వైయస్ఆర్ జిల్లా: అలంఖాన్‌పల్లెకు చెందిన పెద్ద దస్తగిరి హత్యకు వ్యక్తిగతవివాదంలో రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవే కారణమని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా స్పష్టం చేశారు. దస్తగిరి హత్య దారుణమైనది. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కానీ ఈ ఘటనను వాస్తవాలకు విరుద్ధంగా రాజకీయ రంగు పులుముతూ రాజకీయహత్యగా మలచే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పై స్థాయి ఆదేశాలతో కొందరు అధికారులు ఈ కేసును రాజకీయ హత్యగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. వైయస్ఆర్‌సీపీ నాయకులను ఈ కేసులో ఇరికించే కుట్ర జరుగుతోందని కడప నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన అనుమానం వ్యక్తం చేశారు. నిజాలు బయటకు రావాలంటే దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలని, అసలు నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రెస్‌మీట్‌లో అంజాద్‌బాషా ఇంకా ఏమన్నారంటే.. రాజకీయ హత్యగా మలిచే ప్రయత్నం మా పార్టీకి చెందిన సానుభూతిపరుడు పెద్ద దస్తగిరి హత్య దారుణమైనది. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ ఈ ఘటనను వాస్తవాలకు విరుద్ధంగా రాజకీయ రంగు పులుముతూ రాజకీయ హత్యగా మలచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గంజాయి వ్యవహారానికి సంబంధించిన రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవే ఈ హత్యకు దారి తీసింది. దీనిని పూర్తిగా రాజకీయ హత్యగా చిత్రీకరించడం తగదు. ఆ 10 రోజులు నిందితులు ఎక్కడ ఉన్నారు? వ్యక్తిగత వివాదంలో ఈ నెల 6వ తేదీన దస్తగిరిని దారుణంగా హత్య చేశారు. 7వ తేదీన కొందరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. 8వ తేదీన మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే 18వ తేదీ నిందితులను రిమాండ్‌కు పంపించారు. ఈ మధ్యలో ఉన్న 10 రోజుల వ్యవధిలో ఏం జరిగింది. ఆ సమయంలో నిందితులు ఎక్కడ ఉన్నారు. ఈ ఘటనను రాజకీయంగా మలచడానికి ప్రభుత్వం పెద్దల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. అందులో భాగంగానే మంత్రులు మీడియా ముందుకు వచ్చి వైయస్ఆర్‌సీపీపై నిందలు వేస్తున్నారు. వైయస్ జగన్‌కు ఈ హత్యను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. డిప్యూటీ మేయర్‌ను కేసులో ఇరికించే కుట్ర పెద్ద దస్తగిరి హత్య కేసులో వైయస్ఆర్‌సీపీకి చెందిన కడప డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిని అక్రమంగా ఇరికించే కుట్ర జరుగుతోంది. అంతేకాకుండా మా నాయకుడు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి వరకు అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యక్తిగత వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకు దస్తగిరి హత్యను రాజకీయ హత్యగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. హత్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పాయి. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతున్నా రైతులకు సాగునీరు లేదు, ఎరువులు లేవు, విత్తనాలు అందడం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. కానీ మద్యం, డ్రగ్స్ మాత్రం 24 గంటలు లభిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా హత్యలు పెరిగాయి. 23 నెలల్లో 21 హత్యలు జరగడం దురదృష్టకరం. ఇప్పుడు దస్తగిరి హత్యను జగన్‌పై మోపే ప్రయత్నం జరుగుతోంది. హత్యా రాజకీయాలు ఎప్పుడూ ప్రోత్సహించలేదు వైయస్ కుటుంబం ఎప్పుడూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదు. వైయస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో ఫ్యాక్షనిజాన్ని అంతం చేసి శాంతిని నెలకొల్పారు. అదే మార్గంలో జగన్ గారు కూడా నైతిక విలువలతో రాజకీయాలు చేస్తున్నారు. దర్యాప్తు అధికారాలు పోలీసులకే ఉంటాయి. కానీ కొన్ని పత్రికలు ముందుగానే తీర్పు చెప్పినట్లు కథనాలు రాస్తున్నాయి. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయండి ఈ నెల 13వ తేదీన మా పార్టీ నేతలు, దస్తగిరి కుటుంబ సభ్యులు వైయస్ఆర్ జిల్లా ఎస్పీని కలిసి నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కోరాం. దోషులకు కఠిన శిక్షలు పడాలని కోరుతున్నాం. కానీ ఇప్పుడు కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కూటమి ఒత్తిళ్లకు లొంగకుండా నిజమైన నిందితులను గుర్తించి శిక్షించాలి అని అంజాద్‌బాషా డిమాండ్ చేశారు.