జగన్ సీఎం అయిన తర్వాత దళితుల జీవితాల్లో మార్పు 

మాజీ మంత్రి మేరుగ నాగార్జున‌

పార్టీ కేంద్ర కార్యాల‌యంలో వైయ‌స్ఆర్‌సీపీ దళిత గళ సమ్మేళనం 

తాడేప‌ల్లి:   వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దళితుల జీవితాల్లో మార్పు వచ్చిందని మాజీ మంత్రి మేరుగ నాగార్జు తెలిపారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో రాష్ట్ర స్థాయి దళిత గళ సమ్మేళనం శనివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన‌ కార్యక్రమంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, తానేటి వనిత, సాకే శైలజానాథ్ తదితరులు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ..వైయ‌స్ఆర్‌సీపీ  దళిత గళ సమ్మేళనం ఒక మంచి ఆలోచన, దళితుల గళాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఈ రోజు చేస్తున్న ఈ సమ్మేళనం కార్యక్రమంపై మంచి స్పందన వస్తుంది. నాడు వైయ‌స్ రాజశేఖర్‌ రెడ్డి గారి పాలనలో మనం తలెత్తుకు తిరిగాం, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మనల్ని అణగదొక్కితే మళ్ళీ జగన్‌ గారు సీఎం అయిన తర్వాత డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్‌ గారి ఆశయాలకు అనుగుణంగా పరిపాలించి మన దళితుల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చారు. ప్రతి సంక్షేమ పథకాన్ని పేదవాడికి అందించి వారి ఇంట్లో సిరిసంపదలు తీసుకొచ్చారు, మళ్ళీ కూటమి ప్రభుత్వం రాగానే మన జీవితాలు చీకట్లోకి వెళ్ళాయి. రాజ్యాంగ వ్యవస్ధలు నడిపే ప్రభుత్వాలు మనల్ని అంటరానివారుగా చేస్తున్నారు. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఇద్దరూ దళితులను అవమానిస్తున్నారు, కించపరుస్తున్నారు. చంద్రబాబు దళిత వ్యతిరేకి, ఆయన పాలనలో దళితుల హక్కులు కాలరాస్తున్నారు. మన జెండా, అజెండా జగన్‌ గారిని మరోసారి సీఎం చేసుకోవాలి. వైయ‌స్ఆర్‌సీపీ దళిత విభాగం రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా వెంటనే స్పందించేలా సిద్దమవ్వాలి.

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. `వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి దళితులు, బలహీనవర్గాల సమస్యలపై పోరాడుతూనే ఉంది. విజయవాడ నడిబొడ్డున డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ గారి మహా విగ్రహాన్ని జగన్‌ గారు ఏర్పాటు చేస్తే చంద్రబాబు కనీసం ఈ రోజుకూ అక్కడికి వెళ్ళి ఆ మహనీయుడికి నివాళులర్పించలేదు. వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగంకు అనేక బాధ్యతలు ఉన్నాయి, మిగిలిన విభాగాల కంటే మీ విభాగం ద్వారా పార్టీ గళాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కూటమి పార్టీల రాక్షస సమూహం మన ముందు ఉంది, దానికి వంతపాడుతున్న ఎల్లో మీడియా ఉంది, మీరు ఆ పార్టీలను, ఎల్లో మీడియాను ధీటుగా ఎదుర్కోవాలి. వాస్తవాలు ప్రజల ముందుంచాలి. కూటమి ప్రభుత్వం అబద్దాలను తిప్పికొట్టేలా మీరు సిద్దంగా ఉండాలి. మీరు మరింత కష్టపడి పార్టీ లైన్‌ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మన నాయకుడు జగన్‌ గారి ఆశయాలు, ఆలోచనలను ముందుకు తీసుకెళ్ళాల్సిన గురుతర బాధ్యత మన అందరిపై ఉంది` అన్నారు. 

Back to Top