తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అన్నదాతల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రైతులకు కష్టకాలం మొదలైనట్లేనని మండిపడ్డారు. రాష్ట్రంలో మొక్కజొన్న, శెనగ వంటి పంటలకు కనీస మద్దతు ధర లభించక రైతులు వేల కోట్లు నష్టపోతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని ధ్వజమెత్తారు. వైయస్ . జగన్ హయాంలో కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మార్క్ ఫెడ్ ద్వారా ప్రతి గింజను కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచామని, కానీ నేడు చంద్రబాబు ప్రభుత్వం "నిధులు లేవు" అనే కుంటి సాకులు చెబుతూ రైతుల ఉసురు తీస్తోందని విమర్శించారు. మంత్రుల విహార యాత్రలకు, సింగపూర్ శిక్షణలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. మార్కెట్‌లో దళారుల చేతిలో మోసపోతున్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని తక్షణమే పంట కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... - మొక్కజొన్న, శెనగ రైతులకు భారీ నష్టం.. ప్రస్తుత రబీ సీజన్‌లో పంటల కొనుగోలుపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం వల్ల రైతులు వేల కోట్లు నష్టపోతున్నారు. రాష్ట్రంలో 5 లక్షల హెక్టార్లలో సాగైన మొక్కజొన్నకు రూ. 2400 మద్దతు ధర (MSP) ఉండగా, దళారులు రూ. 1500-1800కే కొంటున్నారు. దీనివల్ల రైతులు సుమారు రూ. 3 వేల కోట్లు నష్ట పోతున్నారు. శెనగకు ఎంఎస్పీ రూ. 5875 ఉండగా మార్కెట్‌లో రూ. 4800కే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిర్చి, పత్తి, పొగాకు, మామిడి, ఉల్లి, అరటి రైతులకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు. - వైయస్. జగన్ పాలన - కూటమి పాలన మధ్య వ్యత్యాసం.. వైయస్ జగన్ హయాంలో కరోనా వంటి కష్ట కాలంలో కూడా మార్క్ ఫెడ్ ద్వారా ప్రతి పంటను మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం "డబ్బుల్లేవు" అని చెప్పడం సిగ్గుచేటు. రెండేళ్లు కాకముందే రూ. 3.57 లక్షల కోట్లు అప్పు తెచ్చిన ప్రభుత్వం, ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి పోయిందో సమాధానం చెప్పాలి. - మంత్రుల షికార్లు - రైతుల కష్టాలు.. రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్లపై విలపిస్తుంటే, మంత్రులు కోట్లాది రూపాయల ప్రజాధనంతో సింగపూర్‌లో షికార్లు చేస్తూ శిక్షణ పొందుతున్నారు. "ప్రపంచానికే పాఠాలు చెబుతాననే చంద్రబాబుకు, తన మంత్రులకు సింగపూర్‌లో శిక్షణ ఇప్పించాల్సిన అవసరం ఏమొచ్చింది?". రైతు సమస్యలపై అధికారులతో ఒక్క సమీక్ష కూడా నిర్వహించని చంద్రబాబుకు రైతుల పట్ల కనీస మానవత్వం లేదు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు అండగా నిలిచిన వైయస్.జగన్ సంక్షేమ పాలనను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందని అప్పరెడ్డి మండిపడ్డారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతును ఆదుకోకపోతే, అదే రైతాంగం 'ఓటు' అనే ఆయుధంతో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమని లేళ్ల అప్పిరెడ్డి హెచ్చరించారు.