క్రెడిట్ చోరీకి చంద్ర‌బాబు బ్రాండ్ అంబాసిడ‌ర్‌

తండ్రి బాట‌లోనే నారా లోకేష్ ప‌చ్చి అబ‌ద్ధాలు

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి కారుమూరి వెంక‌ట‌రెడ్డి ఫైర్‌

తాడేప‌ల్లి లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మ‌ట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి కారుమూరి వెంక‌ట‌రెడ్డి

వైయ‌స్ జ‌గ‌న్ గారు తెచ్చిన కంపెనీలు వారి ఘ‌న‌త‌గా ప్ర‌చారం  

ప‌థ‌కాల‌కు పేర్లు మార్చ‌డం త‌ప్ప రెండేళ్ల‌లో చేసిందేమీ లేదు

గొప్ప‌గా పేరొచ్చిన ప‌థ‌కాల‌కు పేర్లు మార్చి నిర్వీర్యం చేశారు

మెడిక‌ల్ కాలేజీలు, పోర్టుల‌ను ప‌క్క‌న పెట్టి ప్రైవేటు జ‌పం చేస్తున్నారు 

వారం వారం అప్పులు త‌ప్ప‌, అభివృద్ధి, సంక్షేమం జాడే లేదు

స్ప‌ష్టం చేసిన కారుమూరి వెంక‌ట‌రెడ్డి 

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో వైయ‌స్ జ‌గ‌న్ గారి కృషితో రాష్ట్రంలో ఏర్పాటైన కంపెనీల‌ను తమ ఘ‌న‌త‌గా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్ప‌డ‌టంలో నారా లోకేష్ తండ్రినే మించిపోయాడ‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి కారుమూరి వెంక‌ట‌రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో గొప్ప‌గా పేరు తెచ్చుకున్న‌ ప‌థ‌కాల‌కు పేర్లు మార్చి పూర్తిగా నిర్వీర్యం చేశార‌ని మండిప‌డ్డారు. దీంతోపాటు అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే మెడిక‌ల్ కాలేజీలు, పోర్టుల నిర్మాణ పనుల‌ను ప‌క్క‌న పెట్టేసి పీపీపీ మోడ‌ల్‌లో బినామీల‌కు ధారాద‌త్తం చేసే కార్య‌క్ర‌మం జ‌రుగుతోంద‌ని వివ‌రించారు. వారం వారం అప్పులు చేసి దోచుకోవ‌డం త‌ప్ప తండ్రీకొడుకులు చేసిన మంచిప‌ని ఒక్క‌టీ లేద‌ని ఎద్దేవా చేశారు. రెండో విడ‌త భూస‌మీక‌ర‌ణకు రైతుల‌ నుంచి ప్ర‌తిఘ‌ట‌న ఎదురుకావ‌డంతో అసెంబ్లీలో రాజ‌ధాని బిల్లు ప్ర‌వేశ‌పెట్టి మ‌భ్య‌పెట్టాల‌ని చూస్తున్నార‌ని కారుమూరి వెంక‌ట‌రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. 
ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...

