తాడేపల్లి: మావిగన్ పై ప్రజల్లో జరుగుతున్న చర్చ వల్ల ప్రభుత్వానికి నష్టమని గ్రహించి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి దస్తగిరి హత్యతో కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కి తెర లేపిందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌రావు ఆరోపించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు వర్గాల ఘర్షణ నేపథ్యంలో దస్తగిరిని కడప రిమ్స్‌లో నరికి చంపితే, దిగజారిన శాంతిభద్రతలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిని ఇరికించి చంద్రబాబు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాడని ఆరోపించారు. అందులో భాగంగానే వరుసగా మంత్రులను మీడియా ముందుకు పంపించి అసత్య ప్రచారం చేయిస్తున్నాడని చెప్పారు. వివేకా హత్య కేసు దర్యాప్తును కొనసాగించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడటంతో ఆ కేసుతో ఇక లాభం లేదనుకున్న చంద్రబాబు.. వైయస్ఆర్‌సీపీ మీద బురదజల్లి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి దస్తగిరి మర్డర్‌ను వాడుతున్నారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు చంద్రబాబుకి పేటెంట్ ఉందని, ఆయన హయాంలోనే ప్రముఖ జర్నలిస్ట్ పింగళి దశరథరామ్, కాపు నాయకుడు వంగవీటి మోహనరంగాలను అతి కిరాతకంగా హత్య చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా వైయస్ రాజారెడ్డి హత్య కేసులో నిందితులకు చంద్రబాబు 30 రోజులు హైదరాబాద్‌లో షెల్టర్ కూడా ఇచ్చాడని ఆరోపించారు. చంద్రబాబు పాపం పండే రోజులు ఎంతోదూరంలో లేవని జూపూడి ప్రభాకర్‌రావు అభిప్రాయపడ్డారు. ప్రెస్‌మీట్‌లో జూపూడి ప్రభాకర్‌రావు ఇంకా ఏమన్నారంటే..: ప్రభుత్వ వైఫల్యాలకు డైవర్షన్ రాజకీయం: అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా అనేక విషయాల్లో కూటమి ప్రభుత్వం విఫలమవుతూనే ఉంది. కూటమిని నమ్మి ఓటేసిన అన్ని వర్గాలను దారుణంగా వంచించారు. విజనరీనని చెప్పుకునే నిత్యం చంద్రబాబు తన అసమర్థతను బయటపెట్టుకుంటూనే ఉన్నాడు. రెండేళ్లు కాకుండానే ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి సమస్య వచ్చినప్పుడల్లా ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే పనిగా పెట్టుకుంది. రైతులకు కనీసం యూరియా బస్తా కూడా అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. దస్తగిరి హత్యను వైయస్ఆర్‌సీపీకి ఆపాదించే కుట్ర: కడప రిమ్స్‌లో దస్తగిరి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని గూండాలు చంపితే మంత్రులతో పదే పదే మీడియాతో మాట్లాడించి దాన్ని వైయస్ఆర్‌సీపీ మీదకు అంటగట్టే ప్రయత్నాన్ని చంద్రబాబు కొనసాగిస్తున్నాడు. కడపలోని రిమ్స్‌లో దస్తగిరి అనే వ్యక్తి దారుణహత్యకు గురైతే, దాన్ని ఎలాగోలా జగన్‌గారికి ఆపాదించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మారెమ్మ జాతరలో డీజే సౌండ్స్‌కు సంబంధించి, చిన్న వివాదం తలెత్తి మరో వర్గం వారితో విభేదాలు మొదలయ్యాయి. అవి కాస్తా ఎక్కువై, దాడులు, ప్రతిదాడుల వరకు