కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు పట్టణంలో చేనేత వస్త్ర విక్రయశాలలను ఆప్కోలో విలీనం చేయాలన్న ప్రతిపాదనపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ ఎంపీ బుట్టా రేణుక, నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి మద్దతు ప్రకటించారు. చేనేత సహకార సంఘ సభ్యులతో కలిసి వారు విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇవాళ ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం సర్వసభ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. సమావేశ అజెండాలో చేనేత విక్రయశాలలను ఆప్కోలో విలీనం చేయాలన్న ప్రతిపాదన ఉండటంతో సంఘ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమావేశాన్ని అడ్డుకునేందుకు వైయస్ఆర్‌సీపీ శ్రేణులు, నేతన్నలు సిద్ధమవుతుండగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాలో వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన ఎమ్మిగనూరులో చేనేత రంగం వేలాది కుటుంబాలకు ఆధారంగా నిలిచింది. పద్మశ్రీ మాచాని సోమప్ప స్వాతంత్ర్యానికి పూర్వమే 1938లో ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి, విక్రయ సంఘాన్ని స్థాపించి నేతన్నలకు ఉపాధి కల్పించారు. అప్పటి నుంచి ఈ సంస్థ చేనేత కార్మికులకు జీవనాధారంగా మారింది. నేతన్నలు పోగుపోగుగా వడికి, సహజ రంగులతో విభిన్నమైన డిజైన్లు రూపొందిస్తూ దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించారు. మరమగ్గాల పోటీని ఎదుర్కొంటూ ఇప్పటికీ వందలాది మంది చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది. ఎమ్మిగనూరు చేనేత వస్త్రాలకు భౌగోళిక గుర్తింపు నమోదుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే సొసైటీకి ఉన్న ఆస్తుల కోసం రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా విలీన ప్రయత్నాలు జరుగుతున్నాయని నేతన్నలు ఆరోపిస్తున్నారు. “మేము 50 ఏళ్లుగా ఈ చేనేత మగ్గంపైనే ఆధారపడి జీవిస్తున్నాం. పోగు వడికితేనే మా కుటుంబాలు ముందుకు సాగుతున్నాయి. ఈ రోజు విక్రయశాలలను విలీనం చేస్తామని చెబుతున్నారు. రేపు సొసైటీనే విలీనం చేస్తే మేమెక్కడికి వెళ్లాలి” అని ఒక చేనేత కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశారు. విలీన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని నేతన్నలు, సంఘ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.