- అప్పులు త‌ప్ప‌, అభివృద్ధీ సంక్షేమం జాడే లేదు

ప్ర‌తి మంగ‌ళ‌వారం అప్పులు చేయ‌డం త‌ప్ప‌, చంద్ర‌బాబు అభివృద్ధి సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. కార్య‌క్ర‌మం ఏదైనా, వేదిక ఎక్క‌డైనా వైయ‌స్ జ‌గ‌న్ గారిని తిట్ట‌డ‌మే కూట‌మి నాయకుల ఎజెండా. ప్ర‌జ‌ల్లో అనుమానాలు, అభూత క‌ల్ప‌న‌లు రేకెత్తించ‌డ‌మే ల‌క్ష్యంగా వైయ‌స్ జ‌గ‌న్ గారి గురించి త‌ప్పుడు ప్రచారం చేసి ఆయ‌న వ్య‌క్తిత్వాన్ని హ‌న‌నం చేయ‌డమే కూట‌మి నాయ‌కుల ప‌ని. ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డానికి కొత్త కొత్త ఎత్తుగ‌డ‌లు వేయ‌డం త‌ప్ప‌, చంద్ర‌బాబు వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఒరిగింది శూన్యం. రెండేళ్ల కూట‌మి పాల‌న‌లో జ‌రుగుతున్న‌ది మూడే కార్య‌క్ర‌మాలు. ఒక‌టి వైయ‌స్ జ‌గ‌న్ గారి పాల‌న‌లో చేసిన ప‌నుల‌కు క్రెడిట్ చోరీ చేయ‌డం. రెండోది ఆయ‌న తీసుకొచ్చిన సంక్షేమ ప‌థకాల‌కు పేర్లు మార్చి నిర్వీర్యం చేయ‌డం. మూడోది మెడిక‌ల్ కాలేజీలు, పోర్టులు వంటి వాటిని ప‌క్క‌న‌పెట్టేసి ఎక్క‌డి ప‌నులు అక్క‌డే ఆపేయ‌డం. లేదా పీపీపీ మోడ‌ల్ లో బినామీల‌కు రాసిచ్చేయ‌డం. జాబ్‌లే లేకుండా జాబ్ క్యాలెండ‌ర్ ఇచ్చిన దిక్కుమాలిన ప్ర‌భుత్వమిది. 

- భూస‌మీక‌ర‌ణ కోస‌మే రాజ‌ధాని తీర్మాణం

రెండో విడ‌త‌లో భూస‌మీక‌ర‌ణ కింద 50 గ్రామాల్లో 1.75 ల‌క్ష‌ల ఎక‌రాలు సేక‌రించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. కానీ రాజ‌ధానికి చ‌ట్ట‌బ‌ద్ద‌త విష‌యంలో రైతుల నుంచి వ్య‌తిరేక‌త రావ‌డంతో వారిని మ‌భ్య‌పెట్ట‌డం కోస‌మే అసెంబ్లీలో అమ‌రావ‌తి రాజ‌ధాని తీర్మాణం పేరిట చంద్ర‌బాబు సరికొత్త డ్రామాకు తెర‌లేపాడు. అందులో భాగంగా 7 గ్రామాల్లో ప్ర‌భుత్వ భూమి 4 వేల ఎక‌రాలు, రైతుల నుంచి మ‌రో 16 వేల ఎక‌రాలకు నోటిఫికేష‌న్ ఇచ్చారు. రెండో విడ‌త భూసమీక‌ర‌ణ చేస్తాన‌ని 2024 ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు ఎందుకు చెప్ప‌లేదు?  అవికాకుండా మ‌రో 43 వేల ఎక‌రాలు తీసుకోబోతున్నారు. ఎన్టీఆర్ నుంచి నారా చంద్ర‌బాబు తెలుగుదేశం పార్టీని, పార్టీ అకౌంట్లు, పార్టీ గుర్తుల‌ను లాక్కున్న విష‌యాన్ని మ‌రిచిపోయి, ఆవిర్భావ దినోత్స‌వం రోజున నారా లోకేష్ క్రెడిట్ చోరీ గురించి మాట్లాడ‌టం హాస్యాస్ప‌దంగా ఉంది. ఎన్టీఆర్ యుగ‌పురుషుడు అని కీర్తించే చంద్ర‌బాబు ఆయ‌నకి భార‌త‌ర‌త్న ఎందుకు సాధించ‌లేక‌ పోయారని అడిగితే బాగుంటుంది. వ‌ర్ధంతి, జ‌యంతి కార్య‌క్ర‌మాల్లో మాత్ర‌మే ప్ర‌స్తావించి ఎందుకు వ‌దిలేస్తున్న‌ట్టు? 

- వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలోనే ఈ కంపెనీల ఏర్పాటు

వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలోనే అదానీ డేటా సెంట‌ర్ ఏర్పాటైతే దానికి పేరు మార్చి గూగుల్ సెంట‌ర్ పేరుతో పెద్ద పెద్ద ప్ర‌క‌ట‌న‌లిచ్చి క్రెడిట్ చోరీకి పాల్ప‌డ్ఢారు. భోగాపురం ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్ కోసం భూములు సేక‌రించ‌డంతోపాటు రైతులకు ప‌రిహారం చెల్లించి, నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ లో ఉన్న అన్ని కేసులను వైయ‌స్ జ‌గ‌న్ గారే క్లియ‌ర్ చేశారు. అంతేకాకుండా దానికి శంకుస్థాప‌న చేసి దాదాపు 80 శాతం ప‌నుల‌ను వైయ‌స్ఆర్‌సీపీహ‌యాంలోనే పూర్తి చేస్తే దానిని కూడా మేమే క‌ట్టామ‌ని చెప్పుకుంటున్నారు. చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితంలో ఒక్క పోర్టు నిర్మించిన పాపాన పోలేదు. వైయ‌స్ జ‌గ‌న్ గారు నిర్మించిన పోర్టుల‌ను త‌న ఘ‌న‌త‌గా చెప్పుకొంటున్నాడు. వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో గ్రీన్ ఎన‌ర్జీ ప్రాజెక్టులు వ‌స్తుంటే ప‌ర్యావ‌ర‌ణానికి ముప్పు వాటిల్లుతుంద‌ని దుష్ర‌చారం చేసి ఇప్పుడు అదే గ్రీన్ కో ప్రాజెక్టు త‌న ఘ‌న‌త‌గా చంద్ర‌బాబు ప్ర‌చారం చేసుకుంటున్నాడు. రెన్యూ ఎన‌ర్జీ, ఎన్‌టీపీసీ, ఏటీసీ టైర్స్‌.. వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో వ‌చ్చిన‌వే. కాకినాడ సెజ్ భూములు 2180 ఎక‌రాలు వైయ‌స్ జ‌గ‌న్ గారు రైతుల‌కు తిరిగిచ్చేస్తే దాన్ని కూడా చంద్ర‌బాబు త‌న ఖాతాలో వేసుకున్నాడు. డీఆర్‌డీవో తో క‌లిసి బెల్ ఏర్పాటుకు వైయ‌స్ జ‌గ‌న్ గారు ప్ర‌తిపాద‌న చేశారు. ఈ ప్రాజెక్టు ఇంగా రాకుండానే క్రెడిట్ చోరీ మొద‌లుపెట్టారు. అశోక్ లేల్యాండ్ మేం పంపిస్తే వాళ్లు తీసుకొచ్చిన‌ట్టు క్రెడిట్ చోరీ. బ‌ల్క్ డ్ర‌గ్ పార్కు కోసం 16 రాష్ట్రాలు ప్ర‌య‌త్నిస్తే వైయ‌స్ జ‌గ‌న్ గారు ఏపీకి సాధించుకొచ్చారు. దాన్ని కూడా మీ ఘ‌న‌త‌గా చెప్పుకుంటున్న‌రు. ద‌శాబ్దాల క‌లగా ఉన్న మూలపేట పోర్టు నిర్మాణం వైయ‌స్ జ‌గ‌న్ గారి ఘ‌న‌తే. రూర‌ల్ డెవ‌లప్‌మెంట్ ట్ర‌స్టు నిధుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఎఫ్‌సీఆర్ఏ రెన్యువ‌ల్ ఆపేస్తే వైయ‌స్ఆర్‌సీపీ ఏడాదిపాటు పోరాడి సాధించింది. దాన్ని కూడా లోకేష్ ఘ‌న‌త‌గానే చెప్పుకుంటున్నారు. కొప్ప‌ర్తి, ఓర్వ‌క‌ల్లు పారిశ్రామికవాడ‌లు వైయస్ జ‌గన్ ఘ‌న‌తే. క‌ర్నూలు ఎయిర్‌పోర్టుకి ఉయ్యాలవాడ న‌రసింహారెడ్డి పేరు వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో పెడితే మేమే పెట్టామ‌ని చెప్పుకున్నారు. పంచాయ‌తీరాజ్ శాఖ‌లో డీడీఓ పోస్టుల‌ను వైయ‌స్ జ‌గ‌న్ గారు క్రియేట్ చేస్తే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఘ‌న‌త‌గా ప్ర‌చారం చేసుకున్నారు. వైయస్ జ‌గన్ గారు 2022లో దావోస్ వెళ్లిన‌ప్పుడు ఆదిత్య మిట్ట‌ల్‌ను క‌లిసి గ్రీన్ ఎన‌ర్జీలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని ప్ర‌తిపాదించారు. దాంతోపాటు రాష్ట్రంలో మ‌రో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయాల‌ని, అందుకు కాకినాడ సెజ్‌లో, న‌క్క‌ప‌ల్లి, మూల‌పేట వంటి మూడు ప్రాంతాల్లో భూములు చూపించగా వారు న‌క్క‌ప‌ల్లిలో ఆర్సెల్లార్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు అంగీక‌రించారు. కానీ టీడీపీ మాత్రం నారా లోకేష్ ఒక్క జూమ్ కాల్ తో స్టీల్‌ప్లాంట్ సాధించుకొచ్చాడ‌ని ప్రచారం చేసుకోవ‌డం సిగ్గుచేటు. 

