విశాఖపట్నం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా, ప్రజల ప్రాథమిక సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. శనివారం విశాఖలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేవలం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు.. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే అమరావతి చట్టం పేరుతో ప్రజలను మభ్యపెడుతూ కూటమి ప్రభుత్వం భారీ దోపిడీకి తెరలేపిందని మండిపడ్డారు. అమరావతి రాజధానికి వైయస్సార్సీపీ వ్యతిరేకం కాదని.. ఆ పేరుతో జరుగుతున్న దోపిడికే తాము వ్యతిరేకమని బొత్స మరోసారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం - శాంతిభద్రతల క్షీణత రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయి. అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యమయ్యాయి. చివరకి రైతులకు మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర లేక, ప్రభుత్వం కూడా కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ అందక విద్యార్థులు, ఉపాధి హామీ పనులు లేక గ్రామాల్లో పేదలు అల్లాడుతుంటే.. ప్రభుత్వం మాత్రం కేవలం అమరావతి జపం చేస్తూ కాలక్షేపం చేస్తోంది. ఆరోగ్యశ్రీని అటకెక్కించి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. 8 వాయిదాలు బకాయిలు ఉంటే 2 వాయిదాలు ఫీజు రీయింబర్స్ మెంట్ కి బీఆర్ (బడ్జెట్ రిలీజ్ )మాత్రమే ఇచ్చారు. ఇంకా ఆ చెల్లింపులు కూడా పూర్తిగా చేయలేదు. ప్రత్యేక హోదాపై మౌనమెందుకు? అమరావతిపై చట్టం చేశామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు, విభజన హామీ అయిన ప్రత్యేక హోదాపై ఎందుకు తీర్మానం చేయలేదు. "ప్రత్యేక హోదా వస్తే ఇలాంటి అమరావతిలు పది వస్తాయి.. విశాఖ, ముంబై వంటి నగరాలు అభివృద్ధి చెందుతాయి". హోదా ముగిసిన అధ్యాయమని చెప్పడం బాధ్యతారాహిత్యం. ఈ నెల 15-16 తేదీల్లో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అమరావతితో పాటు ప్రత్యేక హోదా బిల్లును కూడా ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలి. నిర్మాణ వ్యయంలో అవినీతి- స్క్వేర్ ఫీట్ రూ.14వేలా? అమరావతి నిర్మాణాల్లో భారీ దోపిడీ జరుగుతోంది. సాధారణంగా చదరపు అడుగుకు రూ. 4-5 వేలు ఖర్చయ్యే చోట, రూ. 14 వేలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు. గత ఐదేళ్లలో చంద్రబాబు కేవలం 5 శాతం పనులే చేశారు, ఇప్పుడు కూడా రెండేళ్లు పూర్తయినా ఎమ్మెల్యే క్వార్టర్లు, మంత్రులు, నివాసన సముదాయాలు, న్యాయమూర్తులు నివాసాలు, చివరకి కరకట్ట రోడ్డు కూడా పూర్తి చేయలేకపోయారు. అమరావతి ఎప్పటికి పూర్తవుతుందనే దానికి ప్రభుత్వానికి కనీసం 'టైమ్ బాండ్' కూడా లేదు. వైయస్.జగన్ ‘మావిగన్’ ప్రతిపాదన - రైతుల సంక్షేమం వైయస్ జగన్, వైయస్సార్సీపీ అమరావతికి వ్యతిరేకం కాదు, మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు (మావిగన్) ప్రాంతం కలిపి రాజధానిగా అభివృద్ధి చెందాలనేది ఆయన ఆకాంక్ష. మీడియా కేవలం రాజధాని అంశాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ రైతుల, విద్యార్ధులతో సహా ప్రజల సమస్యలను విస్మరించడం దురదృష్టకరం. గత వైయస్సార్సీపీ ప్రభుత్వంలో అమరావతి రైతులకు కౌలు డబ్బులు ఒక్క రోజు కూడా ఆపలేదు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులకు చేసిన అదనపు మేలేంటో సమాధానం చెప్పాలి. మండలిలో చర్చకు ఎందుకు భయం ? అమరావతిపై అసెంబ్లీలో తీర్మానం చేసిన కూటమి ప్రభుత్వం, శాసనమండలిలో ఎందుకు ప్రవేశపెట్టలేదు.