తాడేపల్లి: వారు కరడుగట్టిన తీవ్రవాదులు కారు.. కాకలు తీరిన కిరాతకులు అంతకన్నా కాదు.. వారంతా విద్యార్థులు! ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసి తమ చదువుకు పట్టిన గ్రహణం తొలగించాలని కోరుతూ శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. అయినా పోలీసులు వారిపై విరుచుకుపడ్డారు. పై నుంచి ఎవరో ఆదేశాలు జారీ చేసినట్లు ఒక్కసారిగా లాఠీలు ఝులిపించారు. ఖాకీ క్రౌర్యాన్ని విద్యార్థులకు రుచి చూపించారు. బూటు కాళ్ళతో కొట్టుకుంటూ.. రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి బలవంతంగా పోలీసు వ్యానులో కుక్కేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో సోమవారం తాడేపల్లిలోని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నప్పటికీ.. దాన్ని ఎలాగైనా భగ్నం చేయాలన్న పట్టుదలతో పోలీసులు విద్యార్థులపై జులుం చేశారు. దొరికినోళ్ళను దొరికినట్లు చావబాదుతూ దొంగల మాదిరి పోలీసు వ్యానులో ఎక్కించి పలు స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేయించుకుంటూ చివరికి దుగ్గిరాల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు అబద్ధాలు వినీ వినీ మన రాష్ట్రంలో, "నారా వారి మాటలు - నీటి మీద మూటలు" అనే కొత్త సామెత పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేశారు. అంతే కాక "అబద్ధం చెబితే అతికినట్లు ఉండాలి" అనే సామెత స్థానంలో "అబద్ధం చెబితే చంద్రబాబులా గోడ కట్టినట్లుండాలి" అని మార్చుకోవాల్సిన దుస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు. ఎన్నికలప్పుడు జగన్ గారి పథకాలు ఏవీ ఆపనని.. ఇంకా ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు చేస్తానని.. అందులో భాగంగానే విద్యార్థులకు క్రమం తప్పకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేస్తానని చంద్రబాబు నమ్మబలికిన విషయాన్ని ఈ సందర్భంగా పానుగంటి చైతన్య గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సంక్షేమ పథకాల మాదిరిగానే ఫీజు రీయింబర్స్‌మెంట్ పధకాన్ని కూడా అటకెక్కించారని ఆరోపించారు. దీంతో ఆయన మాటలు నిజమని నమ్మిన నేరానికి, "కర్ర ఇచ్చి మరీ కొట్టిచ్చుకున్నట్లైంది" రాష్ట్రంలోని విద్యార్ధి, యువజనుల దుస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. "ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా" అన్నట్టు చంద్రబాబు అందరి చెవిలో పూలు పెడితే.. ఆయన తనయుడు లోకేష్ ఏకంగా క్యాలీఫ్లవర్లే పెడుతున్నారని పానుగంటి చైతన్య విమర్శించారు. పాపం... విదేశాల్లో విద్యను అభ్యసించి వచ్చిన లోకేష్ సారధ్యంలో విద్యాశాఖ మరింత మెరుగవుతుందని ఆశించిన విద్యార్థులకు పూర్తి నిరాశే ఎదురైందని నిందించారు. ఆయన నేతృత్వంలో విద్యాశాఖ పూర్తిగా నిర్వీర్యమై, విద్యార్థుల బంగారు భవిష్యత్తు అంధకారమయమై పోయిందని ఆరోపించారు. ఉట్టి కొట్టలేనోడు ఆకాశానికి ఎగిరిన చందాన ప్రజలకు అత్యవసరమైన విద్యా, వైద్యం సక్రమంగా అందించడం చేతకాదు కానీ.. అమరావతిని అమెరికా చేస్తాం.. తిరుపతిని వాషింగ్టన్ చేస్తాం.. వైజాగ్‌ను ఇస్తాంబుల్ చేస్తాం.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ ఉంటారని పానుగంటి చైతన్య విమర్శించారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిన చంద్రబాబు సర్కారు, ఉన్నత విద్యను కూడా ఉసూరుమనిపించందని చెప్పడానికి ఈ 18నెలల కూటమి పాలనా సమయమే ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. ఓవైపు అప్పులు చేసి ఫీజులు కట్టలేక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నానా తంటాలు పడుతుంటే.. మరోవైపు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులేమో జీతాలు లేక అన్నమో రామచంద్రా అంటూ అల్లాడిపోతున్నారని తెలిపారు. తమ ఫీజు కోసం విద్యార్థులు స్వయంగా కూలి పనులకు వెళుతున్న వాతావరణం ప్రపంచంలోనే ఎక్కడైనా చూసారా...? అని పానుగంటి చైతన్య నిలదీశారు. అటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్తితులు ఏపీ అంతటా తాండవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో ఎప్పటికప్పుడే ఫీజు రీయింబర్స్‌మెంట్ నగదు నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలో పడేవని.. గతేడాది ఎన్నికల కోడ్ రావడంతో జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన డబ్బులు మాత్రమే ఆగిపోయాయని పానుగంటి చైతన్య వివరించారు. ప్రస్తుత కూటమి హయాంలో చూసుకుంటే.. ఈ డిసెంబర్ నాటికి మొత్తం 5600 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాల్సి ఉంటే ప్రభుత్వం విడుదల చేసింది కేవలం 700 కోట్లేనని ఆయన తెలిపారు. ఆ లెక్కన ఇంకా 4900 కోట్ల బకాయి అట్లాగే పేరుకుపోయి ఉందని ఆయన వెల్లడించారు. ఇక వసతి దీవెన కింద జగనన్న ప్రభుత్వం ఏటా ఏప్రిల్ మాసంలో 1100 కోట్లు విడుదల చేసిందని.. ఇంజనీరింగ్, డిగ్రీ చదివే విద్యార్థులకు ఏటా 20వేలు, పాలిటెక్నిక్ చదివే విద్యార్థులకు 15వేలు, ఐటిఐ విద్యార్థులకు 10వేలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఇది కూడా 2024 ఏప్రిల్లో ఎన్నికల కోడ్ వలన ఆగిపోయినట్లు చెప్పారు. దీంతో 2025 ఏప్రిల్ నాటికి ఆ బకాయి 2200 కోట్లకు చేరుకుందన్నారు. అవీ ఇవీ కలుపుకుంటే మొత్తం 7100 కోట్ల రూపాయల మేర ఈ ప్రభుత్వం విద్యార్థులకు బాకీ పడిందని ఆయన తేల్చి చెప్పారు. "ఆ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని అడుగుతుంటే అక్రమ కేసులు పెడుతున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులతో కొట్టిస్తున్నారు. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కూడా ఓపిక నశించి పోయింది. ఉరుము ఉరుము కలిసి ఉప్పెనలా మారి కూటమి ప్రభుత్వాన్ని కట్టగట్టి బంగాళాఖాతంలో కలిపే లోగా వెంటనే బకాయిలు విడుదల చేయాలి" అని పానుగంటి చైతన్య డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, ఉపాధ్యక్షుడు నరేంద్రరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గంటి, రవి, పేటేటి నవీన్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు వినోద్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కోమల సాయి, ఒంగోలు జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, మంగళగిరి అధ్యక్షుడు సందీప్, గుంటూరు నగర అధ్యక్షుడు రవి, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శులు కరీం, కిరణ్, రాజేష్, సతీష్, అజయ్, రామకృష్ణ, మస్తాన్, ప్రభు, హరి, సుభాని, బాలు, అబ్బాస్, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.