ.8 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిన చంద్రబాబు, ఇప్పుడు లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఆ అప్పు ఎవరు తీర్చుతారు? భవనాల నిర్మాణానికి మరో రూ.2-3 లక్షల కోట్లు కావాలి. ఇదంతా ఎప్పటికి పూర్తవుతుంది, ప్రజలు ఎప్పుడు చూస్తారు?". అమరావతి నిర్మాణంలో భారీ అవినీతి జరుగుతోంది. హైదరాబాద్ వంటి మహానగరాల్లో చదరపు అడుగు నిర్మాణానికి రూ.5 వేలు ఖర్చవుతుంటే, అమరావతిలో రూ.11 నుండి రూ.12 వేలు వెచ్చిస్తున్నారంటే, సీఎం, మంత్రులు, కాంట్రాక్టర్లు ఎంత దోచుకుంటున్నారో అర్థమవుతోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ అభివృద్ధి వైయస్.జగన్ ప్రతిపాదన ప్రకారం, అమరావతికి కావాల్సిన రూ.2 లక్షల కోట్లలో కేవలం 10-20 శాతం (రూ. 20 వేల కోట్లు) ధనంతోనే విజయవాడ-గుంటూరు మధ్య మౌలిక సదుపాయాలు కల్పించి విశ్వనగరాన్ని ఆవిష్కరించవచ్చు. దీనివల్ల విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగి, ప్రజల వ్యాపారాలు, రాబడి పెరుగుతుందని, రాష్ట్ర స్వరూపమే మారుతుంది. అమరావతి రైతులు కూడా చంద్రబాబు పాలనలో మోసపోతున్నారు. ఎకరం భూమి తీసుకుని కేవలం 1000 గజాలు ఇస్తామంటున్నారని, అదే జగన్ ప్రతిపాదన ప్రకారం రైతులకు 2000 గజాల వరకు దక్కుతాయి, వారు మరింత లాభపడతారు. జగన్ పై అసూయతోనే విమర్శలు వైయస్.జగన్ పార్టీ పెట్టుకుని దేశ రాజకీయాల్లో బలంగా ఎదగడాన్ని జీర్ణించుకోలేక, టీడీపీ నేతలు అసూయతో జగన్ ప్రతిపాదనలపై చిందులు తొక్కుతున్నారు. "మావిగన్" అనే పేరు కొత్తగా అనిపించినా, ఢిల్లీ పూర్వం ఇంద్రప్రస్థగా ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. వైయస్. జగన్ ప్రతిపాదనపై చర్చించకుండానే దుష్ప్రచారం చేయడం సరికాదు. అమరావతికి వైయస్ఆర్‌సీపీ వ్యతిరేకం కాదు, అందుకే వైయస్. జగన్ అక్కడ ఇల్లు కట్టుకున్నారు, కానీ చంద్రబాబు ఇప్పటికీ ఆ పని చేయలేదు. 2024 ఎన్నికలు అమరావతిపై జరగలేదు, చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు, మోసపూరిత హామీల వల్లే కూటమి గెలిచింది. 2019లో అమరావతి అజెండాతో వెళ్లిన చంద్రబాబుకు ప్రజలు 23 సీట్లే ఇచ్చారు.. అంటే అప్పుడు ప్రజలు అమరావతికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినట్టే కదా ? ఓడిపోతే ఒకలా, గెలిస్తే మరోలా మాట్లాడటం చంద్రబాబుకు అలవాటు. ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం రూ.2 లక్షల కోట్ల అప్పు చేసి అమరావతిని మాత్రమే అభివృద్ధి చేయడం మంచిదా? లేదా కేవలం రూ.20-30 వేల కోట్లతో అమరావతితో పాటు గుంటూరు, మచిలీపట్నం, విజయవాడలను అభివృద్ధి చేయడం మంచిదా? అన్న దానిపై గ్రామ స్థాయిలో, ప్రజలు, మేధావుల మధ్య చర్చ జరగాలని కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజధాని పేరుతో రూ.2-3 లక్షల కోట్ల అప్పు చేసి చంద్రబాబు తన బినామీల ఆస్తులు పెంచుకోవాలని చూస్తే, ప్రజాక్షేత్రంలో కచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే జగన్ ఈ ప్రతిపాదన చేశారని, అంతిమంగా ప్రజలే ఏది మంచో నిర్ణయిస్తారని కాసు మహేష్ రెడ్డి స్పష్టం చేశారు.