జొన్న మద్దతు ధర కోసం అంబటి మురళీకృష్ణ దీక్ష 

సంఘీభావం తెలిపిన వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు

గుంటూరు: గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు అంబటి మురళీకృష్ణ జొన్న, మొక్కజొన్న రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ పోరాట దీక్ష చేపట్టారు. పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దీక్షకు రైతులు, మహిళలు భారీగా తరలివచ్చి సంఘీభావం తెలిపారు. దీక్షా శిబిరానికి మాజీ మంత్రి మెరుగు నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పోతిన మహేష్, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా తదితరులు హాజరై మద్దతు తెలిపారు. అలాగే వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్ బాబు కూడా అంబటి మురళితో కలిసి దీక్షలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత పాలనలో రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మార్క్‌ఫెడ్ ద్వారా పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. మాజీ మంత్రి మెరుగు నాగార్జున మాట్లాడుతూ రైతుల ఉత్పత్తులు దళారుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని, మొక్కజొన్నకు ప్రకటించిన మద్దతు ధర రూ.2,400 ఉన్నప్పటికీ కొనుగోలు జరగడం లేదని విమర్శించారు. పోతిన మహేష్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు నష్టపోతున్నారని, దళారుల వ్యవస్థ పెరిగిపోయిందని ఆరోపించారు. గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా మాట్లాడుతూ రైతుల కన్నీళ్లతోనే ప్రభుత్వం నడుస్తోందని తీవ్రంగా విమర్శించారు.

వరికూటి అశోక్ బాబు మాట్లాడుతూ, వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హయాంలో రైతులకు పంట బీమా, ఇన్‌పుట్ సబ్సిడీలు అందించి ఆదుకున్నారని, కానీ చంద్ర‌బాబు ప్రభుత్వం మాత్రం గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని అన్నారు. ప్రస్తుతం మొక్కజొన్నకు మద్దతు ధర ఉన్నప్పటికీ దళారులు తక్కువ ధరలకు కొనుగోలు చేస్తుండటంతో రైతులు క్వింటాల్‌కు రూ.600–700 వరకు నష్టపోతున్నారని పేర్కొన్నారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మద్దతు ధర అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష కొనసాగుతోంది.
 

Back to Top