'లెక్క'లేక చిక్కులు! 

చంద్రబాబు సర్కారు వృద్ధి గణాంకాలన్నీ మిథ్య  

2024–25 ఆర్థిక, ద్రవ్య వినియోగ అకౌంట్స్‌పై కాగ్‌ నివేదిక.. తొలి బడ్జెట్‌ అంతా అంకెల గారడీతో మోసమే 

రెవెన్యూ రాబడుల్లో 3.51 శాతం తగ్గుదల.. రూ.20 వేల కోట్లు హుష్‌ 

19.64 శాతం తగ్గిపోయిన పన్నేతర రాబడి 

ఏకంగా 41.82 శాతం తగ్గిపోయిన కేంద్ర గ్రాంట్లు.. బడ్జెట్‌ కేటాయింపులే తప్ప వ్యయం లేదు 

బడ్జెట్‌ కేటాయింపుల్లో నీటి పారుదల రంగం వ్యయం 42 శాతమే 

వ్యవసాయం 26, గృహ నిర్మాణం 34, ఐటీ, ఎల్రక్టానిక్స్‌ కమ్యూనికేషన్స్‌  వ్యయం 15 శాతమే 

స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు రూ.10 వేల కోట్లు తగ్గిన గ్రాంట్లు 

అమరావతి : తన పాలనలో రాష్ట్రం వృద్ధిలో దూసుకుపోతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న గణాంకాలన్నీ మిథ్యేనని తేలిపోయింది. బాబు తొలి బడ్జెట్‌ అంకెల గారడీతో మోసం చేయడమే తప్ప కేటాయింపులకు తగినట్లు వ్యయం లేదని స్పష్టమైంది. 2024–25లో అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే రెవెన్యూ రాబడులు ఏకంగా 3.51 శాతం తగ్గిపోయాయని తేటతెల్లమైంది. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీకి సమర్పించిన 2024–25 ఆర్థిక ఏడాది ఆర్థిక, ద్రవ్య అకౌంట్స్‌పై కాగ్‌ నివేదికలో ఈ విషయాలన్నీ పూసగుచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

 రాష్ట్రం ఆర్థికంగా తిరోగమనంలో పయనిస్తున్నట్లు కాగ్‌ నివేదిక స్పష్టం చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రెవెన్యూ రాబడులు కూడా 2024–25లో రాలేదని ఈ నివేదిక కుండబద్దలు కొట్టింది. 2023–24 ఆర్థిక ఏడాదితో పోల్చితే 2024–25 ఆర్థిక ఏడాదిలో ఆదాయ వసూళ్లలో 3.51 శాతం తగ్గుదల ఉందని వెల్లడించింది. ఇదే రీతిలో రాష్ట్ర పన్నేతర ఆదాయం 19.64 శాతం తగ్గిపోయిందని స్పష్టం చేసింది. 

కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే ఏకంగా 41.82 శాతం తగ్గిపోయిందని ఎత్తి చూపింది. 2024–25 ఆర్థిక ఏడాది బడ్జెట్‌లో రెవెన్యూ రాబడులు రూ.2,69,928 కోట్లుగా పేర్కొనగా, వాస్తవంగా రూ.2,49,191 కోట్లే వచ్చాయని కాగ్‌ పేర్కొంది. అంటే రెవెన్యూ రాబడులు ఏకంగా రూ.20 వేల కోట్ల మేర తగ్గిపోయాయి. 

మూల ధన వ్యయం బాగా తక్కువ 
బడ్జెట్‌లో కేటాయింపుల మేరకు మూల ధన వ్యయం చేయలేదని.. ఇరిగేషన్, గృహ నిర్మాణం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి తదితర రంగాలకు వ్యయం చేయలేదని కాగ్‌ స్పష్టం చేసింది. 40 రంగాల్లో.. 10 రంగాలకు చేసిన గ్రాంట్లలో 50 శాతం కన్నా తక్కువ వ్యయం చేసినట్లు ఎత్తి చూపింది. మరో పక్క గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలతోపాటు ఇతర సంస్థలకు గ్రాంట్లు కూడా అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 2024–25లో ఏకంగా రూ.10,620 కోట్లు తగ్గిపోయినట్లు పేర్కొంది. 

2024–25లో మూల ధన వ్యయం కింద రూ.45,382 కోట్ల వ్యయం చేయనున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నప్పటికీ, వాస్తవంగా రూ.16,141 కోట్లే వ్యయం చేశారని తెలిపింది. ఇది జీఎస్‌డీపీలో కేవలం ఒక శాతం మాత్రమేనని ఎత్తి చూపింది. అదే 2023–24 ఆర్థిక ఏడాదిలో మూల ధన వ్యయం రూ.23,330 కోట్లు అని పేర్కొంది.    

 

Back to Top