విశాఖపట్నం: వైయస్ఆర్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో గీతం యూనివర్సిటీకి “చలో” పిలుపునిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. రుషికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి గీతం యూనివర్సిటీ వరకు శ్రేణులు భారీగా తరలివచ్చి నినాదాలతో ముందుకు సాగారు. ఈ ర్యాలీలో వైయస్ఆర్‌సీపీ నాయకులు గుడివాడ అమర్నాథ్, కేకే రాజు, మొల్లి అప్పరావు, దేవన్ రెడ్డి, మల్లా విజయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం గీతం యూనివర్సిటీ ముందు నిరసన కార్యక్రమం చేపట్టేందుకు శ్రేణులు సిద్ధమయ్యారు. గీతం యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించుకున్న నేపథ్యంలో సామాజిక బాధ్యతగా ఈ సీట్లను ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. ఈ ఆందోళన నేపథ్యంలో గీతం యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. విద్యలో సమాన అవకాశాల కోసం తమ పోరాటం కొనసాగుతుందని, డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు ఆపబోమని వైయస్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు.