తిరుపతి: మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో వైయస్ జగన్ మోహన్ రెడ్డి గత ఐదేళ్లు పరిపాలన చేసి అభినవ పూలేగా బీసీలకు అండగా నిలిచారని వైయస్ఆర్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గం ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మహాత్మా జ్యోతీరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వైయస్ఆర్‌సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు చిన్నియాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, రాష్ట్ర పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆరు మండలాల నుంచి వచ్చిన బీసీ సెల్ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పూలే చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో భాగంగా బీసీ సెల్ నేతలు ఏర్పాటు చేసిన కేక్‌ను చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి కట్ చేసి, అక్కడికి వచ్చిన నాయకులకు తినిపిస్తూ పూలే జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతీరావు పూలే బీసీలకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శప్రాయుడని అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు వర్ణనాతీతమని పేర్కొన్నారు. సమాజంలో బీసీలకు సముచిత స్థానం కల్పించేందుకు పూలే చేసిన పోరాటం భావితరాలకు మార్గదర్శకమని చెప్పారు. పూలే సతీమణి సావిత్రీ బాయిపూలే మహిళా విద్యకు పునాది వేసిన గొప్ప వ్యక్తి అని, భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా ఆమె సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పూలే ఆశయాల సాధనకై వైయస్ఆర్‌సీపీ కట్టుబడి పనిచేస్తుందని, బీసీలు పార్టీకి వెన్నెముకలుగా నిలుస్తూ తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని, వారి సామాజిక, ఆర్థిక ఎదుగుదలకు కృషి కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీసీ నేతలకు ఘన సత్కారం ఈ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని వైయస్ఆర్‌సీపీ బీసీ సెల్ ముఖ్య నాయకులను చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలకు చెందిన బీసీ నేతలను గౌరవిస్తూ పూలే ఆశయాల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.