ప్రకాశం: జిల్లా కలెక్టర్ రాజబాబును వైయస్ఆర్‌సీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి రైతుల సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వినతి పత్రాన్ని సమర్పించారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సాగునీటి సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి విషయాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన నేతలు, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఇటీవల కొంతమంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడిన విషయాన్ని ప్రస్తావిస్తూ, వెంటనే ఆ ఓటర్లను తిరిగి చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ఓటు హక్కు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ వెంకాయమ్మ, ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవి బాబు, బంగారు బాబు, శ్రీమన్నారాయణ, నకరికంటి శ్రీనివాసరావు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని వైయస్ఆర్‌సీపీ నేతలు తెలిపారు.