వెళ్లి దస్తగిరి ప్రత్యర్థి వర్గం అతడి కొడుకుపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. కొడుకును చూసేందుకు ఆస్పత్రికి వెళ్లిన దస్తగిరిని అక్కడే ప్రత్యర్థులు మాటు వేసి హత్య చేశారు. ఆ కేసును ఎలాగైనా వైయస్ఆర్‌సీపీకి అంటగట్టేందుకు అధికార పక్షం నానా తంటాలు పడుతోంది. ఇప్పటికే డీఎస్పీ సహా, దర్యాప్తు బృందాన్ని మార్చేశారు. తమకు కావాల్సిన వారిని ఆ కేసు దర్యాప్తులో వేశారు. కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డికి దస్తగిరి హత్య కేసు అంటగడుతూ మంత్రులు మాట్లాడుతున్నారు. నిత్యానందరెడ్డి ఇంట్లో సోదా చేసి రూ.100 కోట్ల విలువైన పత్రాలు దొరికాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మొన్న నిమ్మల రామానాయుడు, నిన్న కె.పార్థసారధి, ఇవాళ సవిత ఇష్టానుసారం ఆరోపణలు చేస్తున్నారు. మళ్లీ మళ్లీ అవే పచ్చి అబద్ధాలు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా, దాన్ని నిజం చేయాలన్న భ్రమల్లో టీడీపీ ఉంది. అందుకే చంద్రబాబు డైరెక్షన్ మేరకు వరసబెట్టి మంత్రులు మాట్లాడుతూ, జగన్‌గారిపై నిందలు వేస్తున్నారు. ఇన్నాళ్లూ వివేకా హత్యను డైవర్షన్ కోసం వాడిన చంద్రబాబు అండ్ కో కేసును ఇంకా కొనసాగించాల్సిన అవసరం కనిపించడం లేదని సుప్రీంకోర్టు సైతం చెప్పడంతో దస్తగిరి హత్యను వైయస్ఆర్‌సీపీకి ఆపాదించే కుట్రకు వ్యూహ రచన చేస్తోంది. హత్యా రాజకీయాలపై పేటెంట్ ఉన్న నాయకుడు చంద్రబాబే: రాష్ట్రంలో హత్యా రాజకీయాలపై పేటెంట్ ఉన్న నాయకుడు చంద్రబాబు మాత్రమే. హత్యలు చేయించడం, ఆ తర్వాత నిందలు వేయడం ఆయన నైజం. వాటిలో ఆరితేరిన వ్యక్తి చంద్రబాబు. హత్యలు చేసి రాజకీయాల్లో తనంతటి స్వచ్ఛమైన వ్యక్తి లేడని చెప్పుకోవడం చంద్రబాబుకి అలవాటు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాజ్యాంగేతర శక్తిగా మారి చంద్రబాబు చేయని అకృత్యాలు లేవు. ఎన్టీఆర్ మీద హత్యాయత్నం చేసిన మల్లెల బాబ్జీ అనుమానాస్పద రీతిలో విజయవాడలోని ఓ లాడ్జిలో చనిపోయాడు. అప్పుడు అందరూ చంద్రబాబు మీదనే అనుమానాలు వ్యక్తం చేశారు. విజయవాడలో జర్నలిస్ట్ పింగళి దశరథరామ్, వంగవీటి మోహన రంగాల హత్య వెనుక చంద్రబాబు పాత్ర ఉందనేది ఓపెన్ సీక్రెట్. వైయస్ రాజారెడ్డి హత్య కేసు నిందితులకు హైదరాబాద్‌లో షెల్టర్ ఇచ్చింది కూడా చంద్రబాబే. చంద్రబాబు సీఎం అయ్యాక 2024 నుంచి నేటి వరకు 23 నెలల్లో 21 రాజకీయ హత్యలు జరిగాయి. ఇతర హత్యలు కూడా కలిపితే 710కి పైగా ఉన్నాయి. చంద్రబాబు పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది: అసత్య ప్రచారంతో వైయస్ జగన్ గారి మీద నిందలు మోపి రాజకీయ లబ్ధిపొందాలని చూడటం హేయం. సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ మీదనే పడుతుందని గుర్తుంచుకోవాలి. అధికారంలో ఉన్నాం కాబట్టి ఏం చేసినా చెల్లుబాటవుతుందని, మీడియా బలంతో ప్రజలను నమ్మించ వచ్చనే భ్రమల్లోంచి బయటకు రావాలి. ఇంకా చంద్రబాబు చేస్తున్న పాపాలు పండే రోజు ఇంకా ఎంతో దూరంలో లేదని జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు.