తాడేపల్లి: ఈ నెల 27న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు వైయస్ఆర్‌సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి పిలుపునిచ్చారు. పంచాయతీ రాజ్ శాఖలో పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళనలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన 18.57 కోట్ల పనిదినాలకు రూ.1059 కోట్ల బకాయిలు డిసెంబర్ నుంచి చెల్లించకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా పంచాయతీ రాజ్ పనులు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులకు అవసరమైన నిధులు విడుదల చేయకపోవడంతో పరిస్థితి మరింత దిగజారిందని, చేసిన పనులకు కూలీలకు వేతనాలు అందకపోవడం బాధాకరమని అన్నారు. మండుటెండలో కనీస మౌళిక సదుపాయాలు కూడా లేకపోవడం ఆందోళనకరమని చెప్పారు. కూలీలకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని, MGNREGS Act ప్రకారం నీరు, నీడ, మెడికల్ సదుపాయాలు కల్పించాలని, ఉపాధి హామీ పనుల్లో అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసనలు తెలుపుతూ వినతిపత్రాలు అందజేస్తామని వెల్లడించారు.