శివరామిరెడ్డిని పరామర్శించిన కాటసాని రామభూపాల్ రెడ్డి 

నంద్యాల జిల్లా:  ఆళ్లగడ్డ నియోజకవర్గంలో దాడి ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. దొర్నిపాడు మండలం కొండాపురం గ్రామానికి చెందిన శివరామిరెడ్డి అనే వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడిపై ఆళ్లగడ్డ శివారులో గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయనకు గాయాలు కాగా వెంటనే స్థానికులు ఆయనను నంద్యాలలోని ఉదయనంద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దాడి విషయం తెలుసుకున్న వైయ‌స్ఆర్‌సీపీ నంద్యాల జిల్లా అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి శివరామిరెడ్డిని పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ కక్షల కారణంగానే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 
 

Back to Top