తిరుపతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అమరావతి మహానగర నిర్మాణం ఎంతవరకు సమంజసమనే అంశంపై బహిరంగ చర్చ జరగాలని రాయలసీమ మేధావుల వేదిక సమన్వయకర్త ఎం.పురుషోత్తమ్‌రెడ్డి స్పష్టం చేశారు. రాజధానితో పాటు రాయలసీమ ప్రాజెక్టులకు కాలపరిమితి నిర్థారించుకోవాలన్న ఆయన, అమరావతిపై చరిత్రను వక్రీకరిస్తూ కుట్ర సిద్ధాంతాలు సరికావని తేల్చి చెప్పారు. రాష్ట్ర ఆర్థిక ప్రస్తుత పరిస్థితి చూస్తే అమరావతి మహానగర నిర్మాణం సాధ్యమా? అని సందేహం వ్యక్తం చేశారు. కొత్త నగరాల మనుగడ ప్రశ్నార్థకమని.. నోయిడా, లవాసానే అందుకు నిదర్శనమని తేల్చి చెప్పారు. అప్పులతో కట్టే నగరం భవిష్యత్తులో ఆర్థికంగా నిలబడుతుందా? అని ప్రశ్నించారు. అందుకే ఇప్పటికే అభివృద్ది చెందిన నగరాల మేళవింపైన ‘మావిగన్’, కొత్త నగరం కంటే ఆర్థికంగా అత్యంత వయబుల్ అని చెప్పారు. ఇంకా చెప్పాలంటే శూన్యం నుంచి నగరాన్ని సృష్టించడం కన్నా, ఉన్న నగరాలను కలుపుకు పోవడమే అన్ని విధాల మేలు అని తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఎం.పురుషోత్తమ్‌రెడ్డి తేల్చి చెప్పారు. ప్రెస్‌మీట్‌లో ఎం.పురుషోత్తమ్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..: వారు చరిత్రను వక్రీకరిస్తున్నారు: ఏబీ వెంకటేశ్వరరావు, నల్లమోతుల చక్రవర్తి వంటి వారు అమరావతి చుట్టూ జరుగుతున్న చర్చను ’కుట్ర’గా చెబుతూ చరిత్రను వక్రీకరించడం సరికాదు. వారు చరిత్రకు కొత్త భాష్యాలు చెబుతున్నారు. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు విజయవాడ రాజధాని కావాలని ఎలాంటి చర్చ జరగలేదు. వాస్తవానికి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారమే రాయలసీమ ఛాయిస్ మేరకు రాజధానిగా కర్నూలు ఎంపికైంది. 1953లోనే నాటి ప్రధాని నెహ్రూ ఉమ్మడి మద్రాసు సీఎం రాజాజీకి రాసిన లేఖ అందుకు సాక్ష్యం. ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలి: ప్రపంచంలో కొత్తగా నిర్మించిన నగరాలైన లవాసా, నోయిడా వంటివి జనాభా లేక వెలవెలబోతున్నాయి. అందుకే అప్పులు తెచ్చి నిర్మించే అమరావతి మహానగరం భవిష్యత్తులో ఆర్థికంగా నిలదొక్కుకుంటుందా? అన్న సందేహం వస్తోంది. అక్కడ కేవలం మౌలిక సదుపాయాలకే లక్షల కోట్లు ఖర్చవుతున్న తరుణంలో, రాజధానితో పాటు, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. హంద్రీనీవా, రాయలసీమ లిఫ్ట్ వంటి ప్రాజెక్టుల పూర్తికి రూ.40 వేల కోట్లు అవసరం. అందుకే వాటికి స్పష్టమైన కాలపరిమితి విధించుకుంటూ, ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలి. అసలు మహానగర నిర్మాణం సా«ధ్యమా?: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా అమరావతి మహానగర నిర్మాణం ఎంతవరకు సాధ్యం? దీనిపై బహిరంగ చర్చ జరగాలి. ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇప్పటికే తీసుకున్న, ఇంకా తీసుకోబోతున్న భూమిలో కనీస మౌలిక సదుపాయాల కల్పనకే చంద్రబాబు లెక్కల ప్రకారం ఎకరాకు రూ.2 కోట్ల చొప్పున రూ.2 లక్షల కోట్లు కావాలి. మరోవైపు మహానగరం పూర్తయ్యే వరకు రైతులకు ఏటా వేల కోట్లు కౌలు కింద చెల్లించాలి. అది ప్రభుత్వానికి భారంగా మారుతుంది. రాజధాని అమరావతి కోసం రైతుల నుంచి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా 33 వేల ఎకరాలు తీసుకుంది. వాగులు, వంకలు ఇతరత్రా ప్రభుత్వ భూములు 21 వేల ఎకరాలు కలిపి మొత్తం 54 వేల ఎకరాలు. అమరావతి రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఏడాదికి ఎకరాకి రూ.50 వేలు కౌలు ఇవ్వాలి. అదే విధంగా 100 సెంట్లు నుంచి 27 సెంట్లు లోపు లోపు భూమి ఇస్తే 3 రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలి. అంటే 1.09 లక్షల ప్లాట్లు రైతులకివ్వాలి. భూములిచ్చిన రైతులకు బతుకు తెరువు పోయింది కాబట్టి, కౌలు ఇవ్వాలి అందులో తప్పు పట్టాల్సిన పని లేదు. కానీ, ఎంత కాలం కౌలు ఇవ్వగలం? ఎంత కాలం నగరాన్ని నిర్మిస్తాం? మీరు మహానగరాన్ని నిర్మించనంత వరకు, రైతులకు ప్లాట్లు ఇవ్వనంత వరకు రైతులకు కౌలు ఇచ్చుకుంటూ పోవాల్సిన పరిస్ధితి. అందుకు ఎన్ని వేల కోట్లు అవుతుందన్నదే ప్రధానమైన ప్రశ్న. అంతే తప్ప ఇవ్వడాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు. మొత్తం అప్పులతో నగర నిర్మాణం!: అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లు 8.5 శాతం వడ్డీతో అప్పు తెస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని అబద్దాలు చెబుతున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ష్యూరిటీ మాత్రమే ఇస్తుంది. ఏ రాష్ట్రమైనా భారత ప్రభుత్వ వెలుపల అప్పు తేవాలంటే కేంద్ర ప్రభుత్వ ష్యూరిటీ ఉండాలి. అందులో భాగంగానే కేంద్రం ఈ రూ.15 వేల కోట్లకు ష్యూరిటీ ఇచ్చింది. దీనికి ఏటా రూ.1275 కోట్లు వడ్డీ కట్టాలి. రుణాన్ని 20 ఏళ్లలో చెల్లించాలి. అంటే మొత్తం రూ.40 వేల కోట్లు కట్టాలి. ఆ పత్రాలు బయటపెడితే అసలు విషయాలు బయటపడతాయి. రూ.15 వేల కోట్లకే ఇంత వడ్డీ. మరి అమరావతిలో మొత్తం అప్పులు లెక్కిస్తే, అందుకు వడీ ఎంత కట్టాల్సి వస్తుంది. చివరకు అసలుతో సహా, ఆ భారం ఎక్కడి వరకు వెళ్తుంది?. అంత ఖర్చు పెట్టే స్ధితిలో ఏపీ బడ్జెట్ ఉందా?. అంత ఖర్చు పెట్టినా నగరాల సస్టైనబులిటీ ఎంత? నూతన నగరాల మనుగడపై ప్రశ్నలు: ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నిర్మించిన నగరాల అనుభవాలను చూస్తే.. అమరావతి సస్టైనబులిటీపై సందేహాలు కలుగుతున్నాయి. ఉదా: 60 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన కేంద్ర పాలిత ప్రాంతం చండీఘడ్. అది హరియాణ, పంజాబ్ రెండింటికీ రాజధాని. ఇప్పుడు అక్కడ జనాభా 11 లక్షలు అంటే మన గుంటూరుతో సమానం. ఇంకా చత్తీస్‌గఢ్‌లో నయా రాయపూర్ 20 ఏళ్ల క్రితం ప్రారంభిస్తే, ఈరోజుకీ అక్కడ జనాభా 6 లక్షలు. అంటే హైదరాబాద్‌ని మించిన నగరం, ప్రపంచంలో టాప్ సిటీ అన్నది ఎప్పటికి సాధ్యం? అంత వరకు ప్రభుత్వం ఎంత వరకు ఖర్చు చేయగలదు? రెండోది అప్పు చేసి నిర్మించిన నగరాలు, వాటి అనుభవాలు చూస్తే.. ఘజియాబాద్, న్యూఢిల్లీకి మధ్యలో ఉన్న నొయిడా. దాని జనాభా 6 లక్షలు. వాస్తవానికి నోయిడా హైలీ సక్సెస్‌ఫుల్ ఎస్‌ఈజడ్. ఆ సెజ్ లక్షలాది మందికి ఉద్యోగాలిస్తోంది. విషయం ఏమిటంటే అక్కడ ఉద్యోగాలు చేసిన వాళ్లు సాయంత్రానికి ఢిల్లీ, ఘజియాబాద్ వెళ్లిపోతున్నారే తప్ప అక్కడ ఎవరూ ఉండడం లేదు. 40 శాతం అపార్టమెంట్లు ఖాళీగా ఉన్నాయి. మహారాష్ట్రలోని లవాసా నగరం నిర్మించినా జనం రావడం లేదు. వీటన్నింటి నేపథ్యంలో జగన్‌గారు ప్రతిపాదించిన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలతో కూడిన ‘మావిగన్’ రాజధానిగా ఎంతో అనువైన ప్రాంతం. కొత్త నగర నిర్మాణం కంటే, మావిగన్ ప్రాంతంలో చాలా తక్కువ వ్యయంతో, డే వన్ నుంచే రాజధాని అందుబాటులోకి వస్తుంది. రాయలసీమ ప్రయోజనాలు కాపాడండి: రాజధాని కోసం రాయలసీమ ప్రజలు ఇప్పటికే అనేక అవకాశాలు కోల్పోయారు. ఇప్పుడు అమరావతికి సమాంతరంగా రాయలసీమకు కూడా ప్రణాళిక ప్రకటించాలి. అలా కాకుండా కొత్తగా నగరం నిర్మిస్తామంటే రాష్ట్రం అప్పులు పాలవుతుంది. అప్పుడు రాయలసీమ పరిస్ధితి ఏంటి? కొత్త అప్పులు అక్కడే పెడితే రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఇప్పటికే రాయలసీమ ప్రజలు రాజధానితో పాటు అనేక అవకాశాలు కోల్పోయాం. ఇంత రాజీపడుతున్న రాయలసీమకు సమాంతరంగా ఒక ప్రాజెక్టు రూపొందించాలి. రాజధాని అమరావితిని ఒక మహానగరం అంటున్నారు. అదే సమయంలో రాయలసీమ విషయంలో కూడా సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో ఒక ఆలోచన చేయాలి. ఒక్క ఏడాదిలోనే ప్రాజెక్టులు కట్టమని చెప్పడం లేదు. ఐదు, పదేళ్ల ప్రణాళికతో రాయలసీమ లిఫ్ట్, హంద్రీనీవా వంటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రూ.40 వేల కోట్లు ఖర్చవుతాయి. ప్రతి జిల్లాకు గ్రావిటీ పూర్స్‌తో 40–50 టీఎంసీల నీళ్లు వస్తాయి. ఆ ప్రణాళిక తీసుకురండి. కార్యాచరణ ప్రకటించండి. లేదా రాయలసీమకు ఏదైనా కొత్త ప్రణాళిక ఉంటే చెప్పాలి. అందుకే తమ డిమాండ్ ఒక్కటే అని, అది అమరావతితో పాటు రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో కూడా మందడుగు వేసి.. రెండింటీకీ కాలపరిమితి పెట్టి పూర్తి చేయాలని ఎం.పురుషోత్తమ్‌రెడ్డి స్పష్టం చేశారు.