శ్రీకాకుళం : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి, సుమారు 70 శాతం పనులు పూర్తి చేసిన మూలపేట పోర్టు నిర్మాణాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ వైయస్ఆర్‌సీపీ 'చలో మూలపేట' పేరిట భారీ ఎత్తున పోరాటానికి శ్రీకారం చుట్టింది. శ్రీకాకుళం జిల్లా నౌపాడులో జరిగిన భారీ బహిరంగ సభలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వైయస్ఆర్‌సీపీ అగ్రనేతలు, మాజీ మంత్రులు, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తదితరులు పాల్గొని కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైయస్.జగన్ సీఎంగా ఉన్న కాలంలో 70 శాతం పనులు పూర్తి చేస్తే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా మిగిలిన 30 శాతం పనులను కూడా పూర్తి చేయలేకపోవడం వారి అసమర్థతకు, ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక పదవుల్లో ఉన్న జిల్లా నేతలు (అచ్చన్నాయుడు, రామ్మోహన్ నాయుడు) కేవలం కమిషన్ల కోసమే పోర్టు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని, వైయస్.జగన్ కు పేరు వస్తుందనే కుళ్లుతో పనులు నిలిపివేశారని ఆరోపించారు. పోర్టు నిర్మాణం పూర్తయ్యే వరకు, స్ధానిక యువతకు ఉపాధి లభించే వరకు వైయస్ఆర్‌సీపీ పోరాటం ఆపబోదని నేతలు తెల్చిచెప్పారు. సభకు హాజరైన ఉత్తరాంధ్ర జిల్లాల వైయస్ఆర్సీపీ నాయకులు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమరనాథ్, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణ దాస్, బూడి ముత్యాల నాయుడు, పాముల పుష్ప శ్రీవాణి, సీదిరి అప్పలరాజు,మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంభా రవిబాబు, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, వివిధ నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర నేతలు హాజరు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే... అభివృద్ధిని కాంక్షించి జగన్ అడుగులు: ధర్మాన కృష్ణదాసు, మాజీ మంత్రి మూలపేట పోర్టు పూర్తైతే టెక్కలి ప్రాంతం ముంబై, విశాఖ తరహాలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసు అన్నారు. గతంలో భారీ భూసేకరణ సాధ్యం కాదని వాయిదా వేసిన ప్రాజెక్టును, వైయస్.జగన్ ఆచరణాత్మక ఆలోచనతో కేవలం 1800 ఎకరాలతో (రైతుల త్యాగం 362 ఎకరాలు, అటవీ భూమి 1100 ఎకరాలు) సాధ్యమని నిరూపించి పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తూ కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు కుంటుపడ్డాయని, కనీసం పనుల పరిశీలనకు కూడా అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. జగన్ పేరు చిరస్థాయిగా ఉంటుందనే కుళ్లు : పాముల పుష్పశ్రీవాణి దశాబ్దాలుగా టీడీపీ ఎన్నికల అజెండాగా మాత్రమే ఉన్న పోర్టును, వైయస్.జగన్ 2023 ఏప్రిల్ 19న శంకుస్థాపన చేసి, ఏడాదిలోనే 70 శాతం పనులు పూర్తి చేశారని మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి తెలిపారు. కానీ, కూటమి ప్రభుత్వం రెండేళ్లవుతున్నా మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేయలేని అసమర్థతతో ఉందన్నారు. పోర్టు పూర్తైతే జగన్ పేరు చరిత్రలో నిలిచిపోతుందనే కుళ్లుతోనే పనులను ఆపేశారని ఆరోపించారు. గతంలో టీడీపీ 5 వేల ఎకరాలు దోచుకోవాలని చూస్తే, జగన్ మాత్రం తక్కువ భూమితో, అత్యధిక పరిహారం ఇచ్చి ప్రాజెక్టు సకారంచేశారన్నారు. ఉత్తరాంధ్ర వలసల నివారణకు જગన్ బీజం వేస్తే, చంద్రబాబు వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారని విమర్శించారు. కాగితాల పోర్టును వాస్తవరూపంలోకి తెచ్చింది జగన్: పిరియా విజయ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్, శ్రీకాకుళం. చాలామంది నేతల్లా శంకుస్థాపన రాయి వేసి వదిలేయకుండా, రూ.4632 కోట్ల నిధులతో, నిర్వాసితులకు న్యాయం చేస్తూ పోర్టు పనులను వాస్తవరూపంలోకి తెచ్చిన ఏకైక నాయకుడు వైయస్.