అనపర్తి: దేవాలయాల పట్ల అవమానకరంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ అనపర్తి నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కుతుకులూరు గ్రామంలోని శివాలయం సమీపంలో ఉన్న పవిత్ర స్థలంలో పబ్లిక్ లెట్రిన్ నుంచి తీసిన మట్టిని నింపడం అత్యంత దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుని కల్యాణాలు జరిగే ప్రదేశాన్ని అపవిత్రం చేయడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతోనే ఆ మట్టిని తొలగించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తిరుపతి లడ్డూ అంశాన్ని ప్రస్తావిస్తూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను గుర్తు చేశారు. అబద్ధాలు చెప్పడంలోనూ, అపవిత్ర చర్యల్లోనూ ఎమ్మెల్యే తన నాయకుడి బాటలోనే నడుస్తున్నారని విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యేగా చెప్పుకుంటున్నప్పటికీ, ఆయన చర్యలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని, “డూప్లికేట్ బీజేపీ ఎమ్మెల్యే”గా వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో కొత్తూరు గ్రామంలో విగ్రహ ప్రతిష్టను అడ్డుకోవడం, అనపర్తి విష్ణాలయం వద్ద కంచె వేయడం, రామవరం ఆంజనేయస్వామి గుడి ప్రాకారాన్ని కూల్చడం వంటి ఘటనలను ఆయన గుర్తు చేశారు. అలాగే కుతుకులూరు ఆంజనేయస్వామి గుడికి చెందిన రూ.75 లక్షల నిధులను వడ్డీ లేకుండా తన వద్ద ఉంచుకోవడం దైవభక్తి లేమికి నిదర్శనమని విమర్శించారు. ఎమ్మెల్యే చర్యలు హిందూ సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నాయని, దేవాలయ ఆస్తులపై కన్నేసి పవిత్ర స్థలాలను అపవిత్రం చేయడం ప్రజాస్వామ్యానికి, మత భావాలకు విరుద్ధమని సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి చర్యలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని హెచ్చరించారు.