న్యూఢిల్లీ: అమలాపురం కనెక్టివిటీ సమస్యలను పరిష్కరించేందుకు పిఎం గతి శక్తి యోజన కింద కోటిపల్లి వద్ద గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మించాలని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కోరారు. ఢిల్లీ వేదికగా అమలాపురం పార్లమెంట్ పరిధిలోని కనెక్టివిటీ సమస్యలను రాజ్యసభలో ప్రస్తావించారు వైయస్ఆర్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. జీరో అవర్ సందర్భంగా మాట్లాడిన ఆయన, జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకువచ్చారు. జిల్లాల విభజనతో అమలాపురం పార్లమెంట్ పరిధిలో పరిపాలనా విభజన పెరిగి, ప్రజలకు సేవలు అందుకోవడం కష్టంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, వాటిలో అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు, కొత్తపేట నియోజకవర్గాలు గోదావరి నది కుడి ఒడ్డున ఉన్నాయని తెలిపారు. రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాలు ఎడమ ఒడ్డున ఉండటంతో ప్రజలకు రాకపోకలు క్లిష్టంగా మారాయని వివరించారు. మండపేట ఈస్ట్ గోదావరి జిల్లాలో కలిసిపోవడం, రామచంద్రపురం డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొనసాగడం వల్ల పరిపాలనలో విభజన మరింత పెరిగిందని ఆయన చెప్పారు. ముఖ్యంగా జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో ఉండటంతో, కోనసీమ ప్రాంత ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు చేరుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కోటిపల్లి వద్ద గోదావరి నదిపై వంతెన నిర్మాణం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) ఇప్పటికే సిద్ధమైందని, కేంద్ర ప్రభుత్వం PM Gati Shakti Yojana కింద వెంటనే పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. వంతెన నిర్మాణం పూర్తైతే రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రజలకు సులభతరం అవుతాయని, ప్రాంతీయ అభివృద్ధికి కూడా ఊతం లభిస్తుందని పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.