మండలిలో నిలదీస్తామనే భయంతోనే ప్రభుత్వం ఈ చీఫ్ ట్రిక్స్‌కు పాల్పడింది. రాజధాని పేరుతో ఎంత ఖర్చు చేశారు? కాంట్రాక్టర్లకు ఎంత అడ్వాన్స్ ఇచ్చారు? ఎంత పని జరిగింది? అన్న అంశాలపై లెక్కలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. అమరావతి అంశం - డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే.. అమరావతిలో ఎల్ అండ్ టీ వైర్లు కాలిపోయిన ఘటనపై విచారణ ఎందుకు చేయలేదు? దీని వెనుక ఉన్న కుంభకోణం ఏంటి? ఎందుకు వివరాలు బహిర్గతం కావడం లేదు. మరోవైపు ఇటీవల అనకాపల్లి జిల్లా పాయకరావుపేట స్టీల్ ప్లాంట్ పనులకు శంకుస్థాపన చేశారు. కానీ భూ నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ గురించి మాత్రం నోరు మెదపడం లేదు. గతంలో 2014-19 మధ్యలో కూడా చంద్రబాబు హయాంలో భోగాపురం విమానాశ్రయానికి భూసేకరణ చేయలేకపోతే, వైయస్.జగన్ వచ్చాకే పనులు వేగవంతమయ్యాయి. మరోవైపు గ్రామాల్లో ఉపాధి పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఒక వారం పనులు జరిగితే ఒక వారం నిలిచిపోతున్న పరిస్థితి. కానీ ప్రభుత్వ అనుకూల పత్రికల్లో మాత్రం ఉపాధి హామీ పనులు అద్భుతంగా జరుగుతున్నాయనే తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే... రాజధానిలో నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి. అమరావతి కోసం అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి... శాసనమండలిలో ఎందుకు ప్రవేశపెట్టలేదు. రాజధాని పేరుతో జరుగుతున్న దోపిడీమీదా, ఎప్పటిలోగా అమరావతి పనులు పూర్తిచేస్తారని ప్రశ్నిస్తామన్న భయంతోనే శాసనమండలి సమావేశం ఏర్పాటు చేయకుండా... కేవలం శాసనసభతోనే ముగించారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకోవాలి. ప్రజలకు మేలు జరిగేలా పాలన ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సింది అమరావతి రాజధాని చట్టం కాదు.. అమరావతి రాజధాని నిర్మాణం కావాలి. అప్పుడు దాని గురించి ఎవరూ మాట్లాడరు. అలా కాకుండా ఇవాళ చట్టం చేసి, కోట్లాది రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ.. పనులు పూర్తి చేయకుండా ఉంటే ఎవరైనా ఏం చేస్తారు? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ " అమరావతికి వ్యతిరేకం కాదు.. కానీ అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీకి మాత్రమే వ్యతిరేకం" అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రజలకు కావాల్సింది రాజధాని చట్టం కాదు, నిర్మాణం అని.. ఇప్పటికైనా ప్రభుత్వం మాటలు కట్టిపెట్టి పనులు చేసి చూపించాలని డిమాండ్ చేశారు. అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ.. ఐదేళ్లలో కేవలం రూ.5వేల కోట్లు మాత్రమే ఖర్చుపెట్టడం ద్వారా చంద్రబాబే అమరావతిని భ్రష్టు పట్టించాడు. 2014-19 తరహాలోనే అమరావతి పేరుతో గతంలో వలే ఇప్పుడు కూడా చంద్రబాబు దోపిడీకి పాల్పడుతూ ... పనులు చేయకుండా ఉంటే తప్పకుండా రాజధాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. మేం ఏనాడూ అమరావతికి వ్యతిరేకం కాదు.. కానీ అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీకి మాత్రమే మా పార్టీ వ్యతిరేకం అని చాలాసార్లు స్పష్టం చేశాం. పార్లమెంటులో మేం అమరావతికి వ్యతిరేకంగా వాకౌట్ చేయలేదు.. ఆ పేరుతో భారీ దోపిడీ చేస్తున్నారని ఆ అవినీతిని నిరసిస్తూ.. వాకౌట్ చేశాం. అమరావతి రైతుల పేరుతో ప్రభుత్వం భారీ దోపిడీకి సన్నద్ధమవుతోంది. అమరావతి రాజధాని పనులు వేగవంతం చేసి, పనులు పూర్తి చేయాలనే మేం చెబుతున్నాం. అది చేయకుండా అమరావతి పేరుతో చట్టం చేశాం.. ఇంచు కూడా అమరావతిని మార్చలేరు అన్న కూటమి నేతల వ్యాఖ్యలు రైతులను మభ్యపెట్టడానికే తప్ప మరొకటి కాదు. పెద్దలసభలో సంస్కారం మరిచి మాట్లాడిన వారి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆ స్థాయికి దిగజారి మాట్లాడలేమన్నారు.