వైయ‌స్‌ జగన్‌ ప్రభంజనానికి 15 ఏళ్లు 

 తాడేపల్లి:   వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారతదేశ ఎన్నికల చరిత్రలో 5.45 లక్షల భారీ మెజార్టీతో ప్రభంజనం సృష్టించి బుధవారంతో 15 ఏళ్లు పూర్తయింది. 2011లో వైయ‌స్‌ జగన్‌ కాంగ్రెస్‌ పార్టీకి, కడప ఎంపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీ స్థాపించిన రెండు నెలల్లోనే నిర్వహించిన ఉప ఎన్నికల్లో భారీ విజయంతో చరిత్ర సృష్టించారు. దేశ రాజకీయాల్లో సంచలనంగా నిలిచారు. ఆ ఎన్నికల ఫలితాలు 2011 మే 13న వెలువడ్డాయి. 
 
కడప పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థిగా కనీవినీ ఎరుగని రీతిలో 5,45,672 ఓట్ల భారీ మెజార్టీతో వైఎస్‌ జగన్‌ విజయం సాధించి దేశం దృష్టిని ఆకర్షించారు. 2011 నాటికి లోక్‌సభ చరిత్రలో భారీ మెజార్టీ సాధించిన రెండో నాయకుడిగా దేశ రాజకీయాల్లో రికార్డు సృష్టించారు. 1991లో నంద్యాల లోక్‌సభ ఉప ఎన్నికలో మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు 5.8 లక్షల ఓట్ల మెజారీ్టతో మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానంలో వైఎస్‌ జగన్‌ నిలిచారు. ఆ తర్వాత ఎదురైన రాజకీయ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రజల్లోనే ఉన్నారు. 

2014–19 మధ్య రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యల పట్ల నిరంతర పోరు సాగించారు. 2019 ఎన్నికలకు ముందు 3,648 కిలోమీటర్ల మేర ‘ప్రజా సంకల్ప పాదయాత్ర’చేపట్టి నాటి చంద్రబాబు రాక్షస పాలన నుంచి విముక్తి కల్పించేలా ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’అంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి మరోమారు దేశ రాజకీయాలను షేక్‌ చేశారు. 2019–24 మధ్య నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాల అమలుతో పాటు, నిర్మాణాత్మక అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి దిశగా బలమైన అడుగులు వేశారు. 

ఈ నేపథ్యంలో దేశ చరిత్రలో వైయ‌స్‌ జగన్‌ సంచలన గెలుపునకు 15 ఏళ్లు పూర్తవ్వడంతో బుధవారం సోయల్‌ మీడియా మారుమోగిపోయింది. వైయ‌స్‌ జగన్‌ అభిమానులు రికార్డు విజయాన్ని గుర్తు చేసుకుంటూ పోస్టులు హోరెత్తించారు. వైయ‌స్‌ జగన్‌ రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు.  

Back to Top