జగన్ అని జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ అన్నారు. సుదీర్ఘ తీరప్రాంతాన్ని వాడుకుని 11 పోర్టులు నిర్మిస్తే ఏపీ అభివృద్ధి చెందుతుందనే ముందుచూపు జగన్ ది అన్నారు. మాట మీద నిలబడని చంద్రబాబు: మత్స్యలింగం (ఎమ్మెల్యే, అరకు) 'చెప్పాడంటే చేస్తాడు' అనే క్రెడిట్ జగన్ కే దక్కుతుందని, మాట తప్పడం చంద్రబాబు నైజమని అరుకు ఎమ్మెల్యే మత్స్యలింగం అన్నారు. 70 శాతం పనులు పూర్తయాక వచ్చి, ఏమీ చేయకుండా కూర్చున్న కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్ధానికుల ఉద్యోగాలను కొల్లగొడుతున్న బాబాయి, అబ్బాయి: శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఇచ్చాపురం సమన్వయకర్త. వలసల జిల్లా శ్రీకాకుళంలో రూ.4360 కోట్లతో పోర్టు తెచ్చి, 25 వేల మందికి ఉపాధి, అందులో స్ధానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా జగన్ జీవో తెచ్చారని ఇచ్చాపురం సమన్వయకర్త శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. కానీ, కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా ఉన్న బాబాయి, అబ్బాయి క్రెడిట్ జగన్ కు వెళ్తుందనే కుట్రతో నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. జగన్ గెలిస్తేనే జిల్లా అభివృద్ధి: రెడ్డి శాంతి, మాజీ ఎమ్మేల్యే. కిడ్నీ ఆసుపత్రి, మంచినీరు, పోర్టు వంటి ప్రాజెక్టులతో జగన్ జిల్లాకు దిక్సూచిలా నిలిచారని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. కూటమి పాలనలో ఒక్క మంచి పనీ లేదని, మరలా జగన్ ను గెలిపించుకుంటేనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. జిల్లాకు ఒక్క ప్రాజెక్టు అయినా తెచ్చారా?: అచ్చన్నాయుడు, రామ్మోహన్ లపై మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఫైర్ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉంటూ జిల్లాకు ఏమీ చేయకుండా చంద్రబాబు భజన చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. వలస వెళ్లి ప్రపంచవ్యాప్తంగా ప్రమాదాల్లో చనిపోతున్న జిల్లా వాసుల కష్టాలను చూసి, పాదయాత్రలో జగన్ తయారుచేసిన బ్లూ ప్రింట్ ఫలితమే మూలపేట పోర్టు అన్నారు. చంద్రబాబు, అచ్చన్నాయుడు, రామ్మోహన్ నాయుడులకు ఛాలెంజ్ చేస్తున్నాను.. జిల్లాకు మీరు తెచ్చిన ఒక్క ప్రాజెక్టు అయినా చూపగలరా? అని సవాల్ చేశారు. వైయస్సార్, జగన్ హయాంలోనే జిల్లాకు వంశధార, రిమ్స్, పోర్టు, కిడ్నీ సెంటర్, మెడికల్ కాలేజీలు వచ్చాయన్నారు. "అచ్చన్నాయుడు గారూ, అసెంబ్లీలో జగన్ ను కాల్చేయాలంటున్నారు.. ఎవరిని కాల్చాలి? సంపదనంతా అమరావతిలో కేంద్రీకరిస్తున్న వారినా? లేక అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసిన జగన్ నా?" అని ప్రశ్నించారు. క్రెడిట్ చోరీ ఆపి, చేతనైతే పనిచేసి చూపమన్నారు. రెండేళ్లలో ఒక్క శాతం పనీ చేయలేదు: తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా మూలపేట పనులు ఎక్కడివక్కడే