15న వైయ‌స్ జ‌గ‌న్‌ జువ్వలదిన్నె పర్యటన 

నెల్లూరు: మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ నెల 15న నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెకు పర్యటించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, మత్స్యకారుల సంక్షేమం కోసం ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేశామని, అయితే గత ప్రభుత్వంలో కొన్ని పనులు పెండింగ్‌లో ఉండగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. హార్బర్ భూములను ప్రైవేట్ కంపెనీకి ఇవ్వాలని తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మత్స్యకారుల ఉపాధికి ఇది ప్రమాదకరమని, భవిష్యత్తులో బోట్లు పెరిగే అవకాశాలున్న సమయంలో భూములను అప్పగించడం అన్యాయమని పేర్కొన్నారు. “కంపెనీలకు మేము వ్యతిరేకం కాదు, కానీ హార్బర్‌కు సంబంధించిన భూములను ఇవ్వడం తగదు” అని స్పష్టం చేశారు.

కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి మాట్లాడుతూ, “లోకేష్ శంకుస్థాపన తర్వాత మత్స్యకారులకు హార్బర్‌లో ప్రవేశం ఆపడం దుర్మార్గం. మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసే చర్యలు ఆపాలి” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పర్యటన మత్స్యకారుల సమస్యలను తెలుసుకోవడానికేనని, వారితో ఇంటరాక్టివ్ కార్యక్రమం నిర్వహించనున్నారని తెలిపారు. తమ సమస్యలను నేరుగా జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు మత్స్యకారులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జగన్ పర్యటనపై పోలీసులు అనవసరంగా ఆందోళన చెందుతున్నారని ప్రశ్నిస్తూ, మత్స్యకారులను రెండు వర్గాలుగా విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. వైయ‌స్ఆర్‌సీపీ నేత ప్ర‌తాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, జగన్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. “మత్స్యకారుల హక్కులను కాపాడేందుకు వైయ‌స్ఆర్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది. హార్బర్ భూములను ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వనివ్వము” అని స్పష్టం చేశారు.
 

Back to Top