ఉపాధి హామీ పథకం నిర్వీర్యానికి కేంద్రం కుట్రలు

వీబీ జీ రాంజీ చట్టంతో రాష్ట్రంపై పెనుభారం

ఎన్డీయేలో టీడీపీ భాగస్వామిగా ఉండీ ప్రయోజనమేంటి?

ఉపాధి చట్టం పరిరక్షణకు కలిసికట్టుగా పోరాడుదాం

వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టీకరణ

సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం పాదయాత్రకు మద్దతు తెలిపిన  వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  

అనంత‌పురం:  ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ఎన్డీయే ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం వల్ల రాష్ట్రాలపై భారీ ఆర్థిక భారం పడుతోందని, వెంటనే ఆ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం లింగారెడ్డిపల్లి క్రాస్‌ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో సాగుతున్న పాదయాత్రకు వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి రామ‌కృష్ణ‌, రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి శైలజానాథ్‌, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం లింగారెడ్డిపల్లి నుంచి అనంతసాగరం వరకు పాదయాత్రలో నడిచారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, “2005లో ప్రారంభమైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్ల గ్రామీణ పేదలకు ఉపాధి భద్రత లభించింది. అప్పటివరకు ఉపాధి కోసం వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఈ పథకం వల్ల గ్రామాల్లోనే వంద రోజుల పని లభించింది” అని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ పథకం సమర్థవంతంగా అమలైందని గుర్తు చేశారు. పేదలకు ఎంతో ఉపయోగకరమైన ఈ పథకాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బలహీనపరుస్తోందని విమర్శించారు. “గతంలో ఈ పథకానికి 90 శాతం నిధులు కేంద్రం భరించేది. కానీ కొత్త విధానం ప్రకారం కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం భరించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడుతోంది” అని అన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల పని కూడా ఇవ్వలేకపోతోంది. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా కేవలం 2.15 లక్షల కుటుంబాలకు మాత్రమే 100 రోజుల పని లభించింది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో కేవలం 12 వేల కుటుంబాలకు మాత్రమే ఈ ప్రయోజనం అందింది” అని పేర్కొన్నారు. ఎన్డీయేలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని విమర్శించారు. పాత విధానంలోనే ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. “ఉపాధి కూలీల హక్కులను కాపాడుకోవాలంటే అందరూ కలిసికట్టుగా పోరాడాలి. హక్కులు హరించబడుతున్నప్పుడు మౌనంగా ఉండడం సరికాదు” అంటూ ఆయన పిలుపునిచ్చారు.
 

Back to Top