- ప‌థ‌కాల‌కు పేర్లు మార్చి నిర్వీర్యం చేశారు 

చంద్ర‌బాబు, నారా లోకేష్‌ ల‌ను చూస్తే వెన్నుపోటు, మోసం త‌ప్ప ఏ ఒక్క ప‌థ‌కం గుర్తుకురాదు. అలాంటిది వైయస్ జ‌గ‌న్ గారు వినూత్నంగా ఆలోచించి తీసుకొచ్చిన రైతు భ‌రోసా, అమ్మ ఒడి ప‌థ‌కాల‌కు అన్న‌దాత సుఖీభ‌వ‌, త‌ల్లికి వంద‌నం అని పేరు మార్చి క్రెడిట్ చోరీకి పాల్ప‌డుతున్నారు. అలాగే వైయ‌స్ జ‌గ‌న్ గారు రైతుల కోసం తీసుకొచ్చిన ఆర్బీకే సెంట‌ర్ల‌కు రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చ‌డం మిన‌హా చేసిందేమీ లేదు. జ‌గ‌న‌న్న కాల‌నీల‌కు ఎన్టీఆర్ న‌గ‌ర్‌లుగా పేరు మార్చేసి ఇళ్ల నిర్మాణం ఆపేశారు. గోరుముద్ద ప‌థ‌కానికి డొక్కా సీత‌మ్మ పేరు పెట్టి ఉడికీ ఉడ‌క‌ని మ‌ధ్యాహ్న భోజ‌నం పెట్టి విద్యార్థుల‌ను ఆస్ప‌త్రులపాలు చేస్తున్నారు. విద్యాకానుక‌కి విద్యామిత్ర‌, నాడు-నేడు ప‌థ‌కానికి మ‌న బ‌డి మ‌న భ‌విష్యత్తు,మ‌త్స్య‌కార భ‌రోసాకి మత్స్య‌కార సేవ‌లో అని మార్చేశారు. వాహ‌న మిత్ర‌ను ఆటో డ్రైవ‌ర్ సేవ‌లో అని మార్చేసి తూతూమ‌త్రంగా అమ‌లు చేశారు. వైయ‌స్ జ‌గ‌న్ గారు అద్బుతంగా అమ‌లు చేసి చూపించిన దిశ యాప్ కి శ‌క్తి యాప్ గా మార్చేసి నిర్వీర్యం చేశారు. గ్రామ వార్డు స‌చివాల‌యాల‌కు స్వ‌ర్ణ వార్డులు, స్వ‌ర్ణ స‌చివాల‌యాలుగా మార్చేసి అందులో ప‌నిచేసే ఉద్యోగుల‌ను ఆత్మ‌హ‌త్య‌ల‌కు ప్రేరేపిస్తున్నారు. ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కానికి ఎన్టీఆర్ వైద్య‌సేవ‌గా మార్చేశారు. వీళ్లే క్రెడిట్ చోరీ చేసి కేక‌లేస్తున్నారు. జాబ్ క్యాలెండ‌ర్ ఇవ్వ‌క‌పోయినా ప్ర‌తినెలా క్రెడిట్ చోరీ క్యాలెండ‌ర్ రిలీజ్ చేస్తున్నారని కారుమూరి వెంక‌ట‌రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.

Back to Top