ఉన్నాయని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శించారు. జగన్ హయాంలో పునరావాసం, భూసేకరణ, అనుమతులన్నీ పూర్తి చేసి 70 శాతం పనులు చేస్తే, వీరు అడ్డగోలుగా తామే చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. బుడగట్ల పాలెం జట్టీ, భోగాపురం అన్నీ జగన్ చలువేనని, రానున్న రెండేళ్లలో పోర్టు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కమిషన్ల కోసమే పోర్టుకు అడ్డుంకులు: పేడాడ తిలక్, టెక్కలి సమన్వయకర్త. కూటమి పాలనలో అభివృద్ధి శూన్యమని, కేవలం వైయస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు, క్రెడిట్ చోరీ మాత్రమే జరుగుతోందని టెక్కలి సమన్వయకర్త పేడాడ తిలక్ అన్నారు. 71 శాతం పనులు పూర్తయ్యాయని నిర్మాణ సంస్థే చెబుతుంటే, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అబద్దాలు చెబుతున్నారన్నారు. 40 ఏళ్లుగా మీ కుటుంబం జిల్లాకు చేసిందేమీ లేదని, ఇప్పుడు కమిషన్ల కోసం పోర్టును అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 'చలో మూలపేట'ను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. బాబు 17 ఏళ్ల పాలనలో జిల్లాకు తెచ్చింది శూన్యం: చింతాడ రవికుమార్, అముదాలవలస సమన్వయకర్త. శ్రీకాకుళం అభివృద్ధికి కీలకమైన వంశధార, కిడ్నీ సెంటర్, మెడికల్ కాలేజీ, పోర్టు అన్నీ వైయస్సార్, జగన్ ల హయాంలో వచ్చినవేనని ఆముదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. 17 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రూ.43 కోట్ల ప్రాజెక్టు కూడా జిల్లాకు తీసుకురాలేదన్నారు. మీ మామూళ్ల కోసం పనులు సాగనివ్వరా..?: శాననమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ హెచ్చరిక. దీర్ఘకాలిక తీరప్రాంతాన్ని వాడుకుని అభివృద్ధి చేయాలనే దూరదృష్టితో జగన్ మూడు ప్రభుత్వ పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. రాజకీయంలో గెలుపోటములు సహజమైనా, అభివృద్ధి కొనసాగించాలన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కంటే జగన్ కు పేరు వస్తుందనే కుళ్లుతో పనులు ఆపేసిందని ఆరోపించారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం పోర్టులో రీల్స్ చేసుకుంటున్నారని, వాస్తవానికి అక్కడ భూసేకరణ, అనుమతులన్నీ వైయస్సార్సీపీ ప్రభుత్వమే చేసిందన్నారు. "రామ్మోహన్ నాయుడికి సమర్థత ఉంటే, తన శాఖ పరిధిలోని విశాఖ ఎయిర్ పోర్టు పనులను రెండేళ్లుగా ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు?" అని ప్రశ్నించారు. "ప్రజా ప్రయోజనాలు పక్కనబెట్టి, మీ మామూళ్ల కోసం పనులు సాగనివ్వరా? అచ్చన్నాయుడు గారూ, వ్యవసాయశాఖ మంత్రిగా ఈ ప్రాంత మొక్కజొన్న రైతులకు మద్ధతు ధర కల్పించారా?" అని నిలదీశారు. కూటమి ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే.. ఇవాళ మనం ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. మూలపేట పోర్టు ఈ పాటికే పూర్తయ్యే ఉండేది. ఈ ప్రాంతానికే చెందిన టీడీపీ నేత స్వర్గీయ ఎర్రన్నాయుడు గారితో ఆ రోజు టీడీపీ రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదని తీర్మానం చేయించారు. దానికి మంత్రి అచ్చన్నాయుడు ఏం సమాధానం చెప్తారు? రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారే మీరు ఇవాళ ప్రజాసంక్షేమం కోసం మాట్లాడ్డం సిగ్గుచేటు. అందుకే ఈ ప్రభుత్వాన్ని స్పష్టంగా హెచ్చరిస్తున్నాం. మా హాయంలో ప్రారంభించి 70 శాతం పనులు పూర్తి చేసిన మూలపేట పోర్టు నిర్మాణ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయకుండా మీ మామూళ్ల కోసం పనులు సాగనివ్వరా? వ్యవసాయశాఖ మంత్రిగా అచ్చన్నాయుడు ఈ ప్రాంత రైతులు పండించిన మొక్కజొన్నకు మద్ధతు ధర కల్పించారా? మీకు సిగ్గనిపించడం లేదా?. ఈ ప్రభుత్వానికి నూరేళ్లు నిండడానికి ఇంకో రెండేళ్ల కాలం ఉంది, ఇప్పటికైనా ఆ మిగిలిన పనులు పూర్తి చేసి న్యాయం చేయాలి. అలా కాకుండా ఎవరి పిల్లలకూ మీ పేరు పెట్టుకునే ప్రయత్నం చేయవద్దు. పోర్టు పనులను మేం పరిశీలిస్తామంటే ఎందుకు ఈ ప్రభుత్వం భయపడుతోంది? మీకున్న బెరుకు ఏంటి? బాధ్యత వ్యక్తులగా మేం వెళ్తామంటే మీ అభ్యంతరం ఏంటి? భయంతో ఎంతోకాలం మీరు పరిపాలన చేయలేరు చంద్రబాబూ? గుర్తుపెట్టుకొండి. ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకుంటే.. త్వరితగతిన మూలపేట పోర్టు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పోర్టు పనులను పరిశీలిస్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని, భయంతో ఎంతోకాలం పరిపాలన చేయలేరని చంద్రబాబును హెచ్చరించారు. త్వరితగతిన పోర్టు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి జపం తప్ప మిగిలిన ప్రాంతాలు పట్టవా? : మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. వైయస్సార్, వైయస్.జగన్ లు చెరో ఐదేళ్లే పాలించినా, జిల్లా వెనుకబాటుతనాన్ని పోగొట్టేందుకు అనేక ప్రాజెక్టులు తెచ్చారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. కానీ, టీడీపీ 25 ఏళ్లు అధికారంలో ఉన్నా చంద్రబాబు జిల్లాకు శాశ్వత ప్రాజెక్టు ఒక్కటైనా తెచ్చారా? అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లాకు ఏం చేశారో చూపగలరా? అని నిలదీశారు. మూలపేట పోర్టుకు అవసరమైన ఆర్థిక వనరులు, అనుమతులన్నీ జగన్ ప్రభుత్వమే ఏర్పాటు చేసిందని, వీరు రెండేళ్లలో నయాపైసా ఇవ్వలేదన్నారు. వీళ్లకు అనుకూల పత్రికల్లో వచ్చే హెడ్డింగ్స్ చూసి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. "ఏ రోజైతే జిల్లాలో టీడీపీని ప్రజలు తరిమి కొడతారో, ఆ రోజే వీరు భయపడి పనిచేస్తారు" అన్నారు. ప్రైవేటు వ్యక్తులు కడుతున్న భోగాపురం ప్రాజెక్టుకు రామ్మోహన్ నాయుడు టూరిస్టులా వెళ్లి తామే కడుతున్నామని అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. చంద్రబాబు రూ.3.50 లక్షల కోట్లు అప్పు తెచ్చి, అందులో రూ.1000 కోట్లైనా ఈ పేద జిల్లాకు పెట్టారా? అంతా అమరావతిలోనే పెడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ తరహా పొరపాటు మళ్లీ చేస్తున్నారన్నారు. వైయస్.జగన్ పోర్టులు, హార్భర్లతో వికేంద్రీకరణ అభివృద్ధికి రూపకల్పన చేశారన్నారు. "తీర్మానం చేస్తే రాజధాని నిలుస్తుందా? శ్రీకాకుళం, ఉద్దానం ప్రజల కష్టాలు మీకు పట్టవా?" అని ప్రశ్నించారు. ఇసుక, మట్టి, రాయి దోచుకుంటున్నారని, శాసనసభ్యులే దాడిచేస్తున్నారని మండిపడ్డారు. జగన్ నాడు-నేడు, ఇంగ్లీషు మీడియం, ట్యాబులు ఇస్తే, చంద్రబాబు వాటిని తీసేసి, ముగ్గురు పిల్లలను కనండి రూ.25వేలు ఇస్తామని చెబుతున్నారని, ప్రపంచం ఎటు వెళ్తుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అబద్దాలు ప్రచారం చేశారని, ఇప్పుడు ఆ చట్టం కేంద్రం తెచ్చింది కాదా? అని ప్రశ్నించారు. రైతులకు ఎరువులు, గిట్టుబాటు ధర ఇవ్వలేని చేతకాని ప్రభుత్వమిదని, పోర్టు పూర్తయ్యే వరకు పోరాటం కొనసాగిద్దామని ధర్మనా ప్రసాదరావు పిలుపునిచ్చారు.