శ్రీకాకుళం: రైతాంగానికి మేలు చేసే విత్తన శుద్ధి, నిల్వ కేంద్రాన్ని ప్రారంభించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైయస్ఆర్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జ్ పేరాడ తిలక్ మండిపడ్డారు. బుధవారం నందిగాం మండలం బడబంద సమీపంలో నిర్మించిన విత్తన శుద్ధి కేంద్రాన్ని సందర్శించిన ఆయన, అనంతరం విలేకరులతో మాట్లాడారు. వైయస్ జగన్ హయాంలో రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయలతో ఈ కేంద్ర నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. మరో నాలుగున్నర కోట్లతో యంత్ర పరికరాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ, రెండు సంవత్సరాలు గడిచినా ప్రారంభానికి నోచుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు నిర్లక్ష్య వైఖరి కారణంగానే కేంద్రం ప్రారంభం కాలేదని విమర్శించారు. ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తే జగన్‌మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విత్తన శుద్ధి కేంద్రం ప్రారంభమైతే స్థానిక రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, విత్తనాల నాణ్యత పెరగడంతో పాటు నిల్వ సౌకర్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. తక్షణమే కేంద్రాన్ని ప్రారంభించాలని, లేనిపక్షంలో రైతాంగం తరఫున ఆందోళనలు చేపడతామని తిలక్ హెచ్చరించారు. రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్నచంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులు, కార్యకర